కలియుగ దైవం ఫేం డైరెక్టర్‌ రోశిరాజు

3 Sep, 2017 04:36 IST|Sakshi
కలియుగ దైవం ఫేం డైరెక్టర్‌ రోశిరాజు

కేకే.నగర్‌: ఎవరి జీవితం ఎలా ఉంటుందో లలాట లిఖితం అంటారు. ‘మ్యాన్‌ ప్రపోజల్‌– గాడ్‌ డిస్పోజల్‌’ అనే ప్రసిద్ధ ఇంగ్లి్లషు నానుడిలా మన ఊహలు ప్రయత్నాలు వేరు ఫలితాలు వేరు అనే విషయం చిత్తూరు జిల్లాకు చెందిన రోశిరాజు జీవితంలో నిజమైంది. మనవూరులో డాక్టర్‌గా సేవలు చేయాలని కలలు కన్న ఆయన జీవితం చిత్రమైన మలుపు తిరిగి చిత్రసీమలో వెలుగొందారు. మావూరు విద్యార్థి నేడు చెన్నపట్నం సెలబ్రిటీగా మారాడని గ్రామస్తులు సంతోషపడుతుంటారని ఆయన తన గత జ్ఞాపకాలను ‘మావూరు– మనవూరు’ శీర్షిక కోసం గుర్తుచేసుకున్నారు. ఆయన మాటల్లోనే..

 నా పేరు మేడిద రోశిరాజు. నేను పుట్టి, పెరిగింది శ్రీకాళహస్తి సమీపం మడిబాక. మాది వ్యవసాయ కుటుంబం. తాత మేడిద వెంకట సుబ్బురాజు కార్వేటి నగరం రాజుల వద్ద కమాండర్‌గా పని చేసేవారు. నాన్న మేడిద వెంకటరాజు, అమ్మ చెంగమ్మల ఐదుగురు మగ సంతానంలో నేను చివరివాడిని. మా మడిబాక గ్రామానికి సంబంధించి అప్పట్లో మొట్ట మొదటి గ్రాడ్యుయేట్‌ను నేనే. పచ్చని పొలాలతో మా గ్రామం ప్రశాంతంగా ఉంటుంది. అక్కడి ప్రజలకు కులమతాల ద్వేషాలు, జాతి, మత వైషమ్యాలు కానీ తెలియవు. ప్రతి ఒక్కరూ వరుసలు కలుపుకుని పిలుచుకుంటూ అందరితో ప్రేమగా ఉండేవారు. అప్పట్లో మా గ్రామం నుంచి ఆరు కిలో మీటర్ల దూరం పంట కాలువలు, స్వర్ణముఖి నది కాలినడకన దాటుకుని వెళ్లి పాపానాయుడు పేటలోని హైస్కూలులో ఎస్‌ఎస్‌ఎల్‌సీ వరకు చదివాను. అదే స్కూల్‌లో ప్రముఖ నటుడు మోహన్‌బాబు కూడా చదివారు. ఆయన నాకంటే రెండేళ్లు సీనియర్‌. అందరం కలిసి ఆడుకునేవాళ్లం. తర్వాత శ్రీవేంకటేశ్వర ఆర్ట్స్‌ కళాశాలలో డిగ్రీలో చేరాను. డాక్టర్‌ కావాలన్న ఆశతో బీఎస్సీ సీటు కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే బీకాంలో సీటు దొరకడంతో ఇష్టం లేకుండానే చేరాను. తరగతిలో లెక్చరర్‌ పాఠాలు చెప్తుంటే నేను కథలు రాసుకుంటూ సినిమాలపై మోజు పెంచుకున్నాను. మా ఊరి పెద్ద రోశయ్య, మా ఉపాధ్యాయుడు జీసీ గురప్ప ఈ ఇద్దరూ అప్పటి ప్రముఖ డైరెక్టర్లు విఠలాచార్య, ఆదుర్తి సుబ్బారావులను పొగుడుతూ మాట్లాడేవారు. ఘంటసాల మాస్టారు పాటలతో ప్రభావితుడినైన నేను ఆయన పాడే పాటలకు ఎన్టీఆర్, నాగేశ్వరరావు తెరపై పాడుతున్నట్లు నటించడం ఇవన్నీ నన్నెంతో ఆకర్షించాయి. తెరపైన హీరోలు అద్భుతంగా నటించడానికి తెర వెనుక ఉన్న డైరెక్టర్లే కారణం అని తెలుసుకుని ఎలాగైనా డైరెక్టర్‌ కావాలనే కోరిక పుట్టింది. ముఖ్యంగా ఆదుర్తి సుబ్బారావు, విఠలాచార్య లాగా నేను కూడా మంచి పేరు తెచ్చుకోవాలన్న జిజ్ఞాస నాలో పెరిగింది.

చిత్రసీమ కోసం చెన్నై రాక..
 వెంకటేశ్వర కళాశాలలో డిగ్రీ పూర్తిచేశాక తిరుపతి జ్యోతి టాకిస్‌ సుబ్బారావు గారితో పరిచయం ఏర్పడింది. ఆయన నా ఆసక్తిని ప్రోత్సహించి చెన్నైకు తీసుకొచ్చారు. విజయా పిక్చర్‌ పూర్ణచంద్రరావుకి పరిచయం చేశారు. 1970లో విఠలాచార్య దర్శకత్వం వహించిన ‘గండికోట రహస్యం’ సినిమాలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చారు. అప్పట్లో డిగ్రీ చదివి సినిమాల్లో పనిచేసేవారు చాలా తక్కువ. అందుకే విఠలాచార్య నాపై ప్రత్యేక అభిమానంతో మూడో సినిమా నుంచే కో– డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చారు. తర్వాత అగ్గివీరుడు, ఆలీ బాబా 40 దొంగలు, రైతేరాజు, రాజకోట రహస్యం, పల్లెటూరి చిన్నోడు సహా 20 సినిమాలకు కో డైరెక్టర్‌గా పని చేశాను. గ్రాఫిక్స్‌ లేని రోజుల్లో సెట్‌లోనే మిక్చర్‌ కెమెరాలతో ఎన్నో రకాల చిత్ర విచిత్రాలు, మాయమంత్రాలతో జానపద బ్రహ్మ విఠలాచార్య సినిమాలు తీసి ప్రేక్షకులను ఆకర్షించారు. పల్లెటూరి చిన్నోడు సినిమా విడుదల సమయంలో మేనమామ కుమార్తె ఆదిలక్ష్మితో వివాహం జరిగింది. వివాహితునిగా చెన్నైలో అడుగుపెట్టిన వెంటనే ‘రాముని మించిన రాముడు’ సినిమాకు కో–డైరెక్టర్‌గా పిలుపు వచ్చింది. అప్పట్లో ఎన్టీఆర్‌తో పది సినిమాలు చేశాను. ఆయన నాపై చూపిన అభిమానం, ఆదరణ జన్మలో మర్చిపోలేను. ఆయనకు దగ్గరగా డైలాగ్స్‌ చెప్పే అవకాశం రావడం నాపూర్వ జన్మ సుకృతం. అలాగే అక్కినేని నాగేశ్వరరావు నా సిన్సియారిటీని సెట్‌లో అందరి ముందు పొగడడం, అన్నపూర్ణమ్మ గారి అల్లుడు సినిమా క్లైమాక్స్‌ చూసిన బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్‌ భానుమతి రామకృష్ణ నాకు హేట్సాఫ్‌ చెప్పడం, నటి ఊర్వశి శారద ప్రధానపాత్రగా స్వీయదర్శకత్వంలో నేను తీసిన కలియుగ దైవం, ఉగ్రవాదం చిత్రాల సమయంలో ఆమె నాకు అందించిన సహకారం ప్రోత్సాహం, నన్ను సోదరుడిగా భావించి నాపై చూపించిన అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను. కలియుగ దైవం, ఉగ్రవాదం సహా ఐదు సినిమాలకు దర్శకత్వం వహించాను.

సినిమా రంగం హైదరాబాద్‌కు తరలినప్పుడు..
నా ఆశ, అభిలాష తీర్చుకునే అవకాశాలు కల్పించిన చెన్నై అంటే నాకు ప్రాణం. నా మాతృభూమి కంటే చెన్నైనే ఎక్కువ ఇష్టపడతాను. అప్పట్లో సినీరంగం హైదరాబాద్‌కు తరలిపోయింది. రమ్మని పిలిచినా నేను అక్కడికి వెళ్లలేదు. తెలుగు చిత్రరంగం తరలిపోయిన తర్వాత కూడా చాలా బిజీ అయ్యాను. దూరదర్శన్‌ సీరియల్స్, ప్రముఖ జెమిని, ఈటీవీ చానల్స్‌లలో మెగా సీరియల్స్‌ చేశాను. షార్ట్‌ఫిల్మ్‌ వృక్షగా«థను బాంబే దూరదర్శన్‌లో ప్రసారం చేసి విమాన టికెట్‌ ఇచ్చి పిలిపించారు. అక్కడ జరిగిన ఫిలిం ఫెస్టివల్‌లో 56 దేశాలు పాల్గొన్నాయి. అందరూ వృక్ష గాథకు మెరిట్‌ సర్టిఫికెట్‌ అందజేశారు. మద్రాసులో నాకు సన్మానాలు చేశారు.

చెన్నైలో స్థిర నివాసం..
యుక్త వయసులో చెన్నైకు వచ్చిన నాకు సినీ ప్రపంచం ఓ రంగుల కలగా అనిపించింది. అగ్గి వీరుడు సెట్‌లో మొదట అడుగు పెట్టగానే విఠలాచార్య దర్శకత్వంలో నట సార్వభౌమ ఎన్టీఆర్‌ను, విజయలలిత కవ్విస్తూ నటించడం నన్నొక కొత్త లోకానికి తీసుకెళ్లింది. వడపళని విజయ స్ట్రీట్‌లో బాడుగ ఇంట్లో ఉండేవాడిని అక్కడే పెళ్లి జరిగింది. నాకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. కుమారులిద్దరిని నా అభిలాషకు తగ్గట్టు ఎడిటింగ్‌ రంగంలో చేర్పించాను. కుమార్తెకు, ఓ కుమారుడికి పెళ్లి చేశాను.

మరిన్ని వార్తలు