-

తేలికపాటి వర్షమే..

18 Jul, 2017 21:57 IST|Sakshi

– అరకొర తేమలో పంటల సాగుకు సిద్ధమైన రైతులు
అనంతపురం అగ్రికల్చర్‌ : నైరుతి రుతుపవనాలు రైతులను తీవ్ర నిరుత్సాహపర్చగా.. అల్పపీడనం కూడా ఆశించిన స్థాయిలో ఉపశమనం కల్పించలేకపోయింది. అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజులుగా రాష్ట్రమంతా భారీ వర్షాలు కురుస్తున్నా ‘అనంత’లో తేలికపాటి వర్షమే కురిసింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి జిల్లాలో ఓ మోస్తరు వర్షం పడింది. 20 మిల్లీమీటర్ల లోపు వర్షపాతం నమోదైనట్లు తెలుస్తోంది. దీంతో అరకొర తేమలోనే పంటల సాగుకు రైతులు సిద్ధమయ్యారు. మోస్తరుగా కురిసిన ప్రాంతాల్లో వేరుశనగ, కంది, ఆముదం, పత్తి తదితర పంటల విస్తీర్ణం కొంత పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. పంటల సాగుకు ఈ నెలాఖరు వరకు గడువున్నట్లు ప్రకటించడంతో అంతలోపు విత్తుకునేందుకు రైతులు ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం నుంచి కొంత వాతావరణంలో మార్పు రావడంతో ఆశల వర్షం కోసం అన్నదాతలు నిరీక్షిస్తున్నారు. అనంతపురం, శింగనమల, గుంతకల్లు, ఉరవకొండ, హిందూపురం, కళ్యాణదుర్గం, పెనుకొండ, ధర్మవరం నియోజకవర్గాల పరిధిలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. బెళుగుప్ప, కుందుర్పి లాంటి కొన్ని మండలాల్లో పంటల విత్తుకు సరిపడా పదును వర్షం పడింది. జూలై నెల సాధారణ వర్షపాతం 67.4 మి.మీ., కాగా ప్రస్తుతానికి 22 మి.మీ నమోదైంది. మంగళవారం సాయంత్రం అనంతపురం, బత్తలపల్లి, తలుపుల, గుమ్మగట్ట, యాడికి, పెద్దవడుగూరు, రాయదుర్గం, కళ్యాణదుర్గం, రాప్తాడు, కంబదూరు తదితర మండలాల్లో గాలివేగం 20 నుంచి 30 కిలోమీటర్లుగా నమోదైంది. కారుమేఘాలు కమ్ముకున్నా గాలివేగం ఎక్కువ కావడంతో తేలికపాటి వర్షాలు నమోదయ్యాయి.

వర్షసూచన
రాగల నాలుగు రోజుల్లో మోస్తరుగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్‌ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్‌ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం మేరకు 19 నుంచి 23వ తేదీ వరకు 8 నుంచి 25 మి.మీ., వర్షపాతం నమోదయ్యే సూచన ఉందన్నారు. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 33 నుంచి 34 డిగ్రీలు, కనిష్టం 25 నుంచి 26 డిగ్రీలు నమోదు కావచ్చన్నారు. గాలిలో తేమశాతం ఉదయం 71 నుంచి 73, మధ్యాహ్నం 60 నుంచి 66 శాతం మధ్య ఉండవచ్చని తెలిపారు. గంటకు 11 నుంచి 16 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు.

మరిన్ని వార్తలు