ఆస్తిపన్ను సొమ్ము దుర్వినియోగం

15 Jun, 2017 01:36 IST|Sakshi
జంగారెడ్డిగూడెం : జంగారెడ్డిగూడెం నగర పంచాయతీలో ఆస్తిపన్ను సొమ్ము దుర్వినియోగమయ్యింది. ప్రా థమికంగా సుమారు రూ.75 వేలు స్వాహా అయినట్టు తేలింది. అయితే ఇది మరింత పెరగవచ్చని అంచనా. దీనిపై నగర పంచాయతీ అధికారులు విచారణ ప్రారంభించారు. వివరాలిలా ఉన్నా యి.. నగర పంచాయతీలో ఆస్తిపన్ను (ఇంటి పన్ను) వసూళ్లకు ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసి సిబ్బంది సౌలభ్యాన్ని బట్టి ఒకరిని నియమిస్తుంటారు. ఔట్‌ సోర్సింగ్‌ మహిళా ఉద్యోగి ఈ కౌంటర్‌లో పనిచేస్తుండగా రూ.75 వేలు దుర్వి నియోగం చేసినట్టు ప్రాథమికంగా అధికారులు నిర్ధారించారు. 
 
బయటపడిందిలా..
ఈ నెల 10న రెండో శనివారం సెలవు కావడంతో ఆస్తిపన్ను వసూలుకు అధికారులు కౌంటర్‌ ఏర్పాటు చేయలేదు. 12న సోమవారం ఆర్‌ఐ సీహెచ్‌ వెంకటేశ్వరరావు శుక్రవారం వరకు వసూలైన వివరాలు, రికార్డులు కంప్యూటర్‌లో పరిశీలించగా, శనివారం సాయంత్రం 6 నుంచి 7 గంటల సమయంలో 8 ఇంటి పన్నులకు సంబంధించి రూ.75 వేల రశీదులు ఇచ్చినట్టు గుర్తించారు. అయితే దీనిపై ఆరా తీయగా స్థానిక చింతల బజారులోని ఓ ఈ–సేవ కేంద్రం నుంచి నగర పంచాయతీ వెబ్‌సైట్‌కు లాగిన్‌ అయ్యి రశీదులు ఇచ్చినట్టుగా గుర్తించారు. దీనిపై ఆయన కమిషనర్‌ చోడగం వెంకటేశ్వరరావుకు రిపోర్ట్‌ చేశారు. విచారించగా ఔట్‌ సోర్సింగ్‌ మహిళా ఉద్యోగి ఈ సేవ కేంద్రం ద్వారా రశీదులు జారీ చేసినట్టు తేలింది. 
 
క్యాన్సిలేషన్‌ను క్యాష్‌ చేసుకున్న వైనం
నగర పంచాయతీ వెబ్‌సైట్‌లో ఆస్తిపన్నుల క్యాన్సిలేషన్‌కు ఆప్షన్‌ ఉంది. దీనిని ఆమె సొమ్ము చేసుకుంది. గతంలో కొందరు యజమానులు ఆస్తి పన్ను చెల్లించగా వారికి రశీదులు ఇచ్చి వెంటనే క్యాన్సిలేషన్‌ చేసి సొమ్మును స్వాహా చేసింది. అయితే ఇటీవల ఒకరిద్దరికి తాము ఆస్తిపన్ను చెల్లించినా డిమాండ్‌ నోటీసులు రావడంతో నగర పంచాయతీ కార్యాలయానికి వచ్చి ప్రశ్నిం చారు. దీంతో కంగారు పడిన ఆమె హడావుడిగా ఈ–సేవ కేంద్రం ద్వారా గత శనివారం రశీదులు జారీ చేసింది. అధికారులు ఆమెను నిలదీయడంతో భిన్నకథనాలు చెప్పుకొచ్చింది. అయితే చివరకు ఆమెకు కావాలి్సన ఒక కౌన్సిలర్‌తో మాట్లాడించడంతో సొమ్ము స్వాహా చేసినట్టు మంగళవారం ఒప్పుకున్నట్టు సమాచారం. ఇంటికి వెళ్లి వస్తానని చెప్పిన ఆమె నగర పంచాయతీ కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోయింది. 
 
ఆత్మహత్యాయత్నం
అవకతవకలకు పాల్పడిన ఆమె రాజమండ్రి గోదావరి రైల్‌ కమ్‌ రోడ్డు బ్రిడ్జిపైకి చేరుకుని ఆత్మహత్యకు యత్నించగా ఓ కానిస్టేబుల్‌ చూసి పో లీస్‌స్టేషన్‌కు తరలించారు. వివరాలు అడిగి తెలుసుకుని జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె తండ్రి , నగర పంచాయతీ సిబ్బంది అక్కడకు వెళ్లి ఆమెను జంగారెడ్డిగూడెం తీసుకువచ్చారు. సంఘటనపై నగర పంచాయతీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
విచారణ చేస్తున్నాం
నగర పంచాయతీలో నిధులు దుర్వినియోగంపై విచారణ చేస్తున్నామని కమిషనర్‌ చోడగం వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రాథమికంగా 8 ఇంటి పన్నుల రశీదులకు సంబంధించి రూ.75 వేలు దుర్వినియోగమయ్యాయని, ఇంకా నిధులు ఏవైనా దుర్వినియోగమయ్యాయా అనే అంశంపై పూర్తిస్థాయి విచారణ చేస్తున్నట్టు చెప్పారు. 
 
మరిన్ని వార్తలు