మద్యం దుకాణాల ఏర్పాటుపై జనాగ్రహం

11 Mar, 2017 23:00 IST|Sakshi
మద్యం దుకాణాల ఏర్పాటుపై జనాగ్రహం
  • ఇళ్ల మధ్యలో వద్దంటూ ఆందోళనలు
  • ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల మద్దతు
  • ఉయ్యూరు :నివాసాల మధ్య మద్యం దుకాణాల ఏర్పాటుపై ప్రజాగ్రహం పెల్లుబికింది. మందు షాపులు మా మధ్యలో వద్దంటూ ప్రజాప్రతినిధులు, మహిళలు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఆందోళన బాటపట్టాయి. ఈ అంశం ఎక్సైజ్‌ శాఖ అధికారులకు, ప్రజాప్రతినిధులకు కొరకరానికొయ్యగా మారింది.

    ఎక్సైజ్‌ కార్యాలయం ఎదుట ధర్నా..
    జాతీయ రహదారుల వెంట మద్యం షాపులు తీసివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో మద్యం వ్యాపారులు తమ దుకాణాలను మార్చుకునే పనిలోకి దిగారు. ఈ క్రమంలోనే ప్రధాన సెంటర్‌లో ఉన్న రెండు మద్యం దుకాణాల వ్యాపారులు తమ దుకాణాలను 10, 12వ వార్డుల పరిధిలోకి వచ్చే కాలువకట్ల వెంట ఇళ్ల మధ్యలో పెట్టేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ఈ చర్యలను స్థానికులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు మద్దతుగా నిలిచాయి. తమ ప్రాంతాల్లో మద్యం షాపులు వద్దం టూ శుక్రవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. శ్రీశ్రీనివాస విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ పరుచూరి శ్రీనివాసరావు, 10, 12వ వార్డుల కౌన్సిలర్లు బొబ్బిలి నాగరాజు, అడపాక ఆదిలక్ష్మి, అడపాక రాంబాబు నేతృత్వంలో ఎక్సైజ్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు.

    మద్యం దుకాణాలను ఏర్పాటు చేస్తే తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మండలంలోని గండిగుంట గ్రామానికి చెందిన మహిళలూ ఇళ్ల మధ్యలో షాపు ఏర్పాటుకు అనుమతి ఇవ్వొద్దంటూ ఎక్సైజ్‌ ఎస్‌ఐ మాధవిని కలిసి ఫిర్యాదు చేశారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు సంతకాలు చేసి పాఠశాలలకు వెళ్లే రోడ్డుల్లో షాపుల ఏర్పాటుపై తమ నిరసన తెలియజేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు రాలేదని, ఇంకా షాపుల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వలేదని ఎక్సైజ్‌ అధికారులు ప్రజలకు సర్దిచెప్పి వెనక్కి పంపుతున్నారు.

    మద్యం షాపులకు వ్యతిరేకం : వైవీబీ
    ప్రజలకు ఇబ్బంది కలిగించేలా మద్యం షాపుల ఏర్పాటుకు తాను పూర్తి వ్యతిరేకమని ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. కాలువకట్ట వాసులు ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ను శుక్రవారం కలిసి తమ ప్రాంతంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రజలకు అసౌకర్యం గా ఉండే చోట షాపులు ఏర్పాటు చేస్తే సహించేది లేదన్నారు. ఎవ్వరికీ ఇబ్బంది కలగని చోట షాపులు ఏర్పాటు చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు