రైతులు మరణిస్తుంటే బతుకమ్మ సంబరాలా? | Sakshi
Sakshi News home page

రైతులు మరణిస్తుంటే బతుకమ్మ సంబరాలా?

Published Thu, Oct 8 2015 3:53 AM

రైతులు మరణిస్తుంటే బతుకమ్మ సంబరాలా? - Sakshi

♦ రైతు భరోసా యాత్రలో కేసీఆర్ కుటుంబంపై భట్టి ధ్వజం
♦ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం అల్లవాడలో నేతల పర్యటన
 
 చేవెళ్ల: రైతు ఆత్మహత్యలతో రాష్ట్రంలో చావుడప్పులు మోగుతుంటే.. సీఎం కేసీఆర్ కుటుం బం మాత్రం బతుకమ్మల పేరుతో సంబరాలు చేసుకుంటోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. ‘రైతు భరోసా యాత్ర’లో భాగంగా బుధవారం కాం గ్రెస్ పార్టీ రాష్ర్ట నాయకులు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం అల్లవాడలో పర్యటించారు. అప్పుల బాధతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బోనగిరి యాదయ్య కుటుంబాన్ని పరామర్శిం చారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో భట్టి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మిగులు బడ్జెట్‌తో రాష్ట్రాన్ని కేసీఆర్‌కు అప్పగిస్తే రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వానికి చేతులు రావడం లేదని విమర్శించారు.

రైతులు నిలువునా ప్రాణాలు తీసుకుంటుంటే ఏమాత్రం చలించట్లేదని దుయ్యబట్టారు. రైతు సమస్యలపై శాసనసభలో గొంతెత్తితే ప్రభుత్వం నియంతృత్వంగా విపక్షాలను బయటకు గెంటేసిందన్నారు. మానవత్వంలేని పాలకులు సమాజహితానికి మంచిదికాదని, పశువులకు ఉండే మానవత్వం రాష్ట్రాన్ని పాలించే హక్కు కేసీఆర్‌కు లేదని ఘాటుగా విమర్శించారు. రైతులు అధైర్య పడొద్దని, ప్రభుత్వం మెడలు వంచైనా రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని భట్టి హామీ ఇచ్చారు.

ప్రభుత్వానికి శుక్రవారం వరకు గడువిస్తున్నామని.. ఏకకాలంలో రుణమాఫీ చేయకుంటే శనివారం నిర్వహించే బంద్‌తో ప్రభుత్వానికి పట్టిన దెయ్యా న్ని వదిలిస్తామని భట్టి హెచ్చరించారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి మూడు గంటలకో రైతు మరణిస్తున్నాడని...టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల కాలంలో 1,500 మంది రైతులు కన్నుమూశారన్నారు. మాజీ మంత్రి పి.సబితారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ దొరలా అహంకారపూరిత పాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.

జిల్లాకు గోదావరి జలాలను తెచ్చేం దుకు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా కేసీఆర్ డిజైన్ మార్చి జిల్లాకు అన్యాయం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ శానససభపక్ష ఉపనేతలు జె.గీతారెడ్డి,  జీవన్‌రెడ్డి, మాజీమంత్రులు డీకే అరుణ, ప్రసాద్ కుమార్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ రంగారెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ ఇన్‌చార్జి పి. కార్తీక్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్, ఎమ్మెల్యేలు వంశీ చందర్‌రెడ్డి, సంపత్‌కుమార్, సి.రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత పాల్గొన్నారు.

Advertisement
Advertisement