ధరల పెంపుపై ప్రతిపక్షాల గళం

26 Jun, 2016 08:00 IST|Sakshi
ధరల పెంపుపై ప్రతిపక్షాల గళం

ఆర్టీసీ, కరెంటు చార్జీల పెంపుపై శనివారం నిరసనలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఆందోళనలు చేపట్టగా.. ఆయా చోట్ల భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతలు కూడా నిరసనలు తెలిపారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు. అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.
 
 
నిర్మల్‌లో రాస్తారోకో

నిర్మల్ టౌన్ : రూ. 10వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో రాష్ట్రం ఏర్పడిన చార్జీల పెంపు ఎందుకని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇంచార్జీ సబితాఇంద్రారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. పట్టణంలోని వివేకనందచౌక్ వద్ద గల జాతీయ రహదారిపై శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగారు తెలంగాణ ఏర్పడుతుందని ప్రజలను మభ్యపెడుతూ చార్జీలను పెంచడం ఎంతవరకు సమంజసమన్నారు. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్కసారి కూడా విద్యుత్ చార్జీలను పెంచలేదని పేర్కొన్నారు. రైతులకు ఉచితంగా కరెంట్‌ను సరఫరా చేసిన ప్రజలపై ఆ భారం మోపలేదని తెలిపారు. సామాన్య ప్రజలపై ప్రభుత్వం చార్జీల భారం వేయడం సరికాదన్నారు. పెంచిన చార్జీలను త గ్గించే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. సుమారు గంటపాటు రాస్తారోకో నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. అనంతరం పోలీసులు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో మాజీ డీసీసీ అధ్యక్షుడు రాంచంద్రరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీలు హేమలత అగర్వాల్, శ్రీనివాస్, నాయకులు జాదవ్ నరేష్, బోథ్ నియోజకవర్గ ఇంచార్జి జాదవ్  అనిల్, అరవింద్‌రెడ్డి, రామలింగం, సత్యంచంద్రకాంత్, దావోజి, తక్కల రమణారెడ్డి, దశరత రాజేశ్వర్, దుర్గభవాని, సాద సుదర్శన్,సరికెల గంగన్న, జెడ్పీటీసీలు సుజాత, ేహ మలత, నాయకులు జమాల్, అజర్, జుట్టు దినేష్, సంతోష్ పాల్గొన్నారు.
 
 
 బీజేపీ ఆధ్వర్యంలో రెబ్బెనలో రాస్తారోకో

 రెబ్బెన : రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్,ఆర్టీసీ బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కేసరి అంజనేయులు గౌడ్ డిమాండ్ చేశారు. చార్జీల పెంపును నిరసిస్తూ శనివారం మండల కేంద్రం లోని రాష్ట్రీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సామాన్యుడిపై భారం మోపేలా ఒకేసారి విద్యుత్, బస్సు చార్జీలను పెంచటం సరికాదన్నారు. ప్రజల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంట్రాక్టర్ సెల్ జిల్లా అధ్యక్షుడు చక్రపాణి, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రభాకర్, నాయకులు నందకిషోర్, సతీష్‌గౌడ్, అజయ్‌గౌడ్, వెంకటేష్, శ్రీకాంత్, ప్రవీణ్, మహేష్‌లు పాల్గొన్నారు.
 
 
 పెంచిన చార్జీలు తగ్గించాలని రాస్తారోకో
 బెల్లంపల్లి :  బస్, విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు శనివారం బెల్లంపల్లిలో కాంగ్రెస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించాయి. పట్టణంలోని కాంటా చౌరస్తా స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్(ఎస్‌బీహెచ్)కు వెళ్లే మార్గమధ్యంలోని కల్వర్టు వద్ద ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. వన్‌టౌన్ అదనపు ఎస్సై గంగారాజగౌడ్ సిబ్బందితో వచ్చి రాస్తారోకో విరమింపజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు కారుకూరి రాంచందర్, డీసీసీ సెల్ ఉపాధ్యక్షుడు ఎండి అఫ్జల్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి సి.హెచ్.శంకర్, మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ కటకం సతీశ్, ఐఎన్‌టీయూసీ నాయకులు సి.హెచ్.వెంకటరమణ, మల్లారపు చిన్నరాజం, ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ ప్రభాకర్, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు ఎనగందుల వెంకటేశ్, కాంగ్రెస్ పట్టణ ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు రొడ్డ తులసీదాస్, బి.ఆనందం, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు ఆదర్శ్‌వర్ధన్‌రాజు, వినీశ్ పాల్గొన్నారు.
 
 
 పెంచిన ధరలు తగ్గించాలి
మంచిర్యాల సిటీ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలపై భారం పడేలా పెంచిన విద్యుత్, బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని బీజేపీ తూర్పు జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల మల్లారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధరల పెంపును నిరసిస్తూ శనివారం మంచిర్యాల పట్టణంలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ తయారు చేస్తానని, ప్రజలకు హామీ ఇచ్చిన కేసీఆర్ గద్దె ఎక్కిన తరువాత ప్రజలకు భారమైనాడని ఆరోపించారు. ప్రజలు సుఖసంతోషాలు విడిచి, కరువుతో తల్లడిల్లుతున్న నేపథ్యంలో ధరలు పెంచడంపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని, లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ ఆందోళను ఉదృతం చేస్తుందని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు మున్నారాజ్ సిసోధ్య, గోలి రాము, లింగన్నపేట విజయ్‌కుమార్, శశి కుమార్ ఉన్నారు.
 
 
 
చార్జీల పెంపుపై బీజేపీ రాస్తారోకో

ఆదిలాబాద్ రిమ్స్ : ధనిక రాష్ట్రంలో ప్రభుత్వం పేదలపై భారంమోపుతోందని బీజేపీ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ అన్నారు. ప్రభుత్వం విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంపును నిరసిస్తూ శనివారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదుట గల జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిగులు బడ్జెట్‌ఉన్న రాష్ట్రమని చెబుతున్న ప్రభుత్వం చార్జీలు పెంచే అవసరమేందున్నారు. ప్రభుత్వం ఏర్పాటు నుంచి సక్రమంగా పాలన సాగిస్తే చార్జీలు పెంచే అవసరం ఉండేది కాదన్నారు. ఇష్టారీతిన నిధులు ఖర్చు చేస్తూ ప్రజలపై భారం మోపడం సిగ్గుచేటన్నారు. వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. బంగారు తెలంగాణ నిర్మిస్తామంటూ ప్రజలను భాదలు పెడుతోందన్నారు. ప్రజావ్యతిరేక విధానలు అవలంబిస్తూ ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు వేణుగోపాల్,సురేష్‌జోషి, జోగురవి, రాము, సంతోష్, శ్రీనివాస్ ఉన్నారు.
 
 
టీడీపీ ఆధ్వర్యంలో..

మంచిర్యాల సిటీ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మిగులు బడ్జెట్ ఉంటుందని ప్రకటించిన కేసీఆర్, అటువంటి రాష్ట్రంలో ధరలు ఎందుకు పెరగాలని మాజీ మంత్రి, టీడీపీ తూర్పు జిల్లా అధ్యక్షుడు బోడ జనార్ధన్ టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెంచిన విద్యుత్, బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ శనివారం మంచిర్యాల పట్టణంలోని పార్టీ జిల్లా కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలు ప్రదర్శనగా ఆర్డీఓ కార్యాలయం వరకు వెళ్లి అక్కడ ధర్నా చేపట్టారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు గోపతి మల్లేష్, మేరడికొండ శ్రీనివాస్, రాజారాం, వెంకటేశ్వర్లు, గౌసోద్దిన్, సత్యం, మధుకర్, కిరణ్, రాకేష్, రాజ్‌కుమార్ ఉన్నారు.
 

మరిన్ని వార్తలు