‘స్కానింగ్‌’ తిప్పలు

10 Sep, 2016 23:37 IST|Sakshi
‘స్కానింగ్‌’ తిప్పలు
  • వందలకొద్దీ ఫైళ్లు
  • గంటల తరబడి నిరీక్షిస్తున్న ఉద్యోగులు
  • ఇందూరు : 
    జిల్లాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా మొన్నటి వరకు ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు ఫైళ్లతో కుస్తీ పడితే... ఇప్పుడు వాటిని స్కానింగ్‌ చేయించేందుకు నానా తిప్పలు పడుతున్నారు. జిల్లాల విభజన గడువు సమీపిస్తుండడంతో ఉరుకులు పరుగుల మీద పనులు చేస్తున్నారు. అయితే కలెక్టరేట్‌ పరిపాలన విభాగంలో మాత్రమే స్కానింగ్‌ యంత్రాలున్నాయి. ఇతర కార్యాలయాల్లో సరైన పరికరాలు లేకపోవడంతో.. వారం క్రితం కలెక్టర్‌ కార్యాలయంలోని అక్షర ప్రణాళిక భవన్‌ వద్ద రెండు స్కానింగ్‌ కౌంటర్‌లను ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్‌ల నిర్వహణ బాధ్యతలను కలెక్టరేట్‌ అధికారులు టెండర్లు నిర్వహించి ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించారు. ప్రభుత్వ కార్యాలయాలలోని ఉద్యోగులు ఫైళ్లను తీసుకుని వచ్చి ఆయా కౌంటర్‌ల వద్ద స్కానింగ్‌ చేయిస్తున్నారు. అయితే రెండే కౌంటర్లు ఉండడంతో పని వేగంగా జరగడం లేదు. దీంతో ఉద్యోగులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. 
    ఒక్కో శాఖలో వందల ఫైళ్లు
    సుమారు వారం రోజుల పాటు ఆయా ప్రభుత్వ శాఖల ఉద్యోగులు శ్రమించి కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల వారీగా ఫైళ్లను విభజించారు. సుమారు నాలుగు దశాబ్దాల ఫైళ్లను స్కానింగ్‌ చేయిస్తున్నారు. ఒక్కో శాఖలో వందల సంఖ్యలో ఫైళ్లున్నాయి. వాటిని అన్నింటినీ స్కానింగ్‌ చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేయడం ఉద్యోగులకు కత్తిమీద సాములా తయారయ్యింది. రెండే కౌంటర్లు ఉండడంతో గంటలకొద్దీ సమయం స్కానింగ్‌ కౌంటర్‌ వద్దే గడిచిపోతోందని ఉద్యోగులు పేర్కొంటున్నారు. మరోవైపు జిల్లాల విభజన గడువు సమీపించడంతో ఒత్తిడి పెరుగుతోందంటున్నారు. అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తే పనిలో వేగం పెరుగుతుందంటున్నారు. 
>
మరిన్ని వార్తలు