పోలీసుల భద్రత సొమ్ము రెట్టింపు: డీజీపీ

26 Aug, 2015 04:05 IST|Sakshi
పోలీసుల భద్రత సొమ్ము రెట్టింపు: డీజీపీ

సాక్షి, హైదరాబాద్: పోలీసుశాఖలో భద్రత పథకం కింద సిబ్బందికి ఇచ్చే రుణ పరిమితిని, ఎక్స్‌గ్రేషియా సొమ్మును పెంచుతున్నట్లు డీజీపీ అనురాగ్‌శర్మ వెల్లడించారు. గృహనిర్మాణ అడ్వాన్స్ కింద ప్లాట్ కొనుగోలు కోసం సిబ్బందికి రూ.5 లక్షల వరకు పరిమితిని పెంచుతున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే హెడ్‌కానిస్టేబుల్, పీసీలు, ఏఎస్సై, ఏఆర్ ఎస్సైలకు పరిమితిని రూ.7 లక్షలకు, ఎస్సై క్యాడర్‌లో ఉన్న అధికారులకు రూ.9 లక్షలకు, డీఎస్పీ ఆపై అధికారులకు 11 లక్షలకు పెంచుతున్నట్లు డీజీపీ వివరించారు.

అలాగే నిర్మించిన ఇళ్ల కొనుగోలు కోసం ఇచ్చే సొమ్మునూ భారీగా పెంచారు. వివిధ స్థాయిల్లో ఉన్న అధికారులకు రూ.8 లక్షల నుంచి 23 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. సిబ్బంది పిల్లలు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళేందుకు ఇస్తున్న లోన్లను 15 లక్షలకు పెంచారు. వ్యక్తిగత రుణాలతో పాటు కుమార్తెల వివాహం కోసం తీసుకునే రుణ సదుపాయాన్ని రూ.4 లక్షలకు పెంచారు. రుణ సౌకర్యం కోసం ఉన్న నిబంధనలను కూడా కాస్త సడలించారు.

గతంలో పదవీ విరమణకు ఐదేళ్ల సర్వీసు ఉంటేనే రుణ సదుపాయం కలిగేది. ప్రస్తుతం దాన్ని మూడేళ్లకే కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా ఎక్స్‌గ్రేషియా విషయంలో సహజ మరణాల కింద ఏఎస్సై క్యాడర్ వరకు రూ.4 లక్షలకు పెంచగా... ప్రమాదంలో చనిపోయిన సిబ్బందికి రూ.8 లక్షలకు పెంచారు. ఎస్సై నుంచి ఆపై స్థాయి అధికారులకిచ్చే పరిహారాన్ని కూడా రెట్టింపు చేశారు. సహజ మరణాలకు రూ. 8 లక్షలు, ప్రమాదంలో చనిపోతే 16 లక్షలకు పెంచారు. భద్రతపథకానికి సిబ్బంది సమ్మతి మేరకు ప్రతినెలా చెల్లిస్తున్న కంట్రిబ్యూషన్‌ను రెట్టింపు చేసినట్లు డీజీపీ తెలిపారు.
 
ర్యాగింగ్ భూతాన్ని తరిమికొట్టండి
సాక్షి, హైదరాబాద్: ప్రాణాలను హరించే వికృత క్రీడగా మారిన ర్యాగింగ్ భూతాన్ని తరిమికొట్టాలని డీజీపీ అనురాగ్ శర్మ పిలుపునిచ్చారు. ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా ‘సే నో టు ర్యాగింగ్.. ఇట్ మైట్ కాస్ట్ యు’ పేరుతో చేపట్టిన పలు రకాల ప్రచార సామగ్రిని అనురాగ్‌శర్మ మంగళవారం తన ఛాంబర్‌లో ప్రారంభించారు. అనంతరం   మాట్లాడుతూ ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా యూనివర్సిటీ, కాలేజీల్లో అవగాహన కల్పించాలని విద్యార్థులను కోరారు. కార్యక్రమానికి బ్యాట్‌మింటన్ క్రీడాకారిణి నైనా జైస్వాల్, బాడీ బిల్డర్ మీర్ మోతిషా వలీ తదితరులు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు