నిర్లక్ష్యపుముద్ర

7 Sep, 2017 08:55 IST|Sakshi
నిర్లక్ష్యపుముద్ర

అందని సిగ్నల్స్‌
మొరాయిస్తున్న సర్వర్లు
మందకొడిగా పింఛన్ల పంపిణీ
♦  వెర్షన్‌ మారినా తప్పని వెతలు
♦  లబ్ధిదారులకు అవస్థలు


భీమడోలు :
రోజుకో కొత్త పరికరం.. సహకరించని అప్‌డేట్‌ వెర్షన్లు.. సర్వర్‌ మొరాయింపు.. అందని సిగ్నల్స్, పడని వేలి ముద్రలు ఇవి పింఛన్ల పంపిణీ ప్రక్రియలో ఎదురవుతోన్న సమస్యలు. ప్రతినెలా ఒకటో తేదీనే పింఛన్ల పంపిణీ ప్రారంభిస్తున్నా లక్ష్యం మేరకు ప్రక్రియ పూర్తికావడంలేదు. పింఛన్ల పంపిణీలో నిర్లక్ష్యం కొనసాగుతోంది. ఈనెల ఏడో తేదీ నాటికే పింఛన్ల సొమ్ము పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలన్న అధికారుల ఆదేశాలు నెరవేరేలాలేవు. సిగ్నల్స్‌ అందక సర్వర్‌ మొరాయించడంతో మండుటెండలోనే లబ్ధిదారులు పడిగాపులు పడాల్సి వస్తోంది. జిల్లాలో 3,72,816 మంది సామాజిక పింఛను లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో 3,16,482 మందికి అంటే 84.75 శాతం ప్రక్రియ బుధవారం సాయంత్రానికి పూర్తయింది. భీమడోలు మండలానికి 16 ట్యాబ్‌లు ఇచ్చినా పింఛన్ల పంపిణీ ప్రక్రియ మండకొడిగా సాగుతోంది. ఈ మండలంలో 6,578 లబ్ధిదారులు ఉండగా 5,281కి పింఛను సొమ్ము అందించారు. అంటే ఇప్పటికి 80.28 శాతం పూర్తయింది. జిల్లాలోని 57 మండలాల్లో కొవ్వూరు అర్బన్‌ పింఛన్ల పంపిణీలో ఈ నెల మొదటి స్థానంలో ఉండగా, భీమడోలు మండలం 46వ స్థానంలో ఉంది. కొవ్వూరు అర్బన్‌ పరిధిలో 2,799 మందికి 2,685 మందికి పింఛన్లు అందించారు. అంటే 95.93 శాతం పంపిణీ ప్రక్రియ పూర్తయింది.

త్రీజీ ట్యాబుల్లో కొత్త వెర్షన్‌తో ఇబ్బందులు
ప్రస్తుతం మార్కెట్‌లో 4జీ ట్యాబ్‌లు హల్‌చల్‌ చేస్తున్నా అధికారులు మాత్రం త్రీజీ ట్యాబ్‌లను అందించి చేతుల దులుపుకోవడంతో పింఛన్ల పంపిణీలో సాంకేతిక ఇబ్బందులు తప్పడంలేదు. రెండున్నరేళ్ల క్రితం పంపిణీ చేసిన బీఓ ట్యాబ్‌ల్లో 3.2 నుంచి పలు వెర్షన్‌లు మార్పు చేసి గత నెల వరకు అందించారు. ఈ నెల కొత్త ట్యాబ్‌ల్లో నూతన వెర్షన్‌ను పొందుపర్చారు. ఇదే సమస్యగా మారింది. 3జీ ట్యాబుల్లో 4.2 వెర్షన్‌ అప్‌డేట్‌ చేయడంతో సహకరించడంలేదు. బయోమాట్రిక్‌ మెషీన్లలో వేలిముద్రలు పడడంలేదు. దీంతో లబ్ధిదారులు రెండు మూడు రోజులు ఆయా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. వృద్ధులు నానా అవస్థలు పడుతున్నారు. పనిచేసే చోట మూడు గంటలకే మెషీన్‌ చార్జింగ్‌ అయిపోతుంది. గతంలో వలే మెషీన్‌ పనిచేస్తుండగా చార్జీంగ్‌ పెట్టే పరిస్థితి ఇప్పుడులేదు. దీంతో చార్జింగ్‌ పూర్తిగా అయిపోయిన తర్వాత చార్జింగ్‌ పెట్టాల్సి వస్తోంది.

మరిన్ని వార్తలు