ముస్తాబాద హైస్కూల్‌లో ఆందోళన

20 Oct, 2016 23:38 IST|Sakshi
ముస్తాబాద హైస్కూల్‌లో ఆందోళన

ముస్తాబాద (గన్నవరం రూరల్‌) :   ముస్తాబాద జెడ్పీ హైస్కూల్‌లో గురువారం తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. హెచ్‌ఎం ఎ.వెంకటేశ్వరరావు తమ మనుమరాలు యాదల తనూజను కొట్టాడని పేర్కొంటూ సూరంపల్లి గ్రామం నుంచి బాలిక తాత వెంకటేశ్వరరావు, తల్లి జోస్పిన్‌ తదితరులు పాఠశాలకు రావటంతో గందరగోళం ఏర్పడింది. మాజీ ఎంపీటీసీ దాసే బాబూరావు, స్థానిక యువకులు పాఠశాలలో తరచూ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎన్నిసార్లు చెప్పినా పరిస్థితిలో మార్పు రావటం లేదంటూ హెచ్‌ఎం పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న తనూజను బడికి రాలేదని బుధవారం హెచ్‌ఎం కొట్టాడు. దీంతో విద్యార్థి స్పృహ కోల్పోవటంతో పీఈటీ సురేష్‌ బాబు ముస్తాబాద పీహెచ్‌సీకి తీసుకెళ్లి చికిత్స చేయించారు. బుధవారం సాయంత్రం విద్యార్థి తనూజ సూరంపల్లిలోని ఇంటి వద్ద వాంతులు చేసుకుని పడిపోవటంతో కుటుంబ సభ్యులు ఆరాతీశారు. పాఠశాలలో హెచ్‌ఎం కొట్టాడని చెప్పటంతో, ఆ విషయం తెలుసుకునేందుకు తాత, బంధువులు గురువారం పాఠశాలకు వచ్చారు. తనూజ పాఠశాలలో మళ్లీ పడిపోవటంతో ముస్తాబాద పీహెచ్‌సీకి తరలించారు. డాక్టర్‌ ఆనంద్‌బాబు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం తీసుకెళ్లాలని సూచించటంతో హైస్కూల్‌కు చేరుకుని, అక్కడి నుంచి 108 వాహనంలో చిన్నఆవుటపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై గ్రామస్తులు, తనూజ తాత డీఈవో సుబ్బారెడ్డికి ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేయటంతో ఆయన విచారణకు ఆదేశించారు. నూజివీడు డీవైఈవో రవిసాగర్‌ మధ్యాహ్నం పాఠశాలకు వచ్చి తనూజ సహచర విద్యార్థులను జరిగిన సంఘటపై విచారణ చేశారు. డీవైఈవో ‘సాక్షి’తో మాట్లాడుతూ విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి నివేదిక రూపొందించి డీఈవోకు పంపుతామని చెప్పారు. తనూజ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు బాలిక బంధువులు తెలిపారు.  

 

మరిన్ని వార్తలు