పొంతన కుదరడం లేదు

21 Aug, 2017 04:03 IST|Sakshi
పొంతన కుదరడం లేదు

► బడి బయట పిల్లల గుర్తింపులో తేడాలు
►  స్థూల, నికర ప్రవేశాల మధ్య వ్యత్యాసం
► ప్రత్యేక సర్వే చేపడుతున్న సర్వశిక్ష అభియాన్‌


మదనపల్లె సిటీ: బడిఈడు పిల్లలంతా పాఠశాలలోనే ఉండేలా ఏటా బడి పి లుస్తోంది, అమ్మ ఒడి – ప్రభుత్వ బడి, మళ్లీ బడికి లాంటి కార్యక్రమాలను విద్యాశాఖ, సర్వశిక్ష అభియాన్‌ సంయుక్తం గా నిర్వహిస్తున్నాయి. అ యినప్పటికీ జిల్లాలో బడిబయట పిల్లల సంఖ్య వందల్లో ఉన్నట్లు విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ప్రజాసాధికార సర్వే గణాంకాలు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. జిల్లాలో 57 వేల మంది పిల్లలు బడి బయ టే ఉన్నట్లు నివేదికలు చూపుతున్నాయి. దీంతో సర్వశిక్ష అభియాన్‌ విద్యార్థి గణన పేరుతో 15 రోజులుగా ఊరూరా, ఇంటింటికీ సిబ్బందిని పంపి బడి ఈడు పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు చేపడుతోంది.

పక్షం రోజుల ప్రత్యేక కార్యక్రమం..
విద్యార్థి గణన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యా ప్తంగా పక్షం రోజుల పాటు ప్రత్యేకంగా చేపడుతున్నారు. ఆధార్‌ అనుసంధానం చేయని విద్యార్థులను గుర్తించి నమోదు చేయిస్తున్నారు. గుర్తింపులేని పాఠశాలల్లో చదివే విద్యార్థులను గుర్తించి, వారిని ప్రభుత్వ గుర్తింపు గల పాఠశాలల్లో చేర్పించేలా ప్రణాళికలు రూపొందించారు. బోధన కుంటుపడుతుందనే భావనతో ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులను తప్పించా రు. కేవలం సర్వశిక్ష అభియాన్‌కే పరి మితం చేశారు.

ప్రాజెక్టు అధికారి నుంచి క్లస్టర్‌ రిసోర్సుపర్సన్ల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లాలో సర్వశిక్ష అభియాన్‌ సెక్టోరల్, అసిస్టెంట్‌ సెక్టోరల్‌ అధికారులు, డివిజనల్‌ లెవల్‌ మానిటరింగ్‌ టీమ్‌ సభ్యులు, క్లస్టర్‌రిసోర్సు పర్సన్లు, పరిమితకాలపు విద్యాబోధకులు, సహిత విద్య కో–ఆర్డినేటర్లు, ఎంఐఎస్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు విద్యార్థి గణనలో పాల్గొంటున్నారు. ఇంటింటికీ వెళ్లి విద్యార్థులను గుర్తించి వారి ఆధార్‌ నంబర్లు యూ డైస్‌తో అనుసంధానం చేస్తూ ఏపీజీఈఆర్‌ యాప్‌లో నమోదు చేస్తున్నారు.

హౌస్‌ సర్వేలో చూపిన బడిబయట విద్యార్థుల సంఖ్యకు, విద్యాశాఖ డైస్‌ ప్రకారం చూపే బడిబయట పిల్లల సంఖ్యకు భారీ వ్యత్యాసం కన్పిస్తోంది. సర్వే సమయంలో గణకులకు రోజువారీ సర్వేకు లక్ష్యాలను నిర్దేశించడంతో వారు ఇష్టారాజ్యంగా వివరాలను నమోదు చేసేశారని విద్యాశాఖ చెబుతోంది. చదువుతున్న విద్యా సంస్థ, డైస్‌ కోడ్‌ నమోదు వంటి ఆప్షన్‌ ఇవ్వకపోవడం కూడా తప్పుగా నమోదవ్వడానికి కారణమని సర్వశిక్ష అభియాన్‌ అధికారులు అంటున్నారు. ఇందులో విద్యాశాఖతో పాటు ఉపాధ్యాయుల తప్పిదం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గత విద్యా సంవత్సరంలోనే విద్యార్థికి ఆధార్‌ తప్పనిసరి చేశారు. అంతకుముందు ఉపాధ్యాయులు చెప్పిందే లెక్క. ఇదే అదునుగా కొన్ని పాఠశాలల్లో పోస్టులు పోతాయని లేని విద్యార్థులను ఉన్నట్లుగా దస్త్రాల్లో చూపారు.

ఆధార్‌ అనుసంధానంతో ఇలాంటి అక్రమాలన్నీ బయటపడుతున్నాయి. ప్రజాసాధికార సర్వేతో మరిన్ని లోపాలు బయటపడినట్లు సంబంధిత అధికారులే చెబుతున్నారు. ఏదీ ఏమైనా సర్వేలో చూపిన విద్యార్థుల స్థితిగతులను తెలపాల్సిన బాధ్యత ఇప్పుడు విద్యాశాఖపై ఉంది. దీనికోసం సర్వశిక్ష అభియాన్‌ ప్రత్యేక దృష్టి సారించింది.

బడిఈడు వయస్సు కలిగిన ఆరేళ్ల నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య అమలు చేయాలని విద్యాహక్కు చట్టం చెబుతోంది. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినా బడిఈడు పిల్లలను బడిలో చేర్పించాలన్న లక్ష్యం నెరవేరడం లేదు. ఇప్పటికీ పదుల సంఖ్యలో పిల్లలు బడి బయటే ఉన్నారని విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు