కాయ్‌ రాజా కాయ్‌

30 Aug, 2016 21:41 IST|Sakshi
కాయ్‌ రాజా కాయ్‌
  • జిల్లాలో జోరుగా పేకాట 
  • గెలుపోటములపై కూడా పందేలు
  • రోజూ చేతులు మారుతున్న భారీ నగదు
  • నిర్వాహకులకు పర్సంటేజీలు
  • దండిగా పోలీసుల అండదండలు!
  •  
    రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా పరిధిలో జోరుగా పేకాట సాగుతోంది. గతంలో లాడ్జీలు, ఇళ్లులు అద్దెకు తీసుకుని పేకాట నిర్వహించేవారు. పోలీసుల దాడుల నేపథ్యంలో నిర్వాహకులు కొత్త పంథాలు, వ్యూహాలు అనుసరిస్తున్నారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా పట్టణ శివారు ప్రాంతాల్లో్ల పేకాట నిర్వహిస్తున్నారు.
    – సాక్షి, రాజమహేంద్రవరం
     
    నిత్యం రాత్రి నుంచి వేకువజామున ఐదు గంటల వరకు పేకాట యథేచ్ఛగా ఆడుతున్నారు. రాజమహేద్రవరంలోని క్వారీ ఏరియా, గాదిరెడ్డి నగర్‌ల్లో ఓ మాజీ కార్పొరేటర్‌ పేకాటను నిర్వహిస్తున్నాడు. ఇక్కడ నిత్యం రూ.20 లక్షల వరకు చేతులు మారుతున్నాయి. గెలుపోటములపై కూడా పందేలు కాస్తున్నారు. పేకాట రాయుళ్లకు కావాల్సిన భోజనం, ఇతర అవసరాలు అన్నీ నిర్వాహకులే సమకూరుస్తున్నారు. వీరు ప్రతి ఆటకు వచ్చే మొత్తంపై పర్సంటేజీలు తీసుకుంటున్నారు. రాజమహేంద్రవరంలో నిర్వహించే పేకాట ద్వారా ఓ మాజీ కార్పొరేటర్‌కు రోజుకు రూ.50 వేలు పర్సంటేజీల రూపంలో అందుతున్నట్టు సమాచారం.
     
    స్థానికులకు అనుమానం రాకుండా..
    రాజానగరం పోలీసు స్టేషన్‌ పరిధిలోని మధురపూడి, దివాన్‌చెరువు, పాలచర్లలో పేకాట యథేచ్ఛగా సాగుతోంది. ఆయా ప్రాంతాల్లో ఒకే వ్యక్తి వీటిని నిర్వహిస్తున్నాడు. రోజుకో చోట చొప్పన పేకాట నిర్వహిస్తూ పోలీసులుకు, స్థానికులకు అనుమానం రాకుండా వ్యవహరిస్తున్నారు. గోకవరం శివారు ప్రాంతాల్లో జరుగుతున్న పేకాటలో రోజుకు రూ.10 లక్షలు చేతులు మారుతున్నట్టు సమాచారం. జగ్గంపేట నియోజకవర్గం ఏలేశ్వరం కాలువ గట్టును పేకాటరాయుళ్లు తమ స్థావరంగా మార్చుకున్నారు.
     
    కోనసీమలో ఏటిగట్లపై..
    కోనసీమలో కూడా పేకాట యథేచ్ఛగా సాగిపోతోంది. రావులపాలెం కేంద్రంగా ఏటిగట్లపై గుట్టుచప్పుడు కాకుండా పేకాట సాగుతోంది. పోలీసులు అడపాదడపా దాడులు చేసి పేకాట రాయుళ్లను అరెస్టు చేస్తున్నారు. రాజకీయ నేతల పలుకుబడితో వారు బయటపడుతున్నారు. బయటి ప్రాంతాల వ్యక్తులూ ఇక్కడికి వచ్చి పేకాట ఆడుతున్నారు. రాజమహేంద్రవరంలో భారీ స్థాయిలో పందేలు జరుగుతున్నట్టు సమాచారం. ఇక్కడ నిర్వాహకులకు ఆయా ప్రాంతాల పరిధిలోని పోలీసుల అండదండలు దండిగా ఉన్నట్టు ఆరోపణలున్నాయి. మాముళ్ల రూపంలో ప్రతినెలా రూ.3.5 లక్షలు ఆ ప్రాంత స్టేషన్‌కు అందుతున్నట్టు సమాచారం.
     
    కఠిన చర్యలు తీసుకుంటాం
    పేకాట ఆడుతున్నట్టు సమాచారం ఉంది. నిఘా పెడుతున్నాం. నిర్వాహకులు, పేకాట ఆడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలు తమకు తెలిసిన సమాచారం అందజేయాలి.
    – బి.రాజకుమారి, రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా ఎస్పీ
     
మరిన్ని వార్తలు