మా క్లినిక్‌కు వచ్చేయండి..

18 Sep, 2017 12:47 IST|Sakshi
మా క్లినిక్‌కు వచ్చేయండి..

గర్భిణులపై ఘోష ఆస్పత్రి వైద్యుల ఒత్తిడి
ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంటే పట్టించుకోని వైనం
మాట వినని వారికి సేవల్లోనూ వివక్ష
క్లినిక్‌లలో శస్త్రచికిత్సలు.. పేదలపై బిల్లుల భారం
వైద్యులపై డీఎంహెచ్‌వోకు ఫిర్యాదు


ఇది ప్రభుత్వాస్పత్రి.. ఇక్కడ వైద్యసేవలు బాగోవు.. ఎవరూ పట్టించుకోరు.. మా మాట వినకుంటే మీకు ఘోసే మిగులుతుంది.. మీ కోసమే చెబుతున్నాం.. ప్రయివేటు క్లినిక్‌కు వచ్చేయండి.. గర్భిణులకు శస్త్రచికిత్స చేసి పురుడుపోస్తాం.. తల్లీపిల్లలను రక్షిస్తాం.. మంచి సేవలు అందిస్తాం.. ఇదీ విజయనగరం జిల్లాలోని ఘోష ఆస్పత్రిలో చేరిన గర్భిణులు, వారి బంధువులకు వైద్యులు ఇచ్చే సూచన, సలహా. ప్రభుత్వాస్పత్రికి వచ్చే పేదలకు  ఉత్తమ సేవలందించాల్సిన వైద్యులు ఆర్థిక భారం వేస్తున్నారు. సొమ్ము సంపాదనే లక్ష్యంగా డాక్టర్‌ వృత్తికే మచ్చతెస్తున్నారు. ప్రభుత్వాస్పత్రిలో సేవలను నిర్వీర్యం చేస్తూ పేదల ప్రాణాలను పణంగా పెడుతున్న తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.  

విజయనగరం ఫోర్ట్‌:
‘గజపతినగరం మండలానికి చెందిన ఓ గర్భిణి ప్రసవం ఇటీవల ఘోష ఆస్పత్రిలో చేరింది. ఆమెను రెండు, మూడు రోజుల వరకు వైద్యులు పట్టించుకోలేదు. అ తర్వా త ఓ వైద్యురాలు తన క్లినిక్‌కు వస్తే బాగా చూస్తానని చెప్పి అక్కడకు తీసుకెళ్లిపోయింది. క్లినిక్‌లో ప్రసవం జరిపించి రూ.27వేలు బిల్లు వసూలు చేశారు. ఆస్పత్రిలో అయితే తమకు ఉచితంగా ప్రసవం అయ్యేదని, క్లినిక్‌లో ప్రసవం జరిపించడం వల్ల రూ.27 వేలు ఖర్చుయిందని, అప్పుచేసి డబ్బులు కట్టామంటూ గర్భిణి బంధువులు డీఎంహెచ్‌ఓకు లిఖిత పూరకంగా ఫిర్యాదు చేశారు. అయితే, ఇది వెలుగులోకి వచ్చిన ఘటన మాత్రమే. తరచూ ఆస్పత్రిలో ఇదే పరిస్థితి ఎదురవుతున్నట్టు పలువురు గర్భిణులు, బంధువులు చెబుతున్నారు. ఆస్పత్రికి వచ్చే అధికశాతం మంది గర్భిణులను ఏదో ఒక వంక చూపి ప్రయివేటు క్లినిక్‌లకు రిఫర్‌ చేస్తున్నారని వాపోతున్నారు. గర్భిణులు చికిత్స పొందే వార్డుల్లోకి వైద్యులు ప్రతి రోజు వెళ్లినా పట్టించుకోరనే అపవాదు ఉంది.

కొంతమంది వైద్యులు అయితే గర్భిణులతో నేరుగా మా క్లినిక్‌కు రావచ్చు కదా.. బాగా చూస్తానని చెబుతున్నారు. కొంతమంది ఇష్టం లేకపోయినా గత్యంతరం లేక వైద్యుల చెప్పిన విధంగా క్లినిక్‌లకు వెళ్తున్నారు. ఆస్పత్రిలో ఉన్నంతసేపు అంతగా పట్టించుకోని వైద్యులు క్లినిక్‌కు వచ్చిన వెంటనే ప్రసవం జరిపించేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిల్లో అయితే ఉచితంగా ప్రసవం జరిపించాలి. అదే క్లినిక్‌ల్లో అయితే వేలకు వేలు ఫీజులు వస్తాయి. సాధారణ ప్రసవం అయితే రూ.8 వేల నుంచి రూ.10 వేలు, సిజేరియన్‌ అయితే రూ.25 వేలు నుంచి రూ.30 వేలు వరకు వసూలు చేస్తున్నారు. దీని వల్ల రెక్కాడితేగాని డొక్కాడాని బడుగుజీవులు వేలకు వేలు ఫీజులు చెల్లించలేక అప్పులు పాలువుతున్నారు.

విచారణ జరిపిస్తాం..
గజపతినగరానికి చెందిన ఓ గర్భిణిని ఘోష ఆస్పత్రి నుంచి క్లినిక్‌కు తీసుకెళ్లి ప్రసవం అనంతరం రూ.27 వేలు వరకు బిల్లు వసూలు చేశారని గర్భిణి బంధువు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరుపుతాం. ఆస్పత్రిలో సక్రమంగా వైద్యసేవలు అందేలా చూస్తాం.
–డాక్టర్‌ సి.పద్మజ, డీఎంహెచ్‌వో

మరిన్ని వార్తలు