సమాజ శాంతి కోసం ‘ర్యాపిడ్ యాక్షన్’

8 Oct, 2015 03:47 IST|Sakshi
సమాజ శాంతి కోసం ‘ర్యాపిడ్ యాక్షన్’

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హరిభాయ్ పి. చౌదరి
 
 శామీర్‌పేట్: సమాజ శాంతి కోసం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఏఎఫ్) సేవలు అందించడం ప్రశంసనీయమని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హరిభాయ్ పి. చౌదరి అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ మండలం హఢకీంపేట్‌లోని ఆర్‌ఏఎఫ్ 99వ బెటాలియన్‌లో జరిగిన 23వ వార్షికోత్సవంలో ఆయన ప్రసంగించారు. సమాజంలో శాంతి భద్రతలను నెలకొల్పేందుకు ఆర్‌ఏఎఫ్ బెటాలియన్ శ్రమిస్తోందని తెలిపారు. హోం మంత్రిత్వ శాఖలో పుష్కలంగా నిధులున్నాయని, దేశరక్షణకు ఎలాంటి లోటు లేదన్నారు. సాయుధ దళంలో పనిచేస్తున్న చిన్నస్థాయి జవాన్ల నుంచి ఉన్నతాధికారుల వరకు నేరుగా సంప్రదిస్తే సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు.

దేశసేవకు కృషిచేస్తున్న జవాన్లకు 25ఏళ్లుగా ఎలాంటి పదోన్నతులు దక్కలేదని, ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వారి సమస్యల పరిష్కారానికి నడుం బిగించిందన్నారు. సుమారు 25 వేల మంది జవాన్లకు రిక్రూట్ చేశామని, త్వరలో మరో 5 బెటాలియన్లు అందుబాటులోకి తెస్తామని తెలిపారు.  దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఉగ్రవాదుల కదలికలను పసిగట్టేందుకు కేంద్రం రాష్ట్ర ముఖ్య అధికారులతో కలిసి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సీఆర్‌పీఎఫ్ డీజీ ప్రకాశ్‌మిశ్రా, సీఆర్‌పీఎఫ్ స్పెషల్ డీజీ దుర్గాప్రసాద్, ఆర్‌ఏఎఫ్ ఐజీ బండారి, ఎస్‌ఎస్ ఐజీ విష్ణువర్ధన్‌రావు, 99 ఆర్‌ఏఎఫ్ కమాండెంట్ రిజ్వాన్, మీడియా కో-ఆర్డినేటర్ పాపారావ్ ఉన్నారు.

మరిన్ని వార్తలు