ఇష్టారాజ్యం

20 Jan, 2017 00:03 IST|Sakshi
ఇష్టారాజ్యం

- కేజీబీవీల నిర్వహణను గాలికొదిలేస్తున్న ఎస్‌ఓలు
- సిబ్బందీ అదే తీరు
– అడ్డూ అదుపు లేకుండా అక్రమాలు
– ఉద్యోగుల తొలగింపుతోనైనా తీరు మారేనా?


అనంతపురం ఎడ్యుకేషన్‌ : కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీ) స్పెషలాఫీసర్లు (ఎస్‌ఓలు) ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సిబ్బంది పనితీరుపైనా అనేక విమర్శలొస్తున్నాయి. విద్యార్థినుల పొట్టకొడుతూ అక్రమాలకు పాల్పడుతున్నారనే అపవాదును మూటగట్టుకుంటున్నారు. జిల్లాలో మొత్తం 62 కేజీబీవీలు ఉన్నాయి. వీటిలో సుమారు 10,500 మంది విద్యార్థినులు చదువుతున్నారు. సింహభాగం కేజీబీవీలఽ నిర్వహణ గాడి తప్పింది. ఆడ పిల్లలను సొంత బిడ్డల్లా చూసుకోవాల్సిన స్పెషలాఫీసర్లు, సిబ్బంది వారిని అర్ధాకలితో పెడుతూ వంట సరుకులను అక్రమంగా అమ్ముకుంటున్నారు. ఇటీవల సెలవు రోజుల్లో బొమ్మనహాళ్‌ కేజీబీవీ నుంచి ఎస్‌ఓ, ఆమె బంధువులు సరుకులను బయటకు తరలించారు.

ఇది అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యింది. అధికారుల తనిఖీలో వారు అడ్డంగా దొరికిపోయారు. నార్పల కేజీబీవీ నుంచి అకౌంటెంట్, వంట మనుషులు కలిసి సరుకులు అమ్ముకుంటున్నారు. చివరకు అందులో పని చేస్తున్న సీఆర్టీలు కూడా ఆ సరుకులను కొన్నారు. దీనిపై ఆధారాలతో సహా అధికారులకు ఫిర్యాదులందాయి. మరికొన్ని చోట్ల స్పెషలాఫీసర్లు, అకౌంటెంట్లు కలిసి సరుకుల్లో గోల్‌మాల్‌ చేస్తున్నారు. ట్రేడర్స్‌ నుంచి నెలవారీ మొత్తం మాట్లాడుకుని సెకండ్, థర్డ్‌ గ్రేడ్‌ సరుకులు కూడా తీసుకుంటున్నారు. దీనికితోడు ఎక్కువ మోతాదులో సరుకులు ఇచ్చినట్లు రికార్డులు రాస్తూ 30–40 శాతం బిల్లు మొత్తాన్ని స్వాహా చేస్తున్నారు.

మార్పు వచ్చేనా?
సరుకులు అమ్ముకోవడం, వంట చేస్తూ గంజిమీద పడి అమ్మాయిలు గాయపడడం,  సిబ్బంది బాధ్యతారాహిత్యంఽ తదితర కారణాలతో ఇటీవల ఏకంగా 16 మంది ఉద్యోగులను తొలగిస్తూ కలెక్టర్‌ కోన శశిధర్‌ ఆదేశాలు జారీ చేశారు. మరో ముగ్గురు ఎస్‌ఓలకు స్థానచలనం కల్పించారు. సరుకులు ఇంటికి తరలిస్తూ దొరికిపోవడంతో బొమ్మనహాల్‌ కేజీబీవీ ఎస్‌ఓ మహాలక్ష్మి,  నిర్లక్ష్యంగా ఉన్న నార్పల కేజీబీవీ ఎస్‌ఓ నిర్మల, సరుకులు బయటకు అమ్ముకున్నారనే కారణంతో అక్కడి అకౌంటెంట్‌ అనిత, వంట మనుషులు లక్ష్మీనారాయణమ్మ, పుల్లమ్మ, బీబీ, లీలావతి, డే వాచ్‌ఉమన్‌ అచ్చమ్మ, సీఆర్టీలు సుకన్య, సహీరానస్రిన్‌ను విధుల నుంచి తప్పించారు. వంట చేయిస్తూ గంజి మీదపడి విద్యార్థినులు గాయపడిన ఘటనలో తలుపుల కేజీబీవీ వంట మనుషులు కృష్ణమ్మ, లక్ష్మీదేవి, రమణమ్మ, శాంతమ్మ, నైట్‌వాచ్‌ ఉమన్‌ అంజనమ్మ, ఏఎన్‌ఎం విజయరాణిని తొలిగించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తలుపుల ఎస్‌ఓ శారదను పరిగికి, పరిగి ఎస్‌ఓ సౌమ్యను రామగిరికి, రామగిరి ఎస్‌ఓ సరోజమ్మను  కళ్యాణదుర్గం బదిలీ చేశారు. ఈ చర్యలతోనైనా సిబ్బందిలో మార్పు వచ్చేనా? కేజీబీవీల నిర్వహణ గాడిలో పడేనా? అన్న చర్చ సాగుతోంది.

ఎవరినీ ఉపేక్షించం – దశరథరామయ్య, ఎస్‌ఎస్‌ఏ పీఓ
ఆడ పిల్లలకు మెనూ ప్రకారం భోజనం పెట్టాల్సిందే. సరుకుల్లో నాణ్యత లోపించినా, మెనూ ప్రకారం భోజనం పెట్టకపోయినా ఉపేక్షించం. అందరూ బాధ్యతగా పని చేయాలి. లేదంటే కఠిన చర్యలు తప్పవు.

మరిన్ని వార్తలు