అభిషేక ప్రియునికి పుష్పాభిషేకం

27 Dec, 2016 23:48 IST|Sakshi
అభిషేక ప్రియునికి పుష్పాభిషేకం
- 21 రకాల పూలతో విశేష పుష్పార్చన 
శ్రీశైలం: శ్రీశైలాలయంలోని నాగులకట్ట ప్రాంగణ వేదికపై మంగళవారం అభిషేక ప్రియుడైన మల్లికార్జున స్వామికి భ్రమరాంబాదేవి సమేతంగా మహా పుష్పాభిషేకం నిర్వహించారు. లోక కల్యాణార్థం ఏర్పాటు చేసిన పుష్పార్చనలో మొత్తం 21 రకాల పుష్పాలతో స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా అర్చకులు, వేదపండితులు విశేష పూజలు చేశారు. అంతకు ముందు అర్చకులు, వేదపండితులు, అధికారులు వివిధ పుష్పాలతో నిండిన పళ్లెలను తలపై ఉంచుకుని ఆలయ ప్రదక్షిణ చేసి నాగులకట్ట ప్రాంగణ వేదిక వద్దకు చేరుకున్నారు. సాయంత్రం 6.30 గంటల నుంచి ప్రారంభమైన మహా పుష్పార్చనలో అర్చకులు, వేద పండితులు లోక కల్యాణార్థం సంకల్పాన్ని పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు షోడశ ఉపచారాలతో పూజలు చేపట్టి ఆయా పుష్పాలతో 11 పర్యాయాలు 11 రకాల హారతులతో పుష్పార్చన అత్యంత వైభవంగా చేపట్టారు. కార్యక్రమంలో ఈఓ నారాయణ భరత్‌గుప్త, జేఈఓ హరినాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
పుష్పార్చనలో 21 రకాల పుష్పాదులు
భ్రామరీ సమేత శ్రీశైలేశుడికి పుష్పార్చన సేవలో భాగంగా 21 రకాలైన పూలను వినియోగించారు. ఇందులో భాగంగా తెల్ల చేమంతి, పసుపు చేమంతి, ఎర్రగులాబి, పసుపు గులాబి, మల్లె, జాజి, కనకాంబరం, నందివర్ధనం, గరుడ వర్ధనం, లిల్లి, నూరు వరహాలు, ఆస్టర్స్, కలువలు, తామరలు, తుమ్మి, గన్నేరు, నాగమల్లి, ఆర్కిడ్, జర్బెరా, మరువం, బిల్వం, ధవనం మొదలైన ఐదు టన్నుల పుష్పాలతో స్వామి అమ్మవార్లకు పుష్పోత్సవ అభిషేక కైంకర్యాన్ని ఆగమ శాస్త్రంగా వేదమంత్రోచ్ఛారణ మధ్య నిర్వహించారు.
మరిన్ని వార్తలు