రీజియన్‌ పరిధిలో రూ. 31 కోట్ల నష్టం

6 Oct, 2016 21:34 IST|Sakshi
రీజియన్‌ పరిధిలో రూ. 31 కోట్ల నష్టం
ఆర్టీసీ ఆర్‌ఎం జ్ఞానంగారి శ్రీహరి
 
మాచర్ల : గుంటూరు ఆర్టీసి రీజియన్‌ పరిధిలోని 13 డిపోలు రూ.31 కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్నాయని, ఈ నష్టాల నుంచి బయట పడేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఆర్టీసీ రీజియన్‌ మేనేజర్‌ జ్ఞానంగారి శ్రీహరి చెప్పారు. స్థానిక ఆర్టీసి బస్టాండ్‌ను గురువారం ఆయన సందర్శించారు. అనంతరం ఆర్టీసీ గ్యారేజ్‌లో కార్మికులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ గుంటూరు రీజియన్‌ పరిధిలో ప్రతి నెల ప్రైవేటు వాహనాల ద్వారా రూ. 15 లక్షలు, ప్రైవేటు బస్సుల వల్ల రూ.15 లక్షల ఆదాయాన్ని కోల్పోతున్నామన్నారు. ఈ విధంగా ఏడాదికి రూ.108 కోట్లు నష్టపోతున్నామని, దీనిని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్మికులతో మమేకమయ్యేందుకు గురువారం బ్రేక్‌ఫాస్ట్‌ విత్‌ ఆర్‌ఎం కార్యక్రమాన్ని  సత్తెనపల్లి నుంచి ప్రారంభించామన్నారు. మీరు డీఎం అయితే... అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించినట్టు  చెప్పారు. ఆర్టీసి కార్మికులకు సంబంధించి కేసుల నమోదు ఎత్తివేసినట్టు చెప్పారు. 1500 కేసులను పరిష్కరించామని, ప్రతి కార్మికుడి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. ఇక నుంచి మెమోలు,  కార్మికులను ఇబ్బందిపెట్టే చర్యలు ఉండవన్నారు. సంస్థను బలోపేతం చేసేందుకు ప్రతి కార్మికుడు కృషిచేయాలని కోరారు. జిల్లాలోని 13 ఆర్టీసి డిపోల్లో రెండు లక్షల మందికి పాసులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.
మరిన్ని వార్తలు