తెలంగాణ సృజనకు పట్టం!

23 Nov, 2023 13:43 IST|Sakshi

స్టార్టప్‌లకు సహకారం అందించే తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్‌ఐసీ)తాజాగా పీపుల్స్ ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్స్ (పీఎఫ్‌ఐ- 2023)లో తమ ఆవిష్కర్తలు భాగస్వామ్యం వహించనుండటంపై హర్షం వ్యక్తం చేసింది. గ్రాస్‌రూట్స్ ఇన్నోవేషన్స్ ఆగ్మెంటేషన్ నెట్‌వర్క్ (గెయిన్‌), సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ ప్లాట్‌ఫారమ్‌ల (సీ-కాంప్‌) సహకారంతో ‘పీఎఫ్‌ఐ- 2023’ నవంబర్ 28 నుండి డిసెంబర్ 2 వరకు న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరగనుంది. 

‘స్కేలింగ్ ఇన్నోవేషన్స్: ఫ్రమ్ ఐడియా టు ఇంపాక్ట్’ అనే థీమ్‌తో ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, జంతు ఆరోగ్యం, వ్యవసాయ యంత్రాలు, సహజ వనరుల నిర్వహణ, పర్యావరణం, క్లీన్ ఎనర్జీతో సహా వివిధ రంగాలలో డీప్‌టెక్,  గ్రాస్‌రూట్ ఆవిష్కర్తలకు పీఎఫ్‌ఐ- 2023 ఒక వేదిక కానుంది. మన రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నవారిలో బధిరులకు భద్రతా హెచ్చరిక హెల్మెట్ తయారుచేసిన ఎన్‌కే రాజలిపాషా, రోగులకు సహాయపడే హెల్త్ బెడ్ రూపకర్త అల్లాడి ప్రభాకర్, విద్యుత్-పొదుపు, వీధి దీపాల నియంత్రణ ఆవిష్కర్త రాజు ముప్పరపు, వ్యర్థాలను నియంత్రించే యంత్రం తయారు చేసిన తేజస్వి వెలుగపల్లి, వ్యవసాయం, గ్యాస్ సిలిండర్లతో ఆటోమేటెడ్ టైమర్ నియంత్రణ కవాటాలను రూపొందించిన ఎం గోపాల్ సింగ్ ఉన్నారు. తమ ఆవిష్కరణలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించే అవకాశం కలగడంతో వీరంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ సందర్భంగా నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ అనిల్ గుప్తా మాట్లాడుతూ 
తెలంగాణకు చెందిన ఆవిష్కర్తలకు పీఎఫ్‌ఐ- 2023లో అవకాశం కల్పించడం ఆనందదాయకమన్నారు. ఇది ఆవిష్కర్తల సామర్థ్యాన్ని మరింత పెంపొందిస్తుందన్నారు. తెలంగాణ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంత థౌతం మాట్లాడుతూ తెలంగాణకు చెందిన ఆవిష్కర్తలకు జాతీయ వేదికపై తమ ‍ప్రతిభ ప్రదర్శించేందుకు అవకాశం కల్పించడం సంతోషదాయకంగా ఉందన్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో జరిగే ఈ కార్యక్రమంలో నెట్‌వర్కింగ్ అవకాశాలు, సదస్సులు, ప్లీనరీ చర్చలు, ప్యానెల్ చర్చలు స్టోరీ టెల్లింగ్ సెషన్‌లు నిర్వహించనున్నారు. ఇది మేథస్సును పరస్పరం పంచుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. ఈ కార్యక్రమంలో ఆవిష్కర్తలు, పరిశ్రమ నిపుణులు, విధాన రూపకర్తలు, పెట్టుబడిదారులతో పాటు కీలక వాటాదారులు కూడా పాల్గొననున్నారు.
ఇది ‍కూడా చదవండి: ‘రోబో గోడ’: బండరాళ్లను ఎత్తి, క్రమపద్ధతిలో పేరుస్తూ..

మరిన్ని వార్తలు