రాజకీయ బదిలీలు | Sakshi
Sakshi News home page

రాజకీయ బదిలీలు

Published Fri, Jun 24 2016 4:22 AM

రాజకీయ బదిలీలు - Sakshi

తహసీల్దార్ల స్థాన చలనంలో
చక్రం తిప్పిన అధికార పార్టీ నేతలు
మంత్రి సిఫార్సులతో 12 మంది ఎంపీడీఓల బదిలీలు
నిబంధనలను బేఖాతరు  చేసిన యంత్రాంగం

రెవెన్యూ ఉద్యోగుల బదిలీల్లో అధికార పార్టీ నేతలు చక్రం తిప్పారు. పాలనలో సౌలభ్యం కోసం అధికారుల బదిలీలు చేస్తున్నామన్న సీఎం మాటలను టీడీపీ నేతలు తమ ‘సౌలభ్యానికి’ అనుకూలంగా మార్చుకున్నారు. రూల్స్‌గీల్స్ జాన్తానై అంటూ..తాము చెప్పిందే జరగాలంటూ ఉన్నతాధికారులకు హుకూం జారీ చేశారు. ఇంకేముంది నేతల అడుగులకు యంత్రాంగం మడుగులొత్తింది. కోరుకున్నవారికి కోరిన చోట పోస్టింగ్ ఇచ్చి జీ హుజూ ర్ అంటూ సలాం చేసింది.

కడప సెవెన్‌రోడ్స్: అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ పేరుతో జిల్లాలో 18 మంది తహసీల్దార్లు, ఇద్దరు డిప్యూటీ తహసీల్దార్లను, 12 మంది ఎంపీడీఓలను వివిధ ప్రాంతాలకు బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయా బదిలీలు అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో జరిగినట్లు తెలుస్తోంది. టీడీపీ నేతలు కోరుకున్న తహసీల్దార్లను, ఎంపీడీఓలకు పోస్టింగ్‌లు వేయించుకున్నట్లు సమాచారం. మండల స్థాయిలో తమ పనులు జరగాలంటే ఎంపీడిఓలు, తహసీల్దార్లే కీలకం. బదిలీలకు అవకాశమిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీఓ మేరకైతే తమకు ఎలాంటి ఉపయోగం ఉండదని టీడీపీ నేతలు ముఖ్యమంత్రికి మొర పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ముఖ్యమంత్రి ఈనెల 21న కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పది శాతం బదిలీలను ‘అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్’ పేరిట నిర్వహించి తమ పార్టీ నేతలకు సహకరించాలంటూ పరోక్షంగా చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బుధవారం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు జిల్లాకు వచ్చిన సందర్భంగా పలువురు ‘దేశం’ నేతలు ఆయన్ను కలిసి తమకు అనుకూలమైన ఎంపీడీఓలు, తహశీల్దార్లను తమ ప్రాంతాలకు బదిలీ చేయించాలని పట్టుబట్టారు. తమ్ముళ్ల కోరిక మేరకు  మంత్రి బదిలీలకు ‘పచ్చ’జెండా ఊపినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. అలాగే తమకు కావాల్సిన ఎంపీడీఓలను కూడా బదిలీ చేయించుకున్నారని సమాచారం. రాజకీయ బదిలీలపై కొందరు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది.

నిబంధనలకు విరుద్ధంగా...
జీఓ నంబర్ 102 మేరకు నిబంధనలకు విరుద్ధంగా బదిలీల ప్రక్రియను చేపట్టినట్లు రూఢీ అవుతోంది. అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ కింద ఎంపీడీఓల బదిలీలు చేయాల్సి వస్తే ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టరేట్ నుంచి జెడ్పీ చైర్మన్ గూడూరు రవికి సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. ఆమేరకు ఐదుగురు ఎంపీడీఓల ప్రతిపాదనలు పంపితే, అవేవి బదిలీల జాబితాలో లేనట్లు సమాచారం. కాగా  టీడీపీ నేతల సిఫార్సుల మేరకు 12 మంది ఎంపీడిఓల బదిలీలు చేపట్టినట్లు తెలుస్తోంది. నిబంధనల మేరకు సొంత డివిజన్‌లో పోస్టింగ్ ఇవ్వరాదు. అలాగే ఇదివరకే పనిచేసిన మండలంలో కూడ పోస్టింగ్ ఇవ్వరాదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అయినప్పటీకీ ఇవేవి పట్టించుకోకుండా జిల్లా యంత్రాంగం బదిలీలను చేపట్టడం విశేషం. బదిలీల జీఓలకు విరుద్ధంగా చేపట్టడం వెనుక మంత్రి సిఫార్సులే అసలు కారణంగా తెలుస్తోంది.

Advertisement
Advertisement