సిద్దిపేట నెం.1

13 Apr, 2016 03:05 IST|Sakshi
సిద్దిపేట నెం.1

జాతీయ ఖ్యాతి
‘పంచాయతీ స్వశక్తికరణ్’ పేరిట మూడు అవార్డులు
24న ప్రధాని చేతుల మీదుగా ప్రదానం
మండలంలో హర్షాతిరేకాలు
క్రెడిట్ అంతా మంత్రిదేనని స్పష్టీకరణ

సిద్దిపేట రూరల్: సమష్టి కృషితో సిద్దిపేట పరుగులు తీస్తోంది. అభివృద్ధితోపాటు పారిశుద్ధ్యం, ప్రభుత్వ పథకాల అమలులో దూసుకుపోతోంది. ఓవైపు మంత్రి హరీశ్‌రావు సహకారం.. మరోవైపు ప్రజాప్రతినిధుల ఉత్సాహం.. ఇంకోవైపు అధికారులు, సిబ్బంది చురుకుదనం కలగలసి సిద్దిపేట అన్ని విధాలా అభివృద్ధి సాధిస్తోంది. సిద్దిపేట మండలం ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు పొందింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పంచాయతీ స్వశక్తికరణ్’ అవార్డులను మూడింటిని దక్కించుకుని రికార్డు సృష్టించింది. మూడు కేటగిరీల్లోనూ సిద్దిపేటకు స్థానం లభించింది.

ప్రభుత్వ కార్యకలాపాల సక్రమ నిర్వహణకు గాను సిద్దిపేట మండలం, పారిశుద్ధ్య విభాగంలో ఇబ్రహీంపూర్, పథకాల అమలు (సోషల్ సెక్టార్)లో లింగారెడ్డిపల్లి గ్రామాలు ఉత్తమంగా ఎంపికయ్యాయి. ఇందులో ఇబ్రహీంపూర్ మంత్రి హరీశ్‌రావు దత్తత గ్రామం కావడం గమనార్హం. ఈ అవార్డులను ఈనెల 24న ప్రధాని చేతుల మీదుగా అందుకోనున్నారు. అవార్డుల పంట పండడంతో మండలంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, మండలంతోపాటు ఆయా గ్రామాల ప్రజలు ఆనందంలో మునిగిపోయారు. చేసిన కష్టానికి ఫలితం లభించిందని వ్యాఖ్యానించారు. తామెంత చేసినా ఇందులో మంత్రి హరీశ్‌రావు చొరవే అధికమని వారు చెబుతున్నారు. ఈ అవార్డుల ఫలితం కూడా మంత్రికే దక్కుతుందని వారు భావిస్తున్నారు.

ఐక్యతే ముందుకు నడిపించింది...
ఇబ్రహీంపూర్ గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రజలంతా ఐక్యంగా కదిలారు. పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగు పరిచేందుకు ఇంటింటికీ ఇంకుడు గుంతలు నిర్మించాం. ప్రతి ఇంటిముందు ఐదు మొక్కలు నాటించాం. వాటి సంరక్షణ బాధ్యత ఆ ఇంటి యజమానికే అప్పగించాం. గ్రామంలో జరుగుతోన్న అభివృద్ధి పనుల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములవుతున్నారు. మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో పారిశుద్ధ్యంలో నంబర్ వన్‌గా నిలిచాం.  - కుంబాల లక్ష్మి, సర్పంచ్, ఇబ్రహీంపూర్

 అందరి సహకారంతో...
ప్రజలందరి సహకారంతో లింగారెడ్డిపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాం. పాలకవర్గంతోపాటు గ్రామస్తులతో చర్చించి అభివృద్ధి పనులపై నిర్ణయం తీసుకుంటాం. ప్రధానంగా తడి,పొడి చెత్త వేరు చేయడం మంచి సత్ఫలితాలనిచ్చింది. మంత్రి హరీశ్‌రావు సంపూర్ణ సహకారంతో గ్రామంలో అన్ని పథకాలు ప్రజల దరికి చేరవేరుస్తున్నాం.  - బొండ్ల రామస్వామి, సర్పంచ్, లింగారెడ్డిపల్లి

 మంత్రి సహకారంతోనే అవార్డులు...
మంత్రి హరీశ్‌రావు సహకారంతో మండలం అన్ని విధాలా అభివృద్ధి సాధిస్తోంది. జాతీయ స్థాయిలో సిద్దిపేట మండలానికి మూడు పురస్కారాలు రావడం వెనుక మంత్రి కృషి ఎంతో ఉంది. మండలంలో అన్ని ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు అవుతున్నాయి. పథకాల అమలుపై కేంద్ర ప్రభుత్వం సిద్దిపేట మండలంతోపాటు, ఇందులోని ఇబ్రహీంపూర్, లింగారెడ్డిపల్లి గ్రామాలు అవార్డులకు ఎంపిక చేయడం సంతోషంగా ఉంది.  - ఎర్ర యాదయ్య, ఎంపీపీ సిద్దిపేట

మరిన్ని వార్తలు