ఈ వెలుగుల వెనుక ఓ ‘శక్తి’ | Sakshi
Sakshi News home page

ఈ వెలుగుల వెనుక ఓ ‘శక్తి’

Published Mon, Aug 22 2016 1:40 AM

ఈ వెలుగుల వెనుక ఓ ‘శక్తి’

సింధు పతకం గెలవగానే ఎవరికి వాళ్లు ‘మా వల్లే మా వల్లే’ అంటూ లేని గొప్పతనాన్ని తమకు ఆపాదించుకుంటున్నా... హైదరాబాద్ బ్యాడ్మింటన్ హబ్‌గా మారడం వెనక గోపీచంద్ ఆలోచనతో పాటు ఓ బలమైన ‘శక్తి’ సహకారం ఉంది. కేవలం స్నేహం కోసం ఆ రోజుల్లోనే ఐదు కోట్ల రూపాయలు ఇచ్చిన ఆ శక్తి పేరు నిమ్మగడ్డ ప్రసాద్. ఆ రోజుల్లో ఆయన ఇచ్చిన ఆర్థిక సహకారం వల్లే ఈ రోజు బ్యాడ్మింటన్ ఈ స్థాయిలో నిలబడగలిగిందంటే అతిశయోక్తి కాదు.
 
* స్నేహం కోసం అకాడమీకి డబ్బు ఇచ్చిన నిమ్మగడ్డ ప్రసాద్    
* 2003లోనే ఐదు కోట్ల రూపాయలు సహాయం

సాక్షి క్రీడావిభాగం: గోపీచంద్ దగ్గర స్థలం ఉంది... అకాడమీ ఎలా నిర్మించాలనే ఆలోచన ఉంది... ప్రపంచస్థాయి వసతులతో మంచి అకాడమీ నిర్మిస్తేనే గొప్ప ఫలితాలు వస్తాయి... కానీ చేతిలో డబ్బు లేదు... తన అకాడమీ కల సాకారం కావాలంటే కనీసం నాలుగు కోట్ల రూపాయలు కావాలి... ఎలా..? 2003లో గోపీచంద్ అకాడమీ నిర్మాణానికి పూనుకున్న సమయంలో ఉన్న పరిస్థితి ఇది. ప్రభుత్వం స్థలం అయితే ఇచ్చిందిగానీ అకాడమీ నిర్మాణానికి డబ్బు మాత్రం ఇవ్వదు.

ఈ సమయంలో ఒక కార్పొరేట్ సంస్థను కలిసి ఆయన తన ప్రయత్నాన్ని వెల్లడించారు. ఒకసారి తేరిపార చూసిన ఆయన... ‘మన దేశంలో బ్యాడ్మింటన్‌ను ఎవరు పట్టించుకుంటారండీ’ అంటూ ఒక వ్యంగ్య విమర్శ చేశాడు. ఇలాంటి సమయంలో ప్రసాద్‌ను కలిసి గోపి అకాడమీ గురించి వివరించి, నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పాడు. అప్పటికే వ్యాపారంగంలో బాగా ఎదిగిన ప్రసాద్... ఏ మాత్రం ఆలోచించకుండా సహాయం చేశారు.

రెండు కోట్ల రూపాయలు డొనేషన్‌గా ఇచ్చారు. మరో రెండు కోట్లు ఇస్తామని చెప్పిన వేరేవాళ్లు ఎంతకీ ఇవ్వలేదు. దీంతో మిగిలిన రెండు కోట్లు కూడా ప్రసాద్ ఇచ్చేశారు. అకాడమీ పూర్తయినా నిర్వహణకు డబ్బులు లేక మళ్లీ కష్టాలు ఎదురయ్యాయి. ఈ సమయంలో ప్రసాద్ మరో కోటి రూపాయలు ఇచ్చేశారు. దీంతో అకాడమీ సాఫీగా నడిచింది. అందుకే గోపీ ఈ అకాడమీకి ‘నిమ్మగడ్డ ఫౌండేషన్ గోపీచంద్ అకాడమీ’ అని పేరు పెట్టాడు.
 
ఎంత డబ్బున్నా ఐదు కోట్ల రూపాయలు ఊరికే ఇవ్వడం అంటే చాలామందికి మనసు రాదు. నిజానికి 13 సంవత్సరాల క్రితం ఇది చాలా పెద్ద మొత్తం. మరి ప్రసాద్ ఎందుకు ఇచ్చారు..? దీనికి సమాధానం స్నేహం. గోపీ బ్యాడ్మింటన్ స్టార్ కాకముందే ప్రసాద్, గోపీ తండ్రి స్నేహితులు. ఎల్బీ స్టేడియంకు సమీపంలోని ఒక ఇంట్లో పక్క పక్క పోర్షన్‌లలో ఉండేవారు. సహజంగానే మధ్య తరగతి కుటుంబాల్లో పెరిగే స్నేహం... పక్కపక్కన ఉన్న ఈ ఇద్దరి కుటుంబాలకూ పెరిగింది. ఆ తర్వాత ఉద్యోగ బాధ్యతల దృష్యా గోపీ తండ్రి నిజామాబాద్ వెళ్లిపోయారు.

ఇటు ప్రసాద్ మ్యాట్రిక్స్ లేబోరేటరీస్ ద్వారా ఉన్నతస్థితికి వెళ్లారు. ఎంత ఎదిగినా ఆ కుటుంబాల మధ్య స్నేహం మాత్రం అలాగే కొనసాగింది. ఆటలపై మొదటి నుంచి ఆసక్తి చూపే ప్రసాద్... గోపీ అకాడమీ ప్రతిపాదనతో రాగానే వెంటనే సహాయం చేశారు. గత పుష్కర కాలంలో నగరంలో బ్యాడ్మింటన్ బాగా అభివృద్ధి చెందింది. క్రమంగా గోపీచంద్ అకాడమీ అనే పేరుతోనే అందరూ గుర్తుంచుకున్నారు. కానీ ఇప్పటికీ, ఎప్పటికీ ఆ అకాడమీ పేరు ‘నిమ్మగడ్డ ఫౌండేషన్ గోపీచంద్ అకాడమీ’.
 
ప్రపంచస్థాయి అకాడమీ నిర్మిస్తానని గోపీ వచ్చినప్పుడు చాలా సంతోషం వేసింది. మళ్లీ నాకు డబ్బు తిరిగి ఇవ్వొద్దు. ఒక ఒలింపిక్ పతకం తెచ్చి చూపించండి అని అడిగాను. కచ్చితంగా తెస్తానని మాట ఇచ్చాడు. 2012లోనే సైనా రూపంలో గోపీ పతకం తెచ్చాడు. ఇప్పుడు సింధు రజతం తెచ్చేసింది. నాకు ఇచ్చిన మాట నిలుపుకున్నాడు. భారత్‌కు ఒలింపిక్ పతకం మన అకాడమీ నుంచి రావడం గర్వకారణం’
- నిమ్మగడ్డ ప్రసాద్
 
ఆటల పట్ల ఆసక్తి
క్రీడల పట్ల ఆసక్తి ఉన్నా గతంలో ప్రసాద్ ఎప్పుడూ ఆటలకు సంబంధించిన వ్యాపారంలోకి రాలేదు. ఏ రంగంలో అడుగుపెట్టినా విజయం సాధించే వ్యక్తిగా వ్యాపార వర్గాల్లో పేరున్న ప్రసాద్... ఇప్పుడు ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ ద్వారా ఇందులోకి వచ్చేశారు. సచిన్ టెండూల్కర్ యజమానిగా ఉన్న కేరళ బ్లాస్టర్స్ జట్టులో ప్రసాద్, చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్ కలిసి వాటాలు కొన్నారు. భవిష్యత్తులోనూ క్రీడల్లో మరింతగా భాగం కావాలని ఆయన భావిస్తున్నారు.

‘నా చిన్నతనంలో నేను క్రికెట్ ఆడుకోవడానికి వెళితే మా నాన్న బ్యాట్ విరగ్గొట్టి చదువుకోమన్నారు. అప్పటితరంలో చదువుకే ప్రాధాన్యత. కానీ ఇప్పుడు ప్రాధాన్యతలు మారాయి. స్పోర్ట్స్ కూడా ప్రొఫెషనల్‌గా మారాయి. ఒక ఇంట్లో ఒక్కరికి ఉద్యోగం వస్తే ఆ చుట్టూ ఉన్న పది ఇళ్లలో పిల్లలు కూడా అదే మార్గంలో వచ్చి ఉద్యోగాలు వెతుక్కుంటారు. ఇప్పుడు సింధు విజయం సాధించిన తర్వాత మరింత మంది బ్యాడ్మింటన్‌లోకి వస్తారు’ అని ప్రసాద్ అన్నారు.

Advertisement
Advertisement