పంటలకు ప్రాణం

16 Aug, 2017 01:15 IST|Sakshi
పంటలకు ప్రాణం

నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు
జిల్లాలో 51 మిల్లీమీటర్లుగా నమోదు
మరో రెండు రోజులు భారీ వర్ష సూచన
వరినాట్లు వేసుకుంటున్న రైతులు
ఇప్పటివరకు 59 శాతమే సాగు


మంచిర్యాలఅగ్రికల్చర్‌: జిల్లాలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఎండిపోతున్న పంటలకు ప్రాణం పోశాయి. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో చెదురుమదురు వర్షాలు పడుతుండడంతో అన్నదాతల్లో ఆశలు చిగురించాయి. ఇన్ని రోజులు బీడుగా ఉన్న పొలాల్లో వరినాట్లు వేసుకుంటున్నారు. వర్షాకాలం ప్రారంభమై                  రెండు నెలలు గడిచినా జలశయాల్లోకి వరద నీరు రాక బోసిపోయాయి. ఈ వర్షాలతో చెరువులు కుంటలు కొంతవరకు నిండుతున్నాయి. తొలకరి వానలకు పోసుకున్న నార్లు ముదిరడంతో రైతులు మళ్లీ నార్లు పోసుకుంటున్నారు.

59 శాతమే సాగు..
ఈ ఖరీఫ్‌ సీజన్‌లో వర్షాలు సరైన సమయంలో కురవకపోవడం వల్ల ఇప్పటివరకు జిల్లాలో 59 శాతం మాత్రమే పంటలు సాగయ్యాయి. ఖరీఫ్‌ సీజన్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 2,26,734 లక్షల ఎకరాలకు గాను.. ఇప్పటివరకు 1,34,022 ఎకరాల్లో మాత్రమే రైతులు వివిధ పంటలు వేసుకున్నారు. జూన్‌లో వేసిన పత్తి, మొక్కజొన్న, కందితో పాటు ఇతర పంటలు ఏపుగా ఎదిగి పూత దశకు చేరుకోవాల్సిన సమయమిది. గత నెలన్నర రోజులుగా వరుణుడు ముఖం చాటేయడంతో మొక్కల ఎదుగుదల లోపించింది. వేసిన పంటలను కాపాడుకోవడానికి రైతులు నానాపాట్లు పడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లాలో 12వ తేదీ నుంచి కురుస్తున్న వర్షాలు రైతులకు ఊరటనిచ్చాయని చెప్పవచ్చు. 12 నుంచి 15 వరకు నాలుగు రోజుల్లో 51 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. మరో రెండు రోజులు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలను ఉన్నాయని వాతావరణ నిపుణులు పేర్కొనడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. భారీ వర్షాలు కురిసి జలాశయాలు నిండితే ఈనెలాఖరు వరకు వరినాట్లు జోరందుకునే అవకాశముంది.

39 శాతం లోటు..
జూన్‌లో మురిపించిన వరుణుడు జూలైలో ముఖం చాటేశాడు. జిల్లాలో 18 మండలాలకు గాను గతనెలలో ఒక్క మండలం మినహా మిగతా మండలాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. గత నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నా ఇంకా లోటే ఉంది. సాధారణం కంటే 20 శాతం ఎక్కువ రికార్డు అయితే అధిక వర్షపాతం, సాధారణం కంటే 19 శాతం తక్కువ, 19 శాతం ఎక్కువ రికార్డు అయితే సాధారణ వర్షపాతం, అంతకుమించి తక్కువ రికార్డు అయితే లోటు వర్షపాతంగా నిర్ణయిస్తారు. ఈ రికార్డుల ఆధారంగానే కరువు మండలాల ఎంపిక జరుగుతుంది. ఈ ప్రకారంగా జిల్లాలో ఒక మండలం మినహా మిగతా 17 మండలాల్లో 20 నుంచి 60 శాతం వరకు లోటు వర్షపాతం నమోదయింది. జిల్లాలో సాధారణ వర్షపాతం ఇప్పటివరకు 680.8 మి.మీ. కాగా.. 415.5 మి.మీ. కురిసింది. జిల్లా సగటున 39 శాతం లోటు వర్షపాతం నెలకొంది.

మరిన్ని వార్తలు