నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు

8 Jun, 2017 22:14 IST|Sakshi

సాక్షి, అమరావతి : సర్వర్‌ పనిచేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. బుధవారం సగానికిపైగా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సర్వర్‌ సమస్య వల్ల రిజిస్ట్రేషన్లతోపాటు అన్ని రకాల కార్యకలాపాలు స్తంభించాయి. గురువారం అన్ని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సర్వర్‌ ఫెయిలైంది. దీంతో రాష్ట్రంలోని మొత్తం 291 రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో అన్ని రకాల సేవలు స్తంభించాయి. ఎక్కడా ఒక్కటంటే ఒక్క రిజిస్ట్రేషన్‌ కూడా జరగలేదని క్షేత్రస్థాయి అధికారులు తెలిపారు.

రెండు రోజులపాటు స్థిరాస్తి క్రయ, విక్రయ రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. భూములు, స్థలాలు, భవనాల కొనుగోలుదారులు, అమ్మకందారులు, సాక్షి సంతకాలు చేసేందుకు వచ్చిన వారంతా సర్వర్‌ పనిచేయకపోవడంతో ఉసూరుమంటూ వెనుతిరిగారు. ఖర్చులు, సమయం వృథా అయ్యాయని కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేశారు. పని దినాల్లో రాష్ట్రంలో రోజుకు సగటున 12,000 రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. బుధ, గురువారాల్లో సర్వర్‌ పనిచేయకపోవడం వల్ల దాదాపు 18,000 రిజిస్ట్రేషన్లు ఆగిపోయి ఉంటాయని అధికార వర్గాలు తెలిపాయి.

>
మరిన్ని వార్తలు