ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు

17 Aug, 2016 23:29 IST|Sakshi
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు
  •  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి  రామకృష్ణ 
  • అల్లిపురం (విశాఖ):  ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌ ప్రజల హక్కు అని, కేంద్రం కచ్చితంగా హోదా ఇచ్చి తీరాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్‌ చేశారు. లేకపోతే ఢిల్లీలో ఆందోళన చేపడతామని  హెచ్చరించారు. అల్లిపురం సీపీఐ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారం చేపట్టి రెండేళ్లయినా ఏపీకి కేంద్రం ఏ రకమైన న్యాయం చేయలేదని ఆరోపించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్రం అనుసరిస్తున్న తీరు అభ్యంతరకరమన్నారు. జాతీయ ప్రాజెక్టుగా పోలవరం ప్రకటించినప్పటికీ.. నిధులు కేటాయింపులో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం తాజాగా 70 శాతం నిధులు, రాష్ట్రం 30 శాతం నిధులు కేటాయిస్తామని చెబుతోందన్నారు.ఈ నిధులు కూడా నాబార్డు రుణంగా తీసుకుంటామని చెబుతోందని.. తిరిగి ఆ రుణాలు ఎవరు చెల్లిస్తారన్న దానిపై స్పష్టం లేదన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ప్రకటించడంలోనూ కేంద్రం తాత్సారం చేస్తోందన్నారు. రాష్ట్ర లోటు బడ్జెట్‌ రూ. 16 వేల కోట్లని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల చెబుతుంటే.. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ రూ. 2,803 కోట్లు అని చెబుతున్నారని.. ఇదేమని అడిగితే పరిశీలన చేస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించకుండా ప్రత్యేక ప్యాకేజీతోనే సరిపెట్టాలని కేంద్రం చూస్తోందన్నారు. ధరలు పెరుగుదలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ధర్నాను నిర్వహించినట్లు చెప్పారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జి.ఓబులేసు, జిల్లా కార్యదర్శి ఏజె స్టాలిన్, నగర కార్యదర్శి డి.మార్కండేయులు పాల్గొన్నారు.
>
మరిన్ని వార్తలు