వెంట్రుకలతో చెట్టును వంచగలమా?

28 Jul, 2015 09:32 IST|Sakshi
వెంట్రుకలతో చెట్టును వంచగలమా?

హైదరాబాద్: వెంట్రుకతో చెట్టును సులువుగా వంచేయగలమా..? అంటే ఇది మనిషికి సాధ్యం కాదు. కేవలం ఖడ్గమృగమే చేయగలదు. అది కూడా దాని భారీ శరీరంతో కాదు, దాని ముక్కుపై ఉండే చిన్న కొమ్ముతో! ఖడ్గమృగం కొమ్ము ఇతర జంతువుల్లా ఎముకతోనో, వేరే ప్రత్యేక పదార్థంతోనో కాకుండా వెంట్రుకలతో తయారై ఉంటుంది. అందుకే దాని కొమ్ము ఆవు, జింక వంటి జంతువుల కొమ్ముల్లా పుర్రెకు అతుక్కుని ఉండదు. నిజానికి ఏ జంతువుకైనా వెంట్రుక అనేది మెత్తగా ఉంటుంది. ఖడ్గమృగానికి కూడా అంతే. కాకపోతే ముక్కుపై ఉండే వెంట్రుకలు గట్టిగా నొక్కినట్టుంటాయి. అందుకే ఈ కొమ్ము గట్టిగా ఉంటుంది. ఖడ్గమృగం కొమ్ములో ఉండే వెంట్రుకలు ‘కెరటిన్’ అనే పదార్థంతో తయారవుతాయి.

మన జుట్టు, గోళ్లు తయారయ్యేది కూడా కెరటిన్‌తోనే. అందుకే ఖడ్గమృగం కొమ్ము జీవితాంతం పెరుగుతూనే ఉంటుంది. ఇంత గట్టిగా ఉండే కొమ్ము సాయంతో చిన్న చెట్లను వంచి వాటి ఆకులను తింటుందీ జంతువు. భారతీయ, జావా ఖడ్గమృగాలకు ఒకటే కొమ్ము ఉండగా తెలుపు, నలుపు సుమత్రా ఖడ్గమృగాలకు రెండు కొమ్ములుంటాయి. పూర్వం చైనీయులు వీటి కొమ్ములను జ్వరానికి, విషపు ఆహారానికి, ఇతర జబ్బులకు ఔషధంగా వాడేవారు. నేటికీ దీని కొమ్ముల కోసం మనుషులు వేటాడుతున్నారు. దీంతో ఖడ్గమృగాల సంఖ్య తగ్గిపోతోంది.

మరిన్ని వార్తలు