హరితహారంలో సారంగా‘పూర్‌’

2 Aug, 2016 23:39 IST|Sakshi
సారంగాపూర్‌ : హరితహారంలో సారంగాపూర్‌ వెనుకబడి ఉందని ఉన్నతాధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం మండలపరిషత్‌ కార్యాలయంలో ఉపాధి సిబ్బంది, ఇతర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. డ్వామా ఏపీడీ కుందారపు లక్ష్మీనారాయణ నిర్దేశించిన లక్ష్యాన్ని పదిరోజుల్లో ఎలా పూర్తిచేయాలన్న విషయంపై చర్చించారు.  ఎంపీపీ శారద, ప్రత్యేకాధికారి అంబయ్య, ఎంపీడీవో పుల్లయ్య, ఈజీఎస్‌ ఏపీవో అంకూస్‌ అహ్మద్‌ పాల్గొన్నారు.
విఫలం అయింది ఇలా..
ప్రారంభంలో మండల అధికారికి ఒక గ్రామాన్ని అప్పగించారు. హడావుడిగా మెుక్కలు నాటడం మెుదలు పెట్టారు. ప్రభుత్వ కార్యాలయాలు, కమ్యూనిటీæ సెంటర్లు, పాఠశాలలు, రైతుల పంట పొలాల గట్లు, రోడ్ల వెంట మొక్కలు నాటారు. గడువు ముగిసే సమయానికి సగం లక్ష్యం చేరలేదని గుర్తించారు. మండలంలో మొత్తం 22 గ్రామాల్లో ఉపాధి పథకం కింద మూడు లక్షల నుంచి మూడు లక్షలయాభైవేల  మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు  కేవలం లక్షాయాభై వేల మొక్కలు మాత్రమే నాటారు. జిల్లాలో అన్ని మండలాలకంటే సారంగాపూర్‌ వెనుకబడడంపై అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం అటవీశాఖ పరిధిలోని ఖాళీ భూములను మంగేళ, బట్టపల్లి, బీర్‌పూర్, పోతారం, రంగసాగర్, సారంగాపూర్, రంగపేట గ్రామాల్లో ఉపాధి కూలీల ద్వారా నాటించడానికి ఆ శాఖ అనుమతినిచ్చింది.  బీడుగా ఉన్న రెవెన్యూ భూముల వివరాలు ఇవ్వాలని ఏపీడీ ఆదేశాలు జారీ చేశారు. 22 గ్రామాల్లో 11 గ్రామాలను ఎంపీడీవో పుల్లయ్య, 11 గ్రామాలను తహసీల్దార్‌ వెంకటరమణ పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతీరోజు 20 వేల గుంతలు తీయాలని, మొత్తం 1.50 నుంచి 2 లక్షల మొక్కలు పది రోజుల్లో నాటాలని నిర్ణయించారు. ప్రస్తుతం గ్రామాల్లో వరినాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. దీంతో ఉపాధి కూలీలు వచ్చే పరిస్థితి లేదు. లక్ష్యం చేరడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.
మరిన్ని వార్తలు