సన్నాఫ్ స్పీకర్.. వాటాల కోసం గూండాగిరీ

22 Aug, 2016 10:09 IST|Sakshi
సన్నాఫ్ స్పీకర్.. వాటాల కోసం గూండాగిరీ

కోడెల ‘పెదబాబు’ దాష్టీకం...
- రైల్వే కూలీలు, ఉద్యోగులపై అనుచరుల దాడి
- పనుల వద్ద ఏర్పాటు చేసిన షెడ్‌లను పీకేసి దౌర్జన్యం
- మూడు లారీలు, ఒక రైల్వే ఉద్యోగి కారు ధ్వంసం
-  డ్రైవర్, సూపర్ వైజర్‌ల కిడ్నాప్
- పర్సంటేజీ ఇవ్వకుండా పనిచేస్తారా అంటూ వార్నింగ్
- ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయకపోతే తగలబెడతామంటూ బెదిరింపులు

 
సాక్షి, గుంటూరు : ‘‘పెదబాబుకు చెప్పకుండా.. ఆయన అనుమతి లేకుండా.. పనులు చేయడానికి మీకెంత ధైర్యంరా...’’ అంటూ రైల్వే కూలీలు, ఉద్యోగులపై కొందరు గూండాలు విచక్షణారహితంగా దాడి చేయడం ఆదివారం గుంటూరు జిల్లాలో కలకలం సృష్టించింది.. అధికార పార్టీ నేతల గూండాగిరికి ఇదో మచ్చుతునక.. ఎక్కడ ఏ పని జరిగినా అందులో వాటా ఇవ్వాల్సిందేనంటూ ‘తమ్ముళ్లు’ సాగిస్తున్న దౌర్జన్యకాండకు ఇది ప్రత్యక్ష నిదర్శనం. ‘పెదబాబు’ అంటే స్పీకర్ కోడెల శివప్రసాదరావు పెద్దకుమారుడు శివరామకృష్ణే అని సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాలలో ఎవరినడిగినా చెబుతారు. 

గుంటూరు జిల్లా రాజుపాలెం మండలానికి చెందిన సుమారు 35 మంది శివరామకృష్ణ అనుచరులు పెదనెమలిపురి గ్రామ పరిధిలో నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే పనులు చేస్తున్న ప్రాంతంలో విధ్వంసం సృష్టించారు. అక్కడ పనులు పర్యవేక్షిస్తున్న వారితోపాటు, పనులు చేస్తున్న కూలీలపై విచక్షణా రహితంగా దాడులు చేసి తీవ్రంగా గాయపరిచారు. అంతటితో ఆగకుండా వారు నివాసం  ఉండేందుకు ఏర్పాటు చేసుకున్న షెడ్‌లను, అక్కడ పనులు నిర్వహిస్తున్న టిప్పర్ వాహనాలను, అధికారుల వాహనాలను సైతం ధ్వంసం చేశారు. ఓ డ్రైవర్‌తోపాటు, సైట్ సూపర్‌వైజర్‌ను కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లారు.దీంతో కూలీలు, రైల్వే ఉద్యోగులు, తీవ్ర భయాందోళనతో పరుగులు తీశారు. తమకు వాటా ఇవ్వకుండా పనులు నిర్వహిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోడెల తనయుడు గతంలోనే రైల్వే కాంట్రాక్టరును పలుమార్లు బెదిరించారన్న ఆరోపణలున్నాయి. మాట వినకపోవడంతో రెండు నెలల క్రితం రైల్వే పనులు జరుగుతున్న ప్రాంతంలో దాడి చేశారు. అయినా దారికి రాకపోవడంతో   రైల్వే ఉద్యోగులు, కాంట్రాక్టర్, కూలీలపై మరోమారు ఆదివారం దాడులకు తెగబడ్డారు. బాధితుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

కర్రలు, రాడ్లతో దాడి
ఆదివారం మధ్యాహ్న సమయంలో మూడు కార్లు, పలు ద్విచక్ర వాహనాలలో సుమారు 35 మంది దుండగులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. కర్రలు, రాడ్లతో బీభత్సం సృష్టించారు.  ఇక్కడ పనులు నిలిపివేయకుంటే ప్రాణాలు తీస్తాం, షెడ్‌లను తగలబెడతామంటూ బెదిరింపులకు దిగారు. కూలీలు ఉండే రేకుల షెడ్‌లను పీకేశారు. మూడు టిప్పర్ల అద్దాలను ధ్వంసం చేశారు. రైల్వే శాఖకు చెందిన బొలేరో కారు అద్దాలను ధ్వంసం చేశారు. రైల్వే సిబ్బందిగా ఉన్న  డ్రైవర్ కృష్ణ, సూపర్‌వైజర్ ఎమ్‌డీ ఉస్మాన్‌లను కొట్టుకుంటూ తమ వాహనాల్లో ఈడ్చి పడేసి కిడ్నాప్ చేశారు. కర్రలతో, రాడ్లతో కార్మికులపై దాడి చేసి భయభ్రాంతులకు గురిచేశారు. తీవ్రంగా భయపడిన కూలీలు అక్కడి నుంచి పరుగులు తీశారు. కొద్ది సేపటి తరువాత తేరుకున్న కూలీలు రైల్వే శాఖ ఉద్యోగులకు సమాచారం అందించి, స్వల్ప గాయాలైన క్షతగాత్రులను పిడుగురాళ్లలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఘటనపై పలువురు సిబ్బంది మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పనులకు స్థానిక నాయకులు వాటాలు అడుగుతూ అడ్డు తగలడం దారుణమన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే పనులు నిలిపివేస్తామన్నారు.

వాటా కోసం కాంట్రాక్టర్‌పై ఒత్తిడి...
రాజుపాలెం మండలం పెదనెమలిపురి గ్రామం వద్ద నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే పనులు గత ఐదు నెలలుగా జరుగుతున్నాయి. పెదనెమలిపురి నుంచి రొంపిచర్ల వరకు 16 కిలోమీటర్ల మేర రైల్వే నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. ఇక్కడ భూములు కోల్పోయిన రైతులకు ఇప్పటికే నష్టపరిహారం అందించి భూములను సైతం స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రతి పనికి పర్సంటేజీలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలెదుర్కొంటున్న కోడెల తనయుడు తన వాటా పంపాలంటూ సదరు కాంట్రాక్టర్‌కు  పలు మార్లు  కబురు పంపారని తెలుస్తోంది. అయితే వాటిని కాంట్రాక్టరు పట్టించుకోకపోవడంతో కోడెల తనయుడి అనుచరులు రెండు నెలల క్రితం దాడి చేసి టిప్పర్లు, వాహనాలను ధ్వంసం చేయడంతోపాటు, పోలీసులతో బెదిరించినట్లు ఆరోపణలొచ్చాయి. అప్పట్లో దీనిపై సదరు కాంట్రాక్టర్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వద్ద పంచాయతీ కూడా పెట్టాడని సమాచారం. అయితే ఎవరు చెప్పినా  తన వాటా ఇవ్వనిదే పనులు కొనసాగనిచ్చేందుకు అంగీకరించని కోడెల తనయుడు తన అనుచరులతో ఆదివారం రైల్వే పనులు చేపడుతున్న కార్మికులపై దాడికిదిగారు.
 
షెడ్‌లు ఖాళీ చేయకుంటే తగలబెడతామన్నారు
పది నిమిషాల్లో షెడ్‌లు ఖాళీ చేయాలని, లేకుంటే తగలబెడతాం అని రాళ్లతోను, ఇనుప రాడ్లతోను కూలీలపై ఎగబడ్డారు. అధికార పార్టీ నాయకులకు చెప్పకుండా పనులు చేస్తారా, మేమంటే లెక్కలేదా అంటూ దుర్భాషలాడారు.         
-జి రవికుమార్, సైట్ ఇంజనీర్
 
పది నిమిషాల్లో బీభత్సం
పనులు వెంటనే నిలిపివేసి పదినిమిషాల్లో ఈప్రాంతాన్ని ఖాళీ చేయాలని హెచ్చరిస్తూ తెలుగుదేశం నాయకులు బీభత్సం సృష్టించారు. పెదబాబుకు చెప్పకుండా, ఆయన అనుమతి లేకుండా పనులు చేయడానికి మీకు ఎంత ధైర్యంరా...  అంటూ మాపై ఎగబడ్డారు. అడ్డు వచ్చిన వారిని చితకబాదారు.
-బి ప్రవీణ్‌రెడ్డి, సైట్ సూపర్‌వైజర్
 
స్థానిక నేతలకు చెప్పే పనిలేదా
పనులు ప్రారంభించే సమయంలో అధికార పార్టీ సర్పంచ్‌లకు, ఎంపీటీసీలకు, ఎంపీపీకి చెప్పే పనిలేదురా.. అంటూ దుర్భాషలాడారు. మా నాయకుడిని ఎదిరించే ధైర్యం మీకెవరిచ్చార్రా....  క్షణాల్లో ఖాళీ చేయకపోతే జీపులు, టిప్పర్లు తగలబెడతాం అంటూ బెదిరించారు.
-జి రామిరెడ్డి, సైట్ సూపర్‌వైజర్

>
మరిన్ని వార్తలు