మహాప్రభో పంటలను కాపాడండి

27 Mar, 2017 21:38 IST|Sakshi
మహాప్రభో పంటలను కాపాడండి
- కలెక్టర్‌ను కోరిన ప్రాతకోట గ్రామస్తులు
- నెలన్నర తర్వాత మీకోసం
- తరలివచ్చిన బాధితులు
 
కల్లూరు (రూరల్‌):  ముచ్చుమర్రి ఎత్తిపోతల లిఫ్ట్‌ ఇరిగేషన్‌ నుంచి కేసీ కెనాల్‌కు రెండు పంపుల ద్వారా సాగునీటిని అందించి ఎండుతున్న పంటలను కాపాడాలని పగిడ్యాల మండలం ప్రాతకోట గ్రామ పెద్దలు అంబటి శివశంకర్‌రెడ్డి, ఎంపీటీసీలు రాములు, చిన్న కిష్టన్న, రైతులు శంకర్, పక్కీరప్ప, జలీల్‌ అహ్మద్, లింగారెడ్డి కలెక్టర్‌కు విన్నవించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులోఉండడంతో నెలన్నరపాటు మీకోసం కార్యక్రమం వాయిదా పడి సోమవారం తిరిగి ప్రారంభమైంది. దీంతో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులతో సునయన ఆడిటోరియం కిటకిటలాడింది. జిల్లా కలెక్టర్‌ సిహెచ్‌ విజయమోహన్, జేసీ సి హరికిరణ్, జేసీ 2 రామస్వామి, డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు, హౌసింగ్‌ పీడీ హుస్సేన్‌ సాహెబ్, డీఆర్‌డీఏ పీడీ రామకృష్ణ వినతి పత్రాలు స్వీకరించి ఆయా విభాగాలకు రెఫర్‌ చేశారు. 
వినతుల్లో కొన్ని
– డోన్‌ మున్సిపల్‌ టెండర్లను ఏకపక్షంగా నిర్వహించేందుకు వైఎస్‌ఆర్‌సీపీ నాయకులపై దౌర్జన్యానికి పాల్పడిన టీడీపీ నాయకుడు కేశన్నగౌడుతో పాటు అనుచరులను వెంటనే అరెస్ట్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ విజయమోహన్‌కు బీసీ జన సభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి శేషఫణి యాదవ్‌ ఫిర్యాదు చేశారు.  
  • కల్లూరు మండలం ఉలిందకొండ మజరా గ్రామమైన కొల్లంపల్లి తండాలో రెండు నెలలుగా చుక్క మంచినీరు లేదని ఉన్న రెండు బోర్లలో ఒక్క బోరు పూర్తిగా ఎండిపోయిందని మరోబోరులో చుక్కనీరు రావడం లేదని, పొలాల వెంట వెళ్లి తాగునీటిని ఎత్తుకొచ్చుకుంటున్నామని జేసీ2 రామస్వామితో మొరపెట్టుకున్నారు.  మద్దికెర మండలం బూర్జుల గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు రామనాయక్, లక్కీ నాయక్, లక్ష్మీనాయక్, సుగాలి రెడ్డమ్మ, సుబ్బరాయుడు వినతి పత్రం అందజేశారు.
  • గూడూరు మండలం ఆర్‌ ఖానాపురం గ్రామంలోని 2వేల ఎకరాల్లోని పొలాలకు వెళ్లేందుకు రహదారి లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమస్యను పరిష్కరించాలంటూ రైతులు శ్రీనివాసులు, పెద్ద హనుమన్న, సోలోమాన్‌ కలెక్టర్‌కు విన్నవించారు.
  • మంత్రాలయం ప్రభుత్వ సర్వేయర్‌ రాజేశ్వరి ప్రైవేట్‌ సర్వేయర్‌లను రానివ్వడం లేదని ప్రైవేట్‌ సర్వేయర్లు జేసీ హరికిరిణ్‌కు విన్నవించడంతో  హాజరు పట్టిక వివరాలను తీసుకురావాలని సమస్యను రాకుండా సమన్వయంతో పని చేయాలని జేసీ సూచించారు. 
 
మరిన్ని వార్తలు