'మచిలీపట్నంపై తుపాను ప్రభావం లేదు'

19 May, 2016 19:07 IST|Sakshi

విజయవాడ : 'రావొను' తుపాను ప్రభావం మచిలీపట్నంపై లేదని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్, చేనేత శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గురువారం విజయవాడలో వెల్లడించారు. ఈ తుపాను ఒడిశా వైపునకు వెళ్తుందని చెప్పారు. తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. గడిచిన 24 గంటల్లో కృష్ణాజిల్లాలో 14 సెం.మీ వర్షపాతం నమోదు అయిందని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
 

'కృష్ణా'లో భారీ వర్షం
మచిలీపట్నం : రావోను తుపాను ప్రభావంతో కృష్ణాజిల్లా వ్యాప్తంగా గురువారం భారీ వర్షం కురిసింది. ఉదయం 8.30 గంటల వరకు జిల్లాలో 55 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. 8.30 నుంచి 12 గంటల వరకు 23.7 మిల్లీమీటర్లు, 12 నుంచి 3 గంటల వరకు 5.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో మామిడికాయలు రాలిపోయాయి. బలమైన గాలుల తాకిడికి అరటితోటలు దెబ్బతిన్నాయి.

మచిలీపట్నం, గుడివాడ, పెడన, అవనిగడ్డ, పామర్రు తదితర ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, వృక్షాలు విరిగిపడడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తుపాను ప్రభావంతో విపత్కర పరిస్థితులు ఏర్పడితే ప్రజలను రక్షించేందుకు రెండు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను మచిలీపట్నం, అవనిగడ్డలలో సిద్ధంగా ఉంచారు. కలెక్టర్ బాబు.ఎ నాగాయలంక మండలంలో పర్యటించి తుపాను పరిస్థితులను సమీక్షించారు. సముద్రతీరం వెంబడి ఉన్న మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి....
అమలాపురం 22 సెం.మీ
కాకినాడ 17 సెం.మీ
అనకాపల్లి 14 సెం.మీ
బాపట్ల, అంబాజీపేట 13 సెం.మీ
అవనిగడ్డ, ఆత్మకూరు, చోడవరం 12 సెం.మీ
విశాఖపట్నం, నరసాపురం 11 సెం.మీ
గుడివాడ 10 సెం.మీ
విజయనగరం, పాలకోడేరు, పెద్దాపురం, కావలి, డెంకాడ, గంట్యాడ 9 సెం.మీ
పూసపాటిరేగ, తెనాలి 8 సెం.మీ
రేపల్లె, ఉయ్యూరు, ఒంగోలు, భీమవరం, వేపాడ, గరివిడి, కారంచేడు, చీపురుపల్లి, శృంగవరపుకోట, తణుకు 7 సెం.మీ

>
మరిన్ని వార్తలు