ఆర్వీఎంకు సిరిసిల్ల వస్త్రం

2 Sep, 2016 22:17 IST|Sakshi
ఆర్వీఎంకు సిరిసిల్ల వస్త్రం
  • తొలి రోజు లక్షా 60 వేల మీటర్ల గుడ్డ కొనుగోలు
  • సిరిసిల్లలలో పాతిక లక్షల మీటర్ల వస్త్రం సిద్ధం
  • సిరిసిల్ల: సిరిసిల్ల నేతన్నలు ఉత్పత్తి చేసిన వస్త్రాన్ని చేనేత, జౌళిశాఖ అధికారులు కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్‌ యార్డులోని గోదాముల్లో లక్షా 60 వేల మీటర్ల వస్త్రాన్ని కొనుగోలు చేశారు. రెండు మ్యాక్స్‌ సొసైటీల ద్వారా ఈ వస్త్రాన్ని కొన్నారు. సిరిసిల్లలోని 51 మ్యాక్స్‌ సొసైటీల్లో ఉత్పత్తి అయిన గుడ్డను మాత్రమే కొనుగోలు చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం సిరిసిల్లలో 25 లక్షల మీటర్ల వస్త్రం సిద్ధంగా ఉంది. రోజు వారీగా ఈ వస్త్రాన్ని కొనుగోలు చేస్తామని జౌళిశాఖ ఆర్‌డీడీ రమణమూర్తి తెలిపారు. రాజీవ్‌ విద్యా మిషన్‌కు మొత్తం కోటి 35 లక్షల మీటర్ల వస్త్రం అవసరం ఉండగా.. సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో మంత్రి కేటీఆర్‌ సిరిసిల్ల కార్మికులకు ఈ అవకాశాన్ని కల్పించారు. రూ.45 కోట్లు విలువైన వస్త్రాన్ని సిరిసిల్ల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంది. మొదటి విడతగా 37 లక్షల మీటర్ల గుడ్డను కొనుగోలు చేసేందుకు సిరిసిల్ల మ్యాక్స్‌ సొసైటీలకు ఆర్డర్లు ఇవ్వగా.. ఇప్పటి వరకు 25 లక్షల మీటర్ల వస్త్రం రెండువేల పవర్‌లూమ్స్‌పై పక్షం నెల రోజుల్లో ఉత్పత్తి అయింది. మిగితా ఆర్డర్‌ను పూర్తి చేసేందుకు వస్త్రోత్పత్తిదారులు సిద్ధంగా ఉన్నారు.  కార్యక్రమంలో జౌళిశాఖ అధికారులు పూర్ణచందర్‌రావు, ఏడీలు ఎం.వెంకటేశం, రతన్‌కుమార్, డి.వి.రావు, డీవో రశీద్, మ్యాక్స్‌ సొసైటీ అధ్యక్షులు బీమరి రామచంద్రం, జౌళిశాఖ టెక్నికల్‌ సిబ్బంది పాల్గొన్నారు.
     
     
     
     
మరిన్ని వార్తలు