అన్నదాతకు ‘సహకారం’

25 May, 2016 01:43 IST|Sakshi
అన్నదాతకు ‘సహకారం’

ఖరీఫ్‌కు సరిపడా విత్తనాలందిస్తాం
డ్రిప్పులో జిల్లాకే అధిక ప్రాధాన్యం
రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
గంగాపూర్, జగదేవ్‌పూర్ సొసైటీల్లో విత్తనాల పంపిణీ

 చిన్నకోడూరు/జగదేవ్‌పూర్: రైతులకు అందుబాటులో ఉండేలా సహకార సంఘాలను బలోపేతం చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన చిన్నకోడూరు మండలం రామంచ గ్రామంలోని గంగాపూర్ సహకారం సంఘంలో, మండల కేంద్రమైన జగదేవ్‌పూర్‌లో విత్తన విక్రయ కేంద్రాలను ప్రారంభించి సబ్సిడీ విత్తనాలను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఒకప్పుడు సరిపడా విత్తనాలు, ఎరువులు అందక రైతులు అనేక ఇబ్బందులు పడేవారన్నారు. ఇప్పుడు అలాంటి సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టామన్నారు. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. సహకార సంఘాలను బలోపేతం చేస్తూ.. వారికి సరిపడా విత్తనాలు, ఎరువులు అందేలా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. వ్యవసాయ శాఖ, సహకార శాఖలు సమన్వయంతో పనిచేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.

విత్తనాల అవసరాన్ని గుర్తించాలి...
గ్రామాల్లో విత్తనాలు ఏ మేరకు అవసరమో అధికారులు గుర్తించాలని మంత్రి సూచిం చారు. కాకి లెక్కలు చెప్పకుండా.. రైతులు ఎంత మేర పంట సాగు చేస్తున్నారో పరిశీ లించి, రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. రికార్డుల ప్రకారం విత్తనాలు, ఎరువులు తెప్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 60 లక్షల ఎకరాలకు సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. విత్తన, ఎరువుల సరఫరాలో సహకార సంఘాల పాత్ర అమోఘమన్నారు. ఈ ఖరీఫ్ కు 8.16 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సిద్ధంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 906 సహకార సంఘాలు పని చేస్తున్నాయని, 3,074 మంది సిబ్బంది పనిచేస్తున్నట్టు చెప్పారు. 470 మంది ఏఓలు,1117మంది ఏఈఓలు, 170 మంది ఏడీలు పని చేస్తున్నారన్నారు. జిల్లాలో 24,500 హెక్టార్లకు డ్రిప్పు సౌకర్యం కల్పించి నట్టు మంత్రి తెలిపారు. అలాగే 15 వేల హెక్టార్లకు పాలీహౌస్ అందించామని వివరించారు. రాష్ట్రంలోనే మెదక్ జిల్లాకు అధికంగా డ్రిప్పు అందించామన్నారు. అంతకుముందు గంగారంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని సొసైటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. జగదేవ్‌పూర్ రైతులకు ట్రాక్టర్లు అందించే విధంగా కృషి చేస్తామని, అలాగే మార్కెట్ యార్డు కోసం మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకపోతామని హామీ ఇచ్చారు. త్వరలోనే 24 గంటల కరెంట్ సరఫరా చేయనున్నట్లు చెప్పారు.

 జగదేవ్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో సీడ్స్ కార్పొరేషన్ ఎండీ మురళి, హార్టికల్చరల్ కమిషనర్ వెంకట్రాంరెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ సురేంద్ర, బ్యాంకు సీఈఓ శ్రీనివాస్‌రావు, డీఆర్‌డీఏ పీడీ సత్యనారాయణరెడ్డి, జేడీఏ మాధవి శ్రీలత, ఉద్యాన శాఖ డీడీ రామలక్ష్మి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, గఢా ఓఎస్డీ హన్మంతరావు, పీఏసీఎస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ రామచంద్రం, జగదేవ్‌పూర్ ఎంపీపీ రేణుక, సర్పంచ్ కరుణాకర్, ఎంపీటీసీలు వెంకటయ్య, బాలేషంగౌడ్, ఏడీఏ శ్రావణ్‌కుమార్, ఏఓ నాగరాజు, సురేశ్‌కుమార్, చక్రపాణి, తహసీల్దార్ పరమేశం, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు. గంగాపూర్‌లో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి, జెడ్పీటీసీ నమూండ్ల కమల రామచంద్రం, పీఏసీఎస్ చైర్మన్‌లు మూర్తి బాల్‌రెడ్డి, కీసరి పాపయ్య పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు