కుళ్లిన గుడ్లపై విచారణ | Sakshi
Sakshi News home page

కుళ్లిన గుడ్లపై విచారణ

Published Fri, Jul 29 2016 10:28 PM

కుళ్లిన గుడ్లపై విచారణ - Sakshi

రెంజల్‌ : రెంజల్‌లోని రెండు అంగన్‌వాడీ కేంద్రాలను ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ శారద తనిఖీ చేశారు. శుక్రవారం సాక్షి దినపత్రికలో ‘అంగన్‌వాడీ కేంద్రాలకు కుళ్లిన గుడ్లు సరఫరా’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌తో పాటు బోధన్‌ సీడీపీవో వెంకట రమణమ్మలు రెంజల్‌లోని కేంద్రాలను తనిఖీ చేశారు. అయితే అధికారులు విచారణకు వస్తున్నారని ముందుగానే సమాచారం అందడంతో ఒకటో నంబరు కేంద్రం నిర్వాహకురాలు ఆయమ్మతో గుడ్లను సమీపంలోని పిచ్చిమొక్కల్లో పారవేయించారు. అధికారులు అంగన్‌వాడీ కేంద్రంలో విచారణ చేపట్టారు. ‘సాక్షి’లో ప్రచురితమైన పేపర్‌ కటింగ్‌ను వెంట తీసుకువచ్చారు. అప్పటికే నిర్వాహకురాలు ఆయాతో 28 గుడ్లను పిచ్చిమొక్కల్లో పారవేయించారు. విషయాన్ని గుర్తించిన స్థానికులు పీడీకి పారవేసిన గుడ్లను చూయించారు. దీంతో కేంద్రం నిర్వాహకురాలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడ్లను ఎందుకు పారవేయించావని ప్రశ్నించగా నిర్వాహకురాలు, ఆయాలు పొంతనలేని సమాధానాలు చెప్పారు. దీంతో పీడీ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు కేంద్రానికి వచ్చిన గుడ్ల వివరాలు, లబ్ధిదారులకు పంపిణీ చేసిన రికార్డులను తనిఖీ చేయగా వంద గుడ్ల వరకు వ్యత్యాసం తేలింది. నిర్వాహకురాలి నిర్లక్ష్యం వల్లే కుళ్లిన గుడ్లు అందాయని నిర్ధారణకు వచ్చారు. విషయాన్ని కలెక్టర్‌కు నివేదించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement