ఇంకెప్పుడు?

22 Sep, 2016 23:35 IST|Sakshi
ఇంకెప్పుడు?

– రబీ వస్తున్నా సిద్ధం కాని విత్తన ప్రణాళిక
– రాయితీ పప్పుశనగ పంపిణీకి కుదరని ముహూర్తం
– రక్షకతడికే పరిమితమైన వ్యవసాయ శాఖ


జిల్లాలో అక్టోబర్‌ ఒకటి నుంచి రబీ వ్యవసాయ సీజన్‌ ప్రారంభం కానుంది. ఈ సీజన్‌కు సంబంధించి విత్తన ప్రణాళిక తయారు∙చేయడంలో వ్యవసాయ శాఖ అధికారులు నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారు. రైతులకు విత్తన పప్పుశనగ, వేరుశనగ సకాలంలో అందడం కష్టంగానే కనిపిస్తోంది.
 
అనంతపురం అగ్రికల్చర్‌ : నైరుతి రుతుపవనాలు తీవ్రంగా నిరుత్సాహపరచడంతో ఖరీఫ్‌ పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 7.45 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఖరీఫ్‌ పంటలు సాగయ్యాయి. ఇందులో వేరుశనగ  అత్యధికంగా  6.09 లక్షల హెక్టార్లలో సాగైంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల పంట తుడిచిపెట్టుకుపోవడంతో రైతులు కోట్లాది రూపాయల పెట్టుబడులను నష్టపోతున్నారు.

ఈ పరిస్థితుల్లో వారి ఆశలన్నీ ఈశాన్య రుతుపవనాలపైనే పెట్టుకున్నారు. కనీసం ‘ఈశాన్య’మైనా కరుణిస్తే ఖరీఫ్‌ కష్టాల నుంచి కాస్తయినా గట్టెక్కవచ్చని భావిస్తున్నారు.  వారి ఆశలకు అనుగుణంగా రబీ పంటల సాగుకు సన్నద్ధం చేయడంలో  వ్యవసాయశాఖ నిర్లిప్తత ప్రదర్శిస్తోంది. ఈ రబీలో 50 వేల క్వింటాళ్ల పప్పుశనగ, 13,500 క్వింటాళ్ల వేరుశనగ పంపిణీ చేస్తామని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ విత్తన ప్రణాళిక కాగితాలకే పరిమితమైంది. ఉన్నతస్థాయి అధికారుల ముద్ర ఎప్పుడు పడుతుందో, విత్తనం ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి.

రక్షకతడి హడావుడిలో అధికారులు
ఖరీఫ్‌లో ఎండిన వేరుశనగ పంటను కాపాడతామంటూ వ్యవసాయశాఖ అధికారులు  ‘రక్షకతడి’ పేరుతో నానా హడావుడి చేస్తున్నారు. ఈ క్రమంలో రబీ సీజన్‌ను  విస్మరిస్తున్నారు. సీజన్‌ సమీపిస్తున్నా సన్నాహక చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఖరీఫ్‌తో పోల్చితే రబీలో పంటల విస్తీర్ణం తక్కువగానే ఉంటుంది. అయినా రైతులకు సకాలంలో విత్తన పప్పుశనగ, వేరుశనగ అందజేయాల్సిన బాధ్యత వ్యవసాయశాఖపై ఉంది. రబీలో జిల్లా వ్యాప్తంగా 1.75 లక్షల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగులోకి రానున్నాయి. ఇందులో ప్రధానంగా పప్పుశనగ 80 –90 వేల హెక్టార్లు, వేరుశనగ 20 వేల హెక్టార్లు, ఇతర పంటలు  40–50 వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేసే అవకాశముంది.

సెప్టెంబర్‌లోనే రైతులకు అవసరమైన విత్తన పప్పుశనగ రాయితీపై ఇవ్వాల్సి ఉంది. గత ఏడాది సెప్టెంబర్‌ 23న విత్తన పప్పుశనగ పంపిణీ ప్రారంభించారు. ఈ సారి ఇంకా ఆ దిశగా దష్టి పెట్టలేదు. విత్తన పప్పుశనగ ధర ఈ సారి భారీగా పెంచేయడంతో గత ఏడాదితో పోల్చితే జిల్లా రైతులపై రూ.8 కోట్లకు పైగా అదనపు భారం పడనుంది. బయోమెట్రిక్‌ ద్వారా ఒక్కో రైతుకు గరిష్టంగా 50 కిలోలు మాత్రమే ఇవ్వనున్నారు. చెన్నై నుంచి విత్తన కూపన్లు రావాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఈ నెలలో విత్తన పంపిణీ ప్రారంభించే అవకాశాలు కనిపించడం లేదు.

జిల్లా అధికారులు కూడా రబీపై శ్రద్ధ చూపకుండా వేరుశనగకు రక్షకతడి అంటూ కలెక్టరేట్‌లోని కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ రూంలోనే నెల రోజులుగా తిష్ట వేశారు. రబీలో ఇంకా ఏ పంటలు వేసుకోవాలి, ఇతరత్రా సమాచారం గురించి చెప్పేనా«థులే కరువయ్యారు.  ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తుండడంతో  ఈ నెల ఆఖరి వారం నుంచే నల్లరేగడి నేలలు ఉన్న 27 మండలాల్లో పప్పుశనగ సాగుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. కానీ... విత్తన పంపిణీ గురించి ఇప్పటికీ ప్రకటన చేయకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. మండలాల వారీగా కేటాయింపులు, పంపిణీ విధానం, పంపిణీ తేదీ వెంటనే ప్రకటించాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు