ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆపాలని రైల్‌రోకో

15 Apr, 2017 23:37 IST|Sakshi
ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆపాలని రైల్‌రోకో

రాయదుర్గంటౌన్‌ : రాయదుర్గంలో ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల స్టాపింగ్‌ సౌకర్యం కల్పించాలని ప్రజా సంఘాలు, బీజేపీ, బీఎస్‌పీ, ఆటో కార్మికుల ఆధ్వర్యంలో శనివారం రైల్‌రోకో నిర్వహించారు. స్టేషన్‌లో ఉదయం 10 గంటలకు గుంతకల్లు–చిక్‌జాజూర్‌ రైలును అడ్డుకున్నారు. ఈ సందర్బంగా రైల్వే యాక‌్షన్‌ కమిటీ అధ్యక్షుడు రామాంజనేయులు, బీజేపీ నాయకులు సురేష్‌కుమార్, అంభోజీరావు మాట్లాడుతూ దశాబ్దాలుగా కేవలం మూడు ప్యాసింజర్‌ రైళ్లను మాత్రమే నడుపుతూ రాయదుర్గం రైల్వేస్టేషన్‌ను గూడ్స్‌లకే పరిమితం చేశారన్నారు. రాయదుర్గం మీదుగా దాదాపు 10 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడుస్తున్నా ఒక్కదానికి కూడా స్టాపింగ్‌ సౌకర్యం కల్పించడం లేదన్నారు. ఇటీవల ఎంపీ దివాకర్‌రెడ్డి రాయదుర్గం స్టేషన్‌లో ఒకటి లేదా రెండు రైళ్లను నిలుపుదల చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చినా ఆ తర్వాత దాని గురించి పట్టించుకోలేదన్నారు.

సరిహద్దులోని మొలకాల్మూరులో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు స్టాపింగ్‌ ఇస్తుంటే ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. మరో 15 రోజుల్లో ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల రాకపోకలకు స్టాపింగ్‌ వసతి కల్పించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. దాదాపు అరగంట దాకా రైలు రోకో చేపట్టారు. అనంతరం ఎస్‌ఐ మహానంది, రైల్వేపోలీసులు వారికి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించి స్టేషన్‌మాస్టర్‌కు డిమాండ్లతో కూడిన వినతిపత్రం సమర్పించారు. ఆటో యూనియన్‌ నాయకులు అనిల్‌కుమార్, అఖిల భారత కాపునాడు కార్యదర్శి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు