కొనబొతే కొరివి..!

18 Mar, 2017 23:30 IST|Sakshi
కొనబొతే కొరివి..!
– సామాన్యులకు అందని సన్నబియ్యం
– ఆరుమాసాల్లో క్వింటాపై రూ.1000 పెరుగుదల
– అధిక దిగుబడులు వచ్చినా తగ్గని ధరలు
నంద్యాల అర్బన్‌: గత ఖరీఫ్‌ వరిలో ఎకరాకు 45నుంచి 50బస్తాల దిగుబడులు వచ్చినా సన్న బియ్యం సామాన్యులకు అందనంత దూరంలో ఉన్నాయి. బియ్యం ధరల పెరుగుదలతో సన్న బియ్యం పండుగ పూటలకే సరిమితమయ్యే పరిస్థితులు కనబడుతున్నాయని మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నంద్యాల డివిజన్‌లో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. మహానంది మండలం బుక్కాపురం గ్రామ రైతు పన్నాగి రమణయ్య వరి సాగులో హెక్టార్‌కు 11,062.5కిలోల దిగుబడి సాధించి రాష్ట్ర స్థాయి పురస్కారంతో పాటు రూ.15వేల నగదు ప్రోత్సాహకాన్ని అందుకున్నారు.
 
అయితే ఆశించిన దిగుబడులు రావడమే తరువాయి రైతులు పొలాల్లోనే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించారు. డిసెంబర్‌ చివర, జనవరి మొదటి వారాల్లో ఖరీఫ్‌ దిగుబడులు అయిన కర్నూలుసోనా రకం 78కేజీల వడ్ల బస్తా రూ.1250 నుంచి రూ.1300తో అమ్మకాలు జరిగాయి. అప్పట్లో మొదటి రకం బియ్యం క్వింటా రూ.2750, రెండో రకం రూ.2650 ఉండేది. ఫిబ్రవరిలో మొదటి రకం రూ.3300, రెండో రకం రూ.3200, మార్చి నెలలో క్వింటా మీద రూ.450 పెరిగి మొదటి రకం రూ.3750తో అమ్మకాలు జరుగుతున్నాయి. నంద్యాల సోనా రకానికి మరింత డిమాండ్‌ ఉంది. డిసెంబర్‌లో క్వింటా రూ.4100 ఉండగా, ప్రస్తుతం రూ.4400కు చేరింది. ప్రస్తుతం కర్నూలు సోనా రకం వడ్లు రూ.1900లకు చేరింది.
 
మొదట్లో పంట దిగుబడులు ఎక్కడ పెట్టుకోవాలో తెలియని రైతులు ధాన్యాన్ని కల్లాల్లోనే అమ్ముకొని తీవ్ర నష్టాలకు గురయ్యారు. దళారుల మాటలు నమ్మి మరికొంత మంది రైతులు మోసపోయారు. రైతుల పంట దిగుబడుల అమ్మకాలతో మిల్లర్లు, దళారులు లక్షలాదిరూపాయలు ఆర్జించారు. వారానికి ఒకసారి పెరుగుతున్న బియ్యం ధరలతో మధ్యతరగతి, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సన్నబియ్యం కొనలేని పరిస్థితులు దాపురించాయని వాపోతున్నారు.
 
 
ధరలు పెరుగుతున్నాయంటూ..
జూన్‌ నాటికి క్వింటా బియ్యం రూ.6వేలకు చేరే అవకాశం ఉందని వ్యాపారులు వినియోగదారులను అయోమయాలకు గురి చేస్తున్నారు. ఆరుమాసాల క్రితం పాతబియ్యం క్వింటా రూ.3500 నుంచి రూ.3700 వరకు ఉండగా, ప్రస్తుతం రూ.4300 నుంచి రూ.4700కు చేరింది. ఆరునెలల్లోనే రూ.1000 పెరగడంతో వినియోగదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మన రాష్ట్రంలో పండించిన వరిపంటలు ఇతర రాష్ట్రాలకు తరలించడం, గోదాముల్లో అక్రమ నిల్వలు ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.
 
దుకాణాదారులది అదే తీరు..
బియ్యం ధరల పెరుగుదలను అదునుగా తీసుకొని మార్కెట్లో వాటిని విక్రయించే కొందరు వ్యాపారులు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. తక్కువ క్వాలిటీ రకాలను తెచ్చి ఎక్కువ మొత్తాలను వసూలు చేస్తున్నారన్న విమర్శలున్నాయి.  పౌరసరఫరాల శాఖ నిబంధనలకు విరుద్ధంగా రైస్‌మిల్లుల్లో భారీగా ధాన్యాన్ని నిల్వ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో నంద్యాలలో బియ్యం నిల్వలు చేస్తున్న రైస్‌ మిల్లులు, గోదాములపై అధికారులు దాడులు చేసిన దాఖలాలు లేవు. దీంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. 
 
రేషన్‌ బియ్యం కేజీ రూ.15 పైమాటే..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రూపాయకే కిలో బియ్యం కాస్త సాధారణ రిటైల్‌ దుకాణాల్లో కేజీ రూ.15 నుంచి రూ.18 వరకు విక్రయిస్తున్నారు. కొందరు లబ్ధిదారులతో పాటు రేషన్‌ దుకాణాల ద్వారా బ్లాక్‌ మార్కెట్లోకి వెళ్తున్న బియ్యం తిరిగి దుకాణాలు, రైస్‌ మిల్లులకు నేరుగా చేరుతున్నాయి. నిరుపేదలు తమకు వచ్చిన బియ్యంతో పాటు అదనంగా బియ్యం కొనుగోలు చేయాల్సి ఉంటే దుకాణాల వద్దకు పరుగులు తీయాల్సి వస్తుంది. మామూలు రకం బియ్యం ధరలు కూడా పెరగడంతో మధ్యతరగతి ప్రజలు రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేయాల్సి వస్తుంది. బియ్యం ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నా వాటిని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైంది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వినియోగదారులు వాపోతున్నారు. బియ్యం కృత్రిమ కొరతను సృష్టించి ధరలు పెంచుతున్న వ్యాపారుల పట్ల విజిలెన్స్‌ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి బియ్యం ధరలు అనుకూలంగా ఉండేలా చూడాలని పలువురు కోరుతున్నారు. 
 
రేషన్‌ బియ్యమే తినాల్సి వస్తుంది: జయరాజు, భీమవరం
పెరుగుతున్న ధరలతో సన్నబియ్యం సామాన్యులకు అందనంత దూరంలో ఉంటున్నాయి. రేషన్‌ బియ్యంతో కాలం గడుపుకోవాల్సి వస్తుంది. రెండుమూడు నెలలకు ఒకసారి ధరలు పెరుగుతుండటంతో ఇబ్బందులు పడుతున్నాం. సన్నబియ్యం పండుగలకే పరిమితమయ్యే పరిస్థితులు దాపురించేలా ఉంది. 
 
>
మరిన్ని వార్తలు