ఆర్టీసీ కార్మికులు రోడ్డుపాలు

16 Dec, 2016 22:53 IST|Sakshi
ఆర్టీసీ కార్మికులు రోడ్డుపాలు
  •  అన్‌సీజన్‌ పేరుతో 59 మంది తొలగింపు
  • యాజమాన్యతీరుపై కార్మిక సంఘాల ఆగ్రహం 
  • అనంతపురం న్యూసిటీ: 

    అన్‌సీజన్‌ పేరుతో ఆర్టీసీ యాజమాన్యం రీజియన్‌ వ్యాప్తంగా 59 మంది కార్మికులను రోడ్డుపాలు చేసింది. శనివారం నుంచి విధులకు హాజరుకావాల్సిన పనిలేదని తేల్చి చెప్పింది. దీంతో కార్మికులు రోడ్డున పడ్డారు. ఉన్నఫలంగా విధుల నుంచి తొలగిస్తే తమ బాధ ఎవరితో చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రీజియన్‌లోని రెగ్యులర్‌గా తిరిగే 42 బస్సులను రద్దు చేసిన కారణంగా కార్మికులు వీధిన పడాల్సి వచ్చిందని కార్మిక సంఘాలంటున్నాయి.

    కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి కాంట్రాక్టు పద్ధతిన ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో రీజియన్‌లో 109 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఏడాదిన్నర గడిచిన తర్వాత  106 మంది విధుల్లో చేరారు. సమ్మె కాలంలోనూ విధులకు హాజరయ్యారని 28 మందిని ప్రభుత్వం రెగ్యులర్‌ చేసింది. ఇక మిగితా వారిని కాంట్రాక్టు పద్ధతినే కొనసాగించింది. 

    42 సర్వీసుల రద్దు...

    రద్దీగా ఉండే బెంగళూరు, బళ్లారి, హిందూపురం, ధర్మవరం, పెనుకొండ, కళ్యాణదుర్గంలాంటి ప్రాంతాలకు సంబంధించి 42 బస్సు సర్వీసులను  అధికారులు ఆపేశారు. ఈ కారణం చూపి యాజమాన్యం కాంట్రాక్టు సిబ్బందిని పక్కన పెట్టింది. అసలే ప్రైవేట్‌ వాహనాలతో ప్రజలకు భద్రత లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఉన్న బస్సులను తొలగించి ప్రైవేట్‌ రవాణాకు ప్రభుత్వం పరోక్షంగా సహకరించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

    సమ్మెలో పని చేసినా తొలగించారు :  మల్లికార్జున డ్రైవర్, అనంతపురం

     సమ్మె కాలంలో పనిచేసిన తనను రెగ్యులర్‌ చేయలేదు. ఇప్పుడేమో విధులకు రావద్దని చెబుతున్నారు. 240 రోజులు విధుల్లో పని చేస్తే రెగ్యులర్‌ చేయాలి. ఆ నిబంధనను పాటించలేదు. మా పరిస్థితేమిటి?  ప్రభుత్వం ఆదుకోవాలి.

     

    సరైన పద్ధతి కాదు :  కొండయ్య, ఈయూ నాయకుడు

    ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం అన్‌సీజన్‌ పేరుతో కార్మికులను తొలగించడం సరైన పద్ధతి కాదు. ఒక్కసారిగా 59 మందిని తొలగిస్తే వారెక్కడికి వెళ్లాలి. ప్రభుత్వం తక్షణం వారిని విధుల్లోకి తీసుకోవాలి.

     

    కార్మికులతో ఆడుకోవద్దు.. :  సుందర్రాజు,   వైఎస్సార్‌ మజ్దూర్‌ యూనియన్‌

    ప్రభుత్వం, యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.   కార్మికులకు ఉద్యోగభద్రత లేకుండా పోయింది. కార్మికులతో ఆడుకోవద్దు. ఇప్పటికైనా ప్రభుత్వం, యాజమాన్యం స్పందించి కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి.

     

మరిన్ని వార్తలు