కలెక్టరమ్మా.. కనికరించవమ్మా..

14 Feb, 2017 22:18 IST|Sakshi
కలెక్టరమ్మా.. కనికరించవమ్మా..

► ప్రజావాణిలో విన్నపాలు
► 121 దరఖాస్తుల స్వీకరణ

పెద్దపల్లిరూరల్‌ : తమ సమస్యలపై వినతిపత్రాలు అందించి వాటిని పరిష్కరించాలంటూ బాధితులు  వేడుకున్నారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణిలో కలెక్టర్‌ వర్షిణి, డీఆర్వో వెంకటేశ్వర్లు వినతులు స్వీకరించారు. ఇల్లు లేని తమకు డబుల్‌ బెడ్‌రూం గృహాల కేటాయింపులో ప్రాధాన్యతనివ్వాలని, పింఛన్లు అందించాలని వృద్ధులు, రేషన్ కార్డులు కావాలని తమ సమస్యలను ఏకరువుపెట్టారు. సోమవారం నాటి ప్రజావాణిలో 121 దరఖాస్తులు వచ్చాయి.

ట్యాంకు కట్టకుండానే డబ్బు మింగిండ్రు..
మా ఊరిలో రూ. 6లక్షలతో మంచినీటి ట్యాంకు  కట్టాల్సిఉంది. లక్ష రూపాయలు కూడా ఖర్చు చేయకుండానే ట్యాంకుకు మెరుగులు దిద్ది రూ.5.89లక్షల బిల్లులు పొందారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన కాంట్రాక్టర్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. – పుట్ట రామయ్య, ఖానాపూర్,మంథని

ఉపాధి మార్గం చూపించండి..
సుగ్లాంపల్లిలోని శాలివాహన పవర్‌ప్లాంటులో 8 ఏళ్లుగా పని చేస్తున్నాం. గతేడాది జూలై నుంచి ప్లాంటు మూసివేశారు. అప్పటినుంచి అక్టోబర్‌వరకు సగం జీతం ఇచ్చిన యాజమాన్యం, ఆ తర్వాత నుంచి పట్టించుకోవడంలేదు. కంపెనీలో పని చేస్తేనే మా కుటుంబం గడిచేది. ఇప్పుడు పనిలేక పాలుపోవడంలేదు. ప్లాంట్‌ను తెరిపించి పని కల్పించాలి. లేదంటే ప్రత్యామ్నాయ ఉపాధి మార్గం చూపించాలి.
– సుగ్లాంపల్లి పవర్‌ప్లాంట్‌ వర్కర్స్‌

పింఛన్  ఇప్పించండి
దేవుడిని నమ్ముకుని బతుకుతున్నాం. మాకు ఏ ఆధారం లేదు. సర్కారు పట్టించుకోవడంలేదు. మొన్నటిదాకా మాలాంటోళ్లకు పింఛన్  డబ్బులు వస్తాయన్నారు. ఇప్పటిదాకా ఇచ్చినోళ్లులేరు. ఆసరాగా నిలిచేందుకు ప్రభుత్వం పింఛన్ పించి ఆదుకోవాలి.
– రామగుండం జోగినులు

ఖాళీ చేయమని బెదిరిస్తున్నారు
చాలాఏళ్లుగా సుల్తానాబాద్‌ మండలం గర్రెపల్లిలోని సర్వే నంబరు 45లో నివసిస్తున్నాం. ప్రభుత్వం మాకు రేషన్ కార్డులు, ఆధార్‌కార్డులు ఇచ్చిం ది. అయితే ఇప్పుడు గ్రామానికి చెందిన మద్దెల శ్రీహరి భూమి తనదంటూ ఖాళీ చేయించాలని కొందరు అధికారులతో కలిసి బెదిరిస్తున్నారు. ఇళ్ల సమీపంలో మద్యం దుకాణం పెట్టి ఇబ్బంది పెడుతున్నాడు.  –గర్రెపల్లి ఒడ్డెర కుటుంబాలు

కనీస వసతులు కల్పించాలి
సింగరేణి ప్రాజెక్టు కోసం మా భూములు తీసుకున్నారు. పునరావాసకాలనీలో కనీస సౌకర్యాలు లేవు. తాగునీరు, డ్రెయినేజీలు నిర్మించలేదు. విద్యుత్‌సౌకర్యం లేక అంధకారం నెలకొని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఎన్నోసార్లు సింగరేణి, రెవెన్యూ అధికారులకు మొరపెట్టుకున్నాం. – గోపాల్, రాజమల్లు, లద్నాపూర్‌

మరిన్ని వార్తలు