సత్యదేవుని హుండీ ఆదాయం రూ.81.15 లక్షలు

15 Nov, 2016 22:12 IST|Sakshi
అన్నవరం:
సత్యదేవుని ఆలయానికి గత 17 రోజుల్లో (కార్తికమాసం 15 రోజులు) రూ.81,15,186 ఆదాయం వచ్చింది. భక్తులు అధికంగా వస్తున్నందున ఈ నెలలో రెండుసార్లు హుండీలను తెరవాలని నిర్ణయించిన అధికారులు తొలిదఫాగా మంగళవారం వాటిని తెరిచి లెక్కించారు. ఆ లెక్కింపులో నగదు రూ.77,21,429 చిల్లర నాణేలు రూ.3,93,757 లభించాయి. వీటితోపాటు 40 గ్రాముల బంగారం, 213 గ్రాముల వెండి కూడా లభించాయని దేవస్థానం చైర్మ¯ŒS రోహిత్, ఈఓ కె.నాగేశ్వరరావు తెలిపారు. నగదుతోపాటు అమెరికా డాలర్లు 59, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ దీనార్లు 30, సింగపూర్‌ డాలర్లు 10, మలేషియా రిమ్స్‌ ఒకటి, కెనడా డాలర్లు వంద, నేపాల్‌ రూపాయలు ఐదు లభించాయి.
హుండీ కానుకల్లో అన్నీ చిన్న నోట్లే...
హుండీ కానుకల్లో 80 శాతానికిపైగా రూ.వంద, రూ.50, రూ.20, రూ.పది నోట్లే ఉన్నాయి. దీంతో తమ ’పెద్ద’ నోట్లు తీసుకుని చిన్న నోట్లు ఇవ్వాలని స్థానిక స్టేట్‌ బ్యాంక్‌ అధికారులను పలువురు దేవస్థానం సిబ్బంది, వ్యాపారులు ప్రాధేయపడ్డారు.  కొంతమంది ప్రముఖులతో ఒత్తిడి కూడా తెచ్చినా తమ ఖాతాదారులకు అవసరమని చెప్పి బ్యాంకు సిబ్బంది వెళ్లిపోయారు. 
సత్యదేవుని ఆలయం వెలుపల గల ప్రధాన హుండీ తాళం చెవి లేకపోవడంతో దానిని మంగళవారం తెరవలేదు. ఆ హుండీ దాదాపుగా నిండిపోయింది. దాని తాళాలు భద్రపరచడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ పరిస్థితి తలెత్తిందని ఈఓ తెలిపారు. దేవాదాయశాఖ ఏసీకి విషయం తెలియజేశామని, ఆయన సమక్షంలో బుధవారం ఆ హుండీ తాళాలను పగలకొట్టి కానుకలను లెక్కిస్తామని ఈఓ తెలిపారు. 
 
>
మరిన్ని వార్తలు