వరంగల్‌లో ‘డబుల్‌’ రగడ

11 May, 2017 02:56 IST|Sakshi
వరంగల్‌లో ‘డబుల్‌’ రగడ

► 38 ఇళ్లు కూల్చివేసిన అధికారులు
► ఆందోళనకు దిగిన బాధితులు
► పలువురి ఆత్మహత్యాయత్నం
► మాజీ ఎమ్మెల్యే ధర్నా


వరంగల్‌:
డబుల్‌ బెడ్రూం ఇళ్లను నిర్మించేందుకు వరంగల్‌ నగరంలోని 12వ డివిజన్‌ ఎస్‌ఆర్‌నగర్‌లో బుధవారం వేకువజామున రెవెన్యూ, పోలీసు శాఖలు చేపట్టిన కూల్చివేత కార్యక్రమం రసాభాసగా మారింది. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని ఎస్‌ఆర్‌నగర్‌లో 792 మంది లబ్ధిదారులకు జీప్లస్‌–1 పద్ధతిలో డబుల్‌ బెడ్రూం ఇళ్లను 2015లో ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ ఇళ్లను 104 బ్లాకుల్లో నిర్మించేందుకు ఇంజనీరింగ్‌ అధికారులు ప్రతిపాదించి పనులు చేపట్టారు. ఎస్‌ఆర్‌నగర్‌లో సుమారు 250 మంది తమ ఇళ్లను కూల్చివేసేందుకు కాంట్రాక్టర్‌కు అప్పగించారు. మిగిలిన వారు జీప్లస్‌–1 వద్దని, వ్యక్తిగత ఇళ్లను నిర్మిస్తే ఒప్పుకుంటామని, లేకుంటే అసలు డబుల్‌ బెడ్రూం ఇళ్లు వద్దని అధికారులకు తెలిపారు. పలుమార్లు జిల్లా యంత్రాంగం అవగాహన సభలు పెట్టినా ఒప్పుకోకపోవడంతో వారి ఇళ్లను కూల్చే కార్యక్రమాన్ని వాయిదా వేశారు. బ్లాకుల్లో ఇళ్లు నిర్మించేందుకు మిగిలిన వారు సైతం ఒప్పుకుంటేనే పనులు సాగే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో అడ్డుగా ఉన్న ఇళ్లను కూల్చి వేసేందుకు బుధవారం అధికారులు వచ్చారు. ఒకేసారి 38 ఇళ్లను కూల్చివేయడంతో అందులో నివాసం ఉంటున్నవారు ఆందోళనకు దిగారు.

బాధితుల్లో ఒకరు ఉరివేసుకునేందుకు, మరొకరు కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యా ప్రయత్నానికి పాల్పడడంతో పోలీసులు అడ్డుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. తమ ఇళ్లను కూల్చివేసి పోతున్నారు.. ఎక్కడ ఉండాలో చెప్పాలని మహిళలు పోలీసులకు అడ్డం తిరిగారు. దీంతో అడ్డుగా ఉన్న మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఎస్‌ఆర్‌నగర్‌లో ఇళ్లను కూల్చివేయాలని ప్రభుత్వం, కలెక్టర్‌ ఆదేశాలు ఉన్నాయా అని ఆర్డీవో వెంకారెడ్డిని వర్ధన్నపేట మాజీ శాసనసభ్యుడు కొండేటి శ్రీధర్‌ ప్రశ్నించారు. అలాంటి ఆదేశాలు లేవని బ్లాక్‌లకు అడ్డంగా ఉన్నందున కూల్చివేస్తున్నామని ఆయన సమాధానం ఇచ్చారు. కూల్చివేతలను నిరసిస్తూ ప్రధాన రహదారిపై బాధితులతో కలసి శ్రీధర్‌ ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ కూల్చివేతల్లో పోలీసు డీసీపీ వేణుగోపాల్‌రావు, ఆర్డీవో వెంకారెడ్డి, ఏసీపీలు, తహసీల్దార్లు, ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు