ఆశల పల్లకిలో..

1 Mar, 2017 02:33 IST|Sakshi

నామినేటెడ్‌ అభ్యర్థుల ఎంపికలో ఎమ్మెల్యేలే కీలకం
రెండు గంటల పాటు జరిగిన సమావేశం
పదవులపై నాయకుల గురి
అధినేతల వద్ద అప్పుడే పెరిగిన పైరవీలు
వివిధ స్థాయి పదవులపై కన్నేసిన నేతలు
అధిష్టానం చుట్టూ ‘ద్వితీయ’ తలల చక్కర్లు
హైదరాబాద్‌లో భేటీ అయిన కీలక నేతలు పాల్గొన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు


కరీంనగర్‌ : టీఆర్‌ఎస్‌ నేతలు నామినేటెడ్‌ పోస్టులపై గురి పెట్టారు. ఇప్పటికే ఆలస్యం అవుతోందని భావించిన సీఎం కేసీఆర్, మార్చి 8లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావించారు. ఇదే విషయాన్ని ఆయా జిల్లాల ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులకు సూచించారు. బడ్జెట్‌ సమావేశాలకంటే ముందుగానే నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. పార్టీ కోసం కష్టపడిన, అంకితభావంతో పనిచేసిన నాయకులు, కార్యకర్తలను దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేయాలని కేసీఆర్‌ సూచించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం భేటీ అయిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంగళవారం నుంచి ఉమ్మడి జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాల కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో నామినేటెడ్‌ పదవుల భర్తీ కోసం మంత్రి కేటీఆర్‌ అధ్యక్షతన ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎంపీలు వినోద్‌కుమార్, బాల్క సుమన్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఐడీసీ చైర్మన్‌ ఈద శంకర్‌రెడ్డి హైదరాబాద్‌లో సోమవారం రాత్రి సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది.

రాష్ట్ర, జిల్లాస్థాయిల పదవులపై గురి..
టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పార్టీలో పనిచేస్తున్న సీనియర్‌ నేతలు రాష్ట్ర, జిల్లా స్థాయి నామినేటెడ్‌ పదవులపై గురి పెట్టారు. ఇప్పటికే ఆర్టీసీ, టీఎస్‌ఎండీసీ, ఐడీసీ, పౌరసరఫరాల తదితర కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించినా.. డైరెక్టర్లు, సభ్యులను నామినేట్‌ చేయలేదు. అలాగే.. జిల్లా గ్రంథాలయ సంస్థ, దేవాలయాలతోపాటు అనేక కమిటీలకు పాలకవర్గాన్ని నియమించాల్సి ఉంది. వాస్తవానికి 2014 జూన్‌ 2న కేసీఆర్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడమే ఆలస్యం.. ఆ మరుసటి రోజు నుంచి నేతలు పదవుల వేటలో పడ్డారు. అయితే.. పార్టీని, పాలనను గాడిలో   పెట్టే వరకు నామినేటెడ్‌ పదవుల ఊసే లేదన్నారు. ఈ మేరకు గతేడాది ఏడాది ఫిబ్రవరి వరకు పార్టీ సభ్యత్వ సేకరణ, సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసి.. జిల్లా, రాష్ట్ర కమిటీలను కూడా వేశారు. ఆ తర్వాత గోదావరి పుష్కరాలు, హరితహారం, గ్రామజ్యోతి, మిషన్‌ కాకతీయ తదితర కార్యక్రమాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నామినేటెడ్‌ పదవులు ఆశిస్తున్న వారు ఈ కార్యక్రమాల్లో ఏ మేరకు బాధ్యతాయుతంగా వ్యవహరించారో అన్న గ్రేడింగ్‌ కూడా ఉంటుందన్నారు. అయితే.. దాదాపు ఏడాది కాలంగా అరకొరగా కార్పొరేషన్లు, దాదాపుగా మార్కెట్‌ కమిటీలకు పాలకవర్గాలను నియమించగా.. చాలాపోస్టులు వాయిదా పడ్డాయి. ఇదే సమయంలో ప్రభుత్వం ఈ వారంలో నామినేటెడ్‌ పదవుల భర్తీకి శ్రీకారం చుడుతుండగా.. ఆ పదవులను దక్కించుకునేందుకు ఆశావహులు పోటాపోటీగా తలపడుతున్నారు.

కార్పొరేషన్‌ చైర్మన్లు, డైరెక్టర్లు, దేవాలయాలు కావేవీ అనర్హం..
మొదటి నుంచీ పార్టీలో పనిచేస్తున్న సీనియర్‌ నేతలు, నాయకులు రాష్ట్ర, జిల్లా స్థాయి నామినేటెడ్‌ పదవుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆగ్రోస్, గ్రంథాలయ తదితర రాష్ట్రస్థాయి కార్పొరేషన్లకు చైర్మన్, డైరెక్టర్‌ పదవులు, దేవాలయాలు, గ్రంథాలయాలు.. తమకు కావేవీ అనర్హం అంటున్నారు ఆశావహులు. పట్టుమని వారం రోజుల్లో నామినేటెడ్‌ పదవులను భర్తీ చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉండటం.. ఈ మేరకు మంత్రుల నేతృత్వంలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తుది జాబితా కోసం కసరత్తు చేయడం చర్చనీయాంశంగా మారింది. జిల్లాస్థాయిలో ఫుడ్‌ అడ్వయిజరీ (జిల్లా, రెవెన్యూ స్థాయిలో) కమిటీ, గ్రంథాలయ సంస్థ, జిల్లా, నియోజకవర్గం అసైన్‌మెంట్‌ తదితర కమిటీల కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మార్చి 8న అసెంబ్లీ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ఉండగా.. ఈలోపే కమిటీలు వేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించి, మంత్రులను ఆదేశించారు. ఈ క్రమంలో నామినేటెడ్‌ పదవుల భర్తీ ప్రక్రియ ఒక్కసారిగా వేడెక్కడం ఆశావహుల్లో ఆందోళన మొదలైంది. ఇదే సమయంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు సంబంధించి ‘నామినేటెడ్‌’ అభ్యర్థుల జాబితా తయారు చేసేందుకు సోమవారం రాత్రి మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్‌.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులతో సమావేశం అయ్యారు. మంగళవారం లేదా బుధవారం నాటికి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో నామినేటెడ్‌ పదవుల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇదే సమయంలో నాలుగు జిల్లాల టీఆర్‌ఎస్‌ కమిటీలను కూడా ప్రకటించనున్నారు.  

ఎమ్మెల్యేలే కీలకం..
కాగా.. ఈ నామినేటెడ్‌ పోస్టులకు అభ్యర్థుల ఎంపికలో ఎమ్మెల్యేలే కీలకం కానున్నారు. అభ్యర్థుల ఎంపిక బాధ్యతను సీఎం కేసీఆర్‌ పూర్తిస్థాయిలో ఎమ్మెల్యేలకే అప్పగించారు. 2001 నుంచి పార్టీలో ‘కీ’లకంగా వ్యవహరించి.. పార్టీని నమ్ముకుని పనిచేసిన వారికి ప్రాధాన్యం కల్పించాలన్నారు. నియోజకవర్గాల వారీగా జాబితా తయారు చేసి మంగళవారం సాయంత్రం వరకు ఎమ్మెల్యేలు జాబితాను అందివ్వాల్సి ఉంది.

మరిన్ని వార్తలు