అక్రమాలకు రెడ్‌కార్పెట్‌

4 Jul, 2017 22:43 IST|Sakshi
అక్రమాలకు రెడ్‌కార్పెట్‌

– యథేచ్ఛగా నగరంలో అక్రమ కట్టడాలు
– చేష్టలుడిగి చూస్తున్న టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు

అనంతపురం న్యూసిటీ : అధికార పార్టీ అండ.. టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల బాధ్యతారాహిత్యంతో నగరంలో ఇష్టారాజ్యంగా అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయి.  టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల లోపాయికార ఒప్పందాలకు అధికార పార్టీ నేతల ప్రోత్సాహం తోడవడంతో అనధికార కట్టడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. సుమారు వందకు పైగా అక్రమ కట్టడాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నగరంలో ట్రాఫిక్‌ అస్తవ్యస్థంగా తయారవుతున్న తరుణంలో నిబంధనలకు తూట్లు పొడుస్తూ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించి నగరాన్ని మరింత రద్దీ చేసేందుకు పాలకులు, అధికారులే కంకణం కట్టుకున్నారన్న ఆరోపణలు వినబడుతున్నాయి.

బీపీఎస్‌తో లింక్‌
నగరంలో అక్రమ కట్టడాలకు బిల్డింగ్‌ పీనలైజేషన్‌ స్కీం (బీపీఎస్‌)తో ముడిపెడుతున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ప్రభుత్వం బీపీఎస్‌కు అనుమతి ఇస్తుందని అప్పటి వరకు ఏవిధంగా కట్టినా పర్వాలేదన్న ధోరణిలో అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇదే అదునుగా బిల్డర్లు, యజమానులు వారికి నచ్చినట్లు కట్టడాలు చేపడుతున్నారు. వాస్తవంగా 2014 డిసెంబర్‌లోపు నిర్మాణాలు చేపట్టిన వారికి ప్రభుత్వం బీపీఎస్‌ను ప్రవేశపెట్టింది. నగరంలో బీపీఎస్‌ కింద 1068 దరఖాస్తు చేసుకోగా అందులో 768 మంది క్లియరెన్స్‌ రాగా ఇంకా 300 వరకు పరిష్కారానికి నోచుకోలేదు. బీపీఎస్‌ క్లియర్‌ చేసుకోని వారిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

సెల్లార్‌లకు రెడ్‌కార్పెట్‌
సెల్లార్‌లకు పూర్తీ స్థాయిలో అనుమతి లేదు. కమర్షియల్‌ ఆలోచనతో ఇష్టారాజ్యంగా సెల్లార్లు నిర్మిస్తున్నారు. కమర్షియల్‌కు 500 చదరపు అడుగులు (12 1/2 సెంట్లు) ఉంటే సెల్లార్‌కు అనుమతి ఉంటుంది. అదే రెసిడెన్షియల్‌కు 750 (18 1/2 సెంట్లు) చదరపు అడుగుంటే సెల్లార్‌కు అనుమతిస్తారు. అలాంటిది రెండు, మూడు సెంట్ల స్థలం ఉన్నా అందులో సెల్లార్లు నిర్మిస్తున్నారు. భారీ వర్షాలు వస్తే సెల్లార్‌ మునిగిపోయి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. 2016 జూన్‌ 27న కురిసిన భారీ వర్షంతో ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఉన్న కమర్షియల్‌ కాంప్లెక్స్‌ సెల్లార్‌ మునిగిపోవడం దీనికి చక్కది ఉదాహరణ.

అన్నీ అతిక్రమణలే..
నగరంలో భవన అతిక్రమణలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నట్లు సాక్షాత్తు కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తినే చెబుతున్నారు. ఇలాంటివి ప్రధాన ప్రాంతాల్లోనే 31 మంది భవనాలను గుర్తించిన విషయం తెలిసిందే.  

అక్రమ నిర్మాణాలకు చెక్‌ పెడుతాం
– పీవీవీఎస్‌ మూర్తి , కమిషనర్‌
నగరంలో అక్రమ నిర్మాణాలున్న మాట వాస్తవమే. కొందరు ప్లాన్‌ ప్రకారం నిర్మాణాలు చేపట్టడం లేదు. ఇలాంటి కట్టడాలపై ప్రత్యేక నిఘా ఉంచాం. త్వరలోనే అక్రమ నిర్మాణాలకు చెక్‌ పెడతాం.

మరిన్ని వార్తలు