కథా బలంతోనే విజయం

13 Apr, 2017 23:31 IST|Sakshi
కథా బలంతోనే విజయం
కర్నూలు (కల్చరల్‌): చిత్రంలోని కథా బలమే ఈ విజయానికి కారణమని పెళ్లిచూపులు సినిమా రచయితా, దర్శకుడు తరుణ్‌భాస్కర్‌ తెలిపారు. స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో ఆ సినిమాకు సంబంధించి జరిగిన సక్సెస్‌ మీట్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి తక్కువ బడ్జెట్‌తో తీసిన పెళ్లి చూపులు సినిమా అనూహ్యమైన విజయాన్ని సాధించిందన్నారు. సినిమా షూటింగ్‌ జరిగే సందర్భంలో ఇంత విజయం తమను వరిస్తుందని అనుకోలేదన్నారు. కొత్త నటీ నటులతో తీసిన ఈ సినిమా సినీ మేధావుల అంచనాలు దాటి సక్సెస్‌ను అందుకోవడం హర్షణీయమన్నారు. ఆసక్తికలిగిన యువతీ, యువకులు సినీ రంగంలో ప్రవేశించేందుకు ప్రతిభనే ప్రాతిపదికన ఎంచుకోవాలన్నారు. తాను షార్ట్‌ఫిలింలు నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తూ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
 
నిర్మాత తనకు చక్కని అవకాశం కల్పించి మార్గం సుగమం చేశారన్నారు. సభలో ముఖ్యఅతితిగా పాల్గొన్న ప్రముఖ పారిశ్రామిక వేత్త టీజీ భరత్‌ మాట్లాడుతూ పెళ్లి చూపులు చిత్రం యువతకు మంచి సందేశాన్ని అందించిందన్నారు.ఇలాంటి సందేశాత్మక చిత్రాలు ఇంకా రావాల్సిన అవసరం ఉందన్నారు. కర్నూలులో స్టూడియో నిర్మించేందుకు అవసరమైన అన్ని హంగులు ఉన్నాయన్నారు. ఎవరైనా ముందుకొస్తే స్టూడియో నిర్మాణానికి తానూ సహకరిస్తానన్నారు. టీజీవీ యాక్టింగ్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఎంతో మంది యువతీ, యువకులు నటనలో శిక్షణ పొందుతున్నారన్నారు. లలిత కళా సమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో కళాకారులకు కొదవే లేదన్నారు. ఇటీవల తాము నిర్వహించిన షార్ట్‌ఫిలిం పోటీల్లో చాలా మంది యువతీ, యువకులు పాల్గొన్నారన్నారు. అనంతరం పెళ్లి చూపులు సినిమా డైరెక్టర్‌ తరుణ్‌భాస్కర్‌ను ఘనంగా సత్కరించారు. సినిమాలో నటించిన కమిడియన్‌ అభయ్, కెమెరామెన్‌ నగేష్, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత సాయికృష్ణ, నటి తన్విలను వారు ఘనంగా సత్కరించారు.  
 
మరిన్ని వార్తలు