మ్యూజియంలో చోరి: నాణెం విలువ రూ.26 కోట్లు | Sakshi
Sakshi News home page

మ్యూజియంలో చోరి: నాణెం విలువ రూ.26 కోట్లు

Published Mon, Mar 27 2017 9:44 PM

Solid gold coin worth $4m stolen from Berlin museum


బెర్లిన్‌ బొడె మ్యూజియంలో హైటెక్‌ దొంగతనం జరిగింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100 కేజీల బరువు గల  రూ.26,00,06,000/- కోట్లు విలువైన బంగారు నాణాన్ని గుర్తు తెలియని దుండగుడు/దుండగులు చోరి చేశారు. అత్యంత భద్రత కలిగిన మ్యూజియంలో నుంచి నాణాన్ని దొంగిలించడం ఇప్పుడు అక్కడ సంచలనం రేపుతోంది. ఈ కాయిన్‌ను కెనడాలో తయారుచేశారు. దీని ముద్దు పేరు 'బిగ్‌ మాపిల్‌ లీఫ్‌'. 24 క్యారెట్ల ప్యూర్‌ గోల్డ్‌తో చేసిన ఈ కాయిన్‌ విలువ అప్పట్లో రూ.6,50,01,500/-.
 
ప్రస్తుత మార్కెట్లో దీని ధర రూ.26 కోట్లకు పైమాటే. రాయల్‌ కెనడియన్‌ మింట్‌ 2007లో ముద్రించిన ఈ కాయిన్‌పై బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 బొమ్మ ఉంది. సోమవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో దొంగతనం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. వంద కేజీల బరువు గల నాణాన్ని ఒక్కరే మోసుకువెళ్లడం సాధ్యం కాదు కాబట్టి కొంతమంది దుండగులు కలిసి ఈ పని చేసినట్లు భావిస్తున్నారు.
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మ్యూజియం వెనుక భాగంలో రైల్వే లైను ఉంది. రైల్వే లైను వద్దకు చేరుకున్న దుండగుడు/దుండగులు నిచ్చెన ద్వారా మ్యూజియం గోడను ఎక్కారు. ఆ తర్వాత మ్యూజియం వెనుకభాగంలో ఉన్న కిటికీని పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అక్కడి నుంచి కాయిన్‌ను ఉంచిన ప్రదేశానికి వెళ్లి కాయిన్‌ను దొంగిలించుకుపోయినట్లు తెలిపారు. రైల్వే ట్రాక్‌ వద్ద నిచ్చెనను గుర్తించినట్లు వెల్లడించారు.
 
అయితే, బుల్లెట్‌ ప్రూఫ్‌ కవచం, 24 గంటలు డేగ కన్నుతో నిఘా ఉండే మ్యూజియంలో ఉన్న కాయిన్‌ను దుండగులు ఎలా ఎత్తుకుపోయారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. విలక్షణ నటుడు కమల్‌హాసన్‌ సినిమా 'గురు'లోలా.. మ్యూజియం రూఫ్‌ నుంచి తాడుకు వేలాడుతూ వచ్చి కాయిన్‌ స్ధానంలో సరిగ్గా అదే బరువు గల మరో వస్తువును ఉంచి దాన్ని దోచుకొని వెళ్లారనే కథనాలు వినిపిస్తున్నాయి. అందుకే దొంగతనం జరిగినప్పుడు సెక్యూరిటీ అలారమ్స్‌ మోగలేదని కొందరు అంటున్నారు.
 
కాగా, భద్రతా వ్యవస్ధ, సిబ్బందిపై మీడియా అడిగిన ప్రశ్నలకు పోలీసులు సమాధానం చెప్పకపోవడంతో ఈ కథనానికి మరింత బలం చేకూరుతోంది. బొడె మ్యూజియంలో ఐదు లక్షల నలభై వేలకు పైగా వస్తువులు ఉన్నాయి. వీటిలో బిగ్‌ మాపిల్‌ లీఫ్‌ మాత్రమే చోరికి గురైనట్లు జర్మన్‌ మీడియా పేర్కొంది.

Advertisement
Advertisement