ఉపాధ్యాయుడికి రిలీవ్‌ తిప్పలు

10 Aug, 2017 22:48 IST|Sakshi
ఉపాధ్యాయుడికి రిలీవ్‌ తిప్పలు

బుక్కపట్నం: మరో ప్రాంతానికి బదిలీ అయిన తనను రిలీవ్‌ చేయడం లేదంటూ స్థానిక ఎమ్మార్సీ ఎదుట రెడ్డివారిపల్లి తండా పాఠశాల ఉపాధ్యాయుడు హైదర్‌వలీ గురువారం నిరసన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. పోస్టు రేషనలైజేషన్‌లో భాగంగా తగిన విద్యార్థుల సంఖ్య లేరంటూ రెడ్డివారిపల్లి తండా పాఠశాలను అధికారులు మూతేశారు. దీంతో అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుడు హైదర్‌ఆలీని ఇదే మండలంలోని చిలకలగడ్డపల్లి పాఠశాలకు డిప్యూటేషన్‌పై నియమించారు. ఇటీవల జరిగిన బదిలీల్లో ఆయనను మడకశిర మండలానికి పోస్టింగ్‌ ఇచ్చారు.

తనను రిలీవ్‌ చేయాలని పలుమార్లు హైదర్‌ఆలీ కోరినా ఎంఈవో అంగీకరించలేదు. చిలకలగడ్డపల్లి పాఠశాలలో రెగ్యులర్‌ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న భాగ్యలక్ష్మి మెటర్నటీ సెలవులపై ఉన్నారని, ఆమె వచ్చే వరకూ ఆగాల్సిందేనంటూ ఎంఈవో గోపాల్‌ నాయక్‌ సూచించారు. అయితే తనను మరో ప్రాంతానికి బదిలీ చేశారని అక్కడ జాయిన్‌ కాకపోతే ఇబ్బందులు ఎదురవుతాయంటూ హైదర్‌ఆలీ గురువారం ఎంఈఓ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం డీఈఓ లక్ష్మీనారాయణ దృష్టికి వెళ్లడంతో ఆయన ఆదేశాల మేరకు హైదర్‌ఆలీని ఎంఈఓ రిలీవ్‌ చేశారు.

మరిన్ని వార్తలు