అతిసార బాధితులకు ఊరట

29 Jul, 2016 22:35 IST|Sakshi
గ్రామంలో వైద్య శిబిరంలో బాధితులు
  • బండపోతుగళ్‌లో కొనసాగుతున్న వైద్య శిబిరం
  • గ్రామాన్ని సందర్శించిన జేడీ డాక్టర్‌ సుబ్బలక్ష్మి
  • కౌడిపల్లి:  మండలంలోని బండపోతుగళ్‌లో  వైద్యశిబిరం కొనసాగుతోంది. శుక్రవారం మూడోరోజు  గ్రామస్తులకు కాస్త ఊరట లభించింది. వాంతులు, విరేచనాలు అదుపులోకి వచ్చాయి. గ్రామాన్ని జేడీ సుబ్బలక్ష్మి సందర్శించారు. బండపోతుగళ్‌లో అతిసార ప్రబలడంతో గ్రామస్తులు అస్వస్థతకు గురై మూడు రోజులుగా గ్రామంలో వైద్యశిబిరం కొనసాగుతున్న విషయం విధితమే.

    కాగా మూడోరోజు వైద్య శిబిరంలో డాక్టర్‌ దివ్యజ్ఞ, డాక్టర్‌ విజయశ్రీ వైద్య సిబ్బంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పదమూడు మందికి వాంతులు, విరేచనాలు కావడంతో ప్రత్యేక చికిత్సలు చేశారు.  దీంతోపాటు మరో యాభై మందికి పీఓ వైద్యం అందించారు. ఏఎన్‌ఎంలు ఇంటింటికీ తిరిగి గ్రామంలో బ్లీచింగ్‌ పౌడర్‌ పంపిణీ చేసి క్లోరినేషన్‌ చేశారు.

    కాచి వడపోసిన నీటిని తాగాలని సూచించారు. గ్రామంలో ప్రధానంగా 1, 2, 3, 4వ వార్డుల ప్రజలకు మాత్రం అధికంగా అతిసార సోకినట్లు గుర్తించారు. దీంతో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు, వైద్య సిబ్బంది రక్షిత మంచినీటి పథకం ట్యాంక్‌లలో క్లోరినేషన్‌ చేశారు. నల్లా గుంతలను సరిచేయడంతోపాటు కాలనీల్లో పంచాయతీ సిబ్బందితో కలిసి గుంతలు పూడ్చివేశారు. కట్‌వాల్‌ వద్ద లీకేజీలు లేకుండా చూశారు.

    గ్రామాన్ని సందర్శించిన జేడీ సుబ్బలక్ష్మి
    బండపోతుగళ్‌ గ్రామాన్ని వైద్య ఆరోగ్యశాఖ జేడీ డాక్టర్‌ సుబ్బలక్ష్మి సందర్శించారు. గ్రామంలోని పలు కాలనీలలో పర్యటించి పరిస్థితులను పరిశీలించారు. నల్ల లీకేజీలు, నల్ల గుంతలను చూశారు. గ్రామంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులపై ఆరా తీశారు. అనంతరం వైద్యశిబిరంలో రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.

    ఓపీ, ఇన్‌పేషెంట్‌ జాబితా, మందులను పరిశీలించారు. వైద్యులు డాక్టర్‌ విజయశ్రీ, దివ్యజ్ఞలను అతిసార వ్యాధి బాధితులకు అందుతున్న సేవలను గురించి ప్రశ్నించారు. బాధితులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. డీఎంహెచ్‌ఓ అమర్‌సింగ్‌నాయక్, ఎపిడమాలజిస్ట్‌ రజిని, తహసీల్దార్‌ నిర్మల, ఎంపీడీఓ శ్రీరాములు, ఈఓ పీఆర్డీ సత్యనారాయణ, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ చిన్ని నాయక్‌, పంచాయతీ కార్యదర్శులు వెంకటేశ్‌, వీఆర్‌ఓలు పాల్గొ‍న్నారు.

మరిన్ని వార్తలు