పండగ చేస్కో..

21 Aug, 2016 23:00 IST|Sakshi
సిద్దిపేట పట్టణం
  • జిల్లా కానున్న సిద్దిపేట  
  • 30 సంవత్సరాల స్వప్నానికి నేడు మోక్షం
  • డ్రాప్ట్‌ నోటిఫికేషన్‌ తొలి ఘట్టం
  • చారిత్రాత్మక సంబురంగా సన్నాహాలు
  • జిల్లా పండగకు ప్రజలు సన్నద్ధం
  • అన్ని వర్గాలు ముందుండాలని మంత్రి పిలుపు
  • సిద్దిపేట జోన్‌: 30 ఏళ్ల జిల్లా కల సాకారం కానుండటంతో సిద్దిపేట వాసుల్లో ఆనందోత్సాహాలను నింపుతోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇప్పటికే పట్టణ ప్రజలు కేరింతలు కొడుతున్నారు. ఈక్రమంలో నేడు(సోమవారం) డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ వెలువడుతుండటంతో పండగ చేసుకోనున్నారు.

    30 ఏళ్లుగా డిమాండ్‌
    మెదక్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌, నల్లగొండ జిల్లాల సరిహద్దు గ్రామాలకు కేంద్ర బిందువుగా ఉన్న సిద్దిపేట.. జిల్లా కేంద్రం చేయాలన్న డిమాండ్‌ 30 ఏళ్లుగా ఉంది. ప్రతి ఎన్నికల్లో పార్టీలు జిల్లా కేంద్రంపై హామీలివ్వడం, మర్చిపోవడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలోనే 1983లో అప్పటి ఎన్నికల ప్రచారానికి సిద్దిపేటకు వచ్చిన ఎన్టీఆర్‌కు అప్పటి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన కేసీఆర్‌ సభాముఖంగా జిల్లా ఏర్పాటుపై విజ్ఞప్తి చేశారు.

    నాటి నుంచి నేటి వరకు ప్రతి ఎన్నికల్లో జిల్లా డిమాండ్‌ తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావడం, పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్‌విభజన ప్రక్రియను ముందుకు తేవడంతో సిద్దిపేట జిల్లాకు అంకురార్పణ జరిగింది. దీంతో సోమవారం ప్రభుత్వం అధికారికంగా డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ జారీకి సిద్ధమైంది.

    నెలవేరిన ప్రజల ఆకాంక్ష
    కరీంనగర్‌, మెదక్‌, వరంగల్‌, జిల్లాల సరిహద్దు గ్రామాలను కలుపుతూ రెండు డివిజన్‌లతో, కొత్త మండలాలతో సిద్దిపేట జిల్లా ప్రాతిపాదన జరిగింది. ప్రజల అభీష్టం, అంగీకారం మేరకు జిల్లా కేంద్రం ఏర్పాటు కానుంది. ఆ దిశగా సిద్దిపేట జిల్లాలో కరీంనగర్‌ జిల్లాకు చెందిన ముస్తాబాద్, ఇల్లంతకుంట, హుస్నాబాద్‌, కోహెడతో పాటు వరంగల్‌ జిల్లాకు చెందిన మద్దూర్‌, చెర్యాల, సిద్దిపేట డివిజన్‌ పరిధిలోని గజ్వేల్‌, దౌల్తాబాద్‌, సిద్దిపేట నంగునూరు, చిన్నకోడూరు, నారాయణరావుపేట, తొగుట, కొండపాక, ములుగు, వర్గల్‌, దుబ్బాక మండలాలను కలుపనున్నట్లు ప్రాథమిక రూపకలప్పనలో తేలింది. సోమవారం జారీ చేసే డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ అనంతరం 30 రోజుల పాటు ఆయా ప్రాంతాల ప్రజల సలహాలు, సూచనలు స్వీకరించానున్నారు. తదుపరి ప్రక్రియ అనంతరం దసరా రోజున నూతన జిల్లా ప్రకటన అధికారికంగా వెలువడనుంది.

    చారిత్రాత్మక ఘట్టం
    సిద్దిపేట జిల్లా కేసీఆర్‌ కల. ముఖ్యమంత్రిగా ఆయన హయాంలో సిద్దిపేట జిల్లా ఏర్పాటు కావడం చారిత్రాత్మక ఘట్టం. జిల్లా పునర్‌విభజన జాబితాలో సిద్దిపేట పేరు ఉండటం శుభపరిణామని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం మున్సిపల్ చైర్మన్‌ రాజనర్సు గృహంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

    తెలంగాణ రాష్ట్రం రావడంతోనే సిద్దిపేట జిల్లా సాధ్యమైందన్నారు. దీంతో జిల్లా యూనిట్‌గా పరిగణించి కేంద్ర  ప్రభుత్వం అత్యధిక నిధులు కేటాయిస్తుందన్నారు. కేంద్రీయ విద్యాలయం, స్పోర్ట్‌ స్కూల్‌, స్టేడియం తదితర వసతులు జిల్లా యూనిట్‌గానే మంజూరు అవుతాయని చెప్పారు. డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ సోమవారం వెలువనుందని స్పష్టం చేశారు.

    కేసీఆర్‌కు కృతజ్ఞతగా ఈ నెల నేడు సిద్దిపేటలో భారీ బైక్‌ర్యాలీ నిర్వహించి, సంబరాలు చేయాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజలు ఈ పండగలో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. పట్టణాల్లో 1.50 లక్షల జనాభా పై చిలుకు కలిగి ప్రాంతాన్ని మండల కేంద్రంగా, గ్రామాల్లో 35 వేల జనాభా కలిగిన ప్రాంతాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేయాలని క్యాబినెట్‌ తీర్మానం చేసిందని గుర్తుచేశారు.

    విజయదశమి తీపి జ్ఞాపకం
    తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న సిద్దిపేట ప్రజలకు ఈ దసరా మరో తీపి జ్ఞాపకాన్ని అందించనుందని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. దసరా రోజున సిద్దిపేట జిల్లా కేంద్రంలో నూతన కలెక్టర్‌ పదవి బాధ్యతలు స్వీకరిస్తారన్నారు. జిల్లా ఏర్పాటుతో సిద్దిపేటలో ఉపాధి కల్పన, పరిశ్రమలతో పాటు సకల అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందని చెప్పారు.

    మూడింటి ఘనత కేసీఆర్‌దే..
    సిద్దిపేట ప్రజలకు దశాబ్దాలుగా మిగిలిన మూడు సుదీర్ఘ సమస్యలను పరిష్కరించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి పేర్కొన్నారు. సిద్దిపేటకు రైల్వేలైన్‌, గోదావరి జలాలు, జిల్లా కేంద్రం ఏర్పాటు తెలంగాణ ప్రభుత్వ సారధ్యంలోనే సాధ్యమవుతుందన్నారు.

    నేడు సిద్దిపేటలో జిల్లా పండగ
    ప్రభుత్వం డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ జారీ చేస్తున్న క్రమంలో సోమవారం సిద్దిపేటలో జిల్లా పండగను ప్రజలు ఘనంగా నిర్వహించనున్నారు. నేడు(సోమవారం) మధ్యాహ్నం 12 గంటలకు ఎంపీడీఓ చౌరస్తా వద్దనున్న బాబుజగ్జీవన్‌రాం విగ్రహం నుంచి భారీ బైక్‌ర్యాలీని పట్టణ ప్రజలు, పలు పార్టీల నాయకులు, అన్ని వర్గాల ప్రతినిధుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. అనంతరం బాణసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేయనున్నారు. విలేకరుల సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు శర్మ, దేవునూరి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

     

మరిన్ని వార్తలు