పరిహారం దోపిడీకి కుట్ర

27 Jun, 2016 03:26 IST|Sakshi
పరిహారం దోపిడీకి కుట్ర

రామదాసుకండ్రిగలో రూ.16 కోట్ల భూమికి ఎసరు  
దళారులే సూత్రధారులు అధికారపార్టీ నాయకుల అండ

 
అవి కృష్ణపట్నం పోర్టు రహదారి పక్కన రూ. కోట్లు విలువ చేసే భూములు. సాగుకు యోగ్యంగా లేక పోవడంతో ఏళ్ల తరబడి నుంచి బీళ్లుగానే ఉన్నాయి. ఆ భూములను ఏపీఐఐసీ(ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్     ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్)కు కేటాయించను న్నారని ముందే పసిగట్టారు కొందరు పెద్దలు. దళారులను రంగంలోకి దించి అధికారపార్టీ నాయకుల అండతో పేదల పేరుతో ఉన్న ఆ భూములను తక్కువ ధరకు అగ్రిమెంట్లు చేయించుకున్నారు. ఒప్పుకోని రైతులను బెదిరించి మరీ సంతకాలు చేయించుకున్నారు. సుమారు రూ.16 కోట్లు పేదలకు దక్కాల్సిన పరిహారాన్ని దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారు. ఇందులో అధికారులూ వాటాదారులనే ఆరోపణలున్నాయి.
 

 
వెంకటాచలం:
వెంకటాచలం మండలం రామదాసుకండ్రిగ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 2194, 2195, 2196, 2200, 2201లోని 122ఎకరాల సీలింగ్ భూములను ఆ గ్రామంలోని పేదలను గుర్తించి 1976లో ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ భూముల్లో కొందరు అప్పట్లో మెట్ట పంటలు పండించారు. 15 ఏళ్ల నుంచి ఆ భూముల్లో మొక్కలు మొలచి బీళ్లుగా మారాయి. కృష్ణపట్నం పోర్టు రహదారి నిర్మాణానంతరం ఆ భూములపై కబ్జాదారుల కన్ను పడింది.  పలువురు పారిశ్రామికవేత్తలు ఆ భూములను చేజిక్కించుకోవాలని ముమ్మర ప్రయత్నాలు చేసినప్పటికీ కుదరలేదు. జిల్లా అధికారులు ఎన్‌జీవోలకు ఆ భూములను ఇవ్వాలని ప్రతిపాదనలు పెట్టగా గ్రామస్తులు అడ్డుకున్నారు.


 అధికారమే అండగా
కొన్ని నెలల క్రితం నుంచి ఈ భూములపై అధికారపార్టీ ప్రముఖులతో సంబంధాలుండే రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను పడింది. ఈ భూములు ఏపీఐఐసీకు కేటాయించనున్నారనే విషయాన్ని పసిగట్టి ఎలాగైనా పేదల నుంచి తక్కువ ధరకు భూములను కొనుగోలు చేయాలనుకున్నారు. అధికార పార్టీ నాయకుల అండతో గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులను దళారులుగా మార్చారు.  రామదాసుకండ్రిగ సీలింగ్ భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని దళారులు కొన్ని నెలల క్రితం గ్రామంలో విస్తృత ప్రచారం చేశారు. ప్రభుత్వం భూములు తీసుకుంటే ఏమీ రాదని, కొందరు ఎకరా రూ.6 లక్షల లెక్కన కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారని అమ్ముకుంటే మంచిదని రైతులను మాయ చేశారు. దళారుల మాయమాటలు నమ్మిన రైతులు తమ పొలాలను ఎకరా రూ.6 లక్షల వంతున అమ్మేందుకు సమ్మతించారు. ఇందుకు ఒప్పుకోని కొందరిపై దౌర్జాన్యాలకు పాల్పడుతున్నారు. ఈ విషయంపై వెంకటాచలం పోలీస్‌స్టేషన్‌లోనూ బాధితులు ఫిర్యాదుచేసి ఉన్నారు. ఆరు నెలల క్రితం ఒక్కో  రైతుకు అడ్వాన్స్‌గా రూ.30 వేలు ఇచ్చి గూడూరులోని ఐడీబీఐ బ్యాంకులో ఖాతాలు ఓపెన్ చేయించారు.  ఒక్కో రైతు నుంచి ఆ నగదులో దళారులు రూ.5వేలు వసూలు చేశారు.


 రైతుల ఆగ్రహం
 రెవెన్యూ అధికారులు  ఇటీవల గ్రామసభ నిర్వహించి రైతులకు ఇచ్చిన సీలింగ్ భూములు ఏపీఐఐసీకు కేటాయిస్తామని తెలియజేశారు. భూములకు సంబంధించి మీ వద్ద ఉన్న ఆధారాలు చూపితే పరిహారం వస్తుందని అధికారులు తెలపడంతో దళారుల దోపిడీ బయట పడింది. ప్రస్తుతం సీలింగ్ భూముల్లో కృష్ణపట్నంపోర్టు రోడ్డు, నివాస స్థలాలు ఏర్పాటుకు పోను సుమారు 100ఎకరాలు మిగిలి ఉంది. పేదలకు చెందాల్సిన రూ.కోట్ల పరిహారాన్ని దళారులు మాయచేసి వ్యాపార వేత్తలకు దక్కేలా చేస్తున్నారు. ఇందులో కొందరు అధికారుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఎకరాకు ఏపీఐఐసీ ద్వారా  రూ.14 లక్షల నుంచి రూ.16లక్షలు పరిహారం వస్తుందని ప్రచారం ఉంది. దీంతో దళారులు తమను మోసం చేసి అగ్రిమెంట్లు రాయించుకున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిహారం లబ్ధిదారులకు చెందేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు