పెండింగ్‌ బిల్లుల వసూళ్లపై కథలొద్దు

19 Aug, 2016 00:39 IST|Sakshi
పెండింగ్‌ బిల్లుల వసూళ్లపై కథలొద్దు
  • విద్యుత్‌శాఖ సిబ్బందిపై సీఈ నందకుమార్‌ ఆగ్రహం
  •  
    నెల్లూరు (టౌన్‌): జిల్లా వ్యాప్తంగా  గృహాలకు సంబంధించి బిల్లులు కట్టని 2408 సర్వీసులను తొలగించి ఉన్నామని, వాటి నుంచి సుమారు రూ. కోటి మేర బిల్లులు వసూలు కావాల్సి ఉందని, రెండు నెలలుగా బిల్లులు వసూళ్లు చేయమని చెబుతున్నా, ఎందుకు చేయడం లేదని విద్యుత్‌ శాఖ ఏడీఈ, ఏఈలపై ఆ శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ నందకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక విద్యుత్‌ భవనంలోని స్కాడా సమావేశ మందిరంలో డీఈలు, ఏడీఈలు, ఏఈలతో గురువారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూరల్‌ డివిజన్‌లో 1827 సర్వీసులు ఉన్నాయన్నారు.
    నగరంలో ఇంతమంది కరెంట్‌ లేకుండానే నివశిస్తున్నారా.. వారికి సంబంధించిన మిగిలిన కనెక్షన్లు ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. మరమ్మతుల పేరుతో గంటల తరబడి సరఫరాను నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడీఈలు 33కేవీ, ఏఈలు 11కేవీ ఫీడర్లను ప్రతి నెలా తనిఖీ చేయాలని చెప్పినా ఎక్కడా అమలు కావడం లేదని మండిపడ్డారు. జిల్లాలో విద్యుత్‌ చోరీలపై వారంలో ఒకరోజు తనిఖీలు నిర్వహించి శనివారం నాడు నివేదిక అందించాలని  ఆదేశించారు.
    వీధిలైట్లు, వాటర్‌ సర్వీసులకు మీటర్లు బిగించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు. హెచ్‌డీ, సీసీ మీటర్లకు ఏడీఈలు మాత్రమే రీడింగ్‌ తీయాలని ఆదేశించారు. ఆక్వా కల్చర్‌ సర్వీసులకు సంబంధించి మీటర్లను క్రాస్‌ చెకింగ్‌ చేయాలన్నారు. ఈ సమావేశంలో ట్రాన్స్‌కో ఎస్‌ఈ కళాధరరావు, టెక్నికల్‌ డీఈ రమాదేవి, సీనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
>
మరిన్ని వార్తలు