‘ఘంటా’కు జాతీయ కిరీటం

27 Feb, 2017 23:19 IST|Sakshi
‘ఘంటా’కు జాతీయ కిరీటం

వరించిన పీఎస్సీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ పదవి
పులకించిన సుల్తానాబాద్‌ మిత్రులు


సుల్తానాబాద్‌రూరల్‌ (పెద్దపల్లి) :
సుల్తానాబాద్‌ జూనియర్‌ కాలేజీ పూర్వ విద్యార్థి, పెద్దపల్లి జిల్లా వాసి ఘంటా చక్రపాణికి జాతీయ స్థాయి పీఎస్సీ స్టాండింగ్‌ కమిటీల చైర్మన్‌ పదవి లభిం చడం జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేసింది. ఎలిగేడు మండలం ధూళికట్ట గ్రామానికి చెందిన ఘంటా 1981–83 సంవత్సరంలో ఇంటర్మీడియట్‌ విద్యను స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పూర్తి చేశారు. అప్పుడే చదువుల్లో గురువుల ప్రశంసలను అందుకున్న చక్రపాణి అంచెలంచెలుగా ఎదుగుతూ టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా నియమితులయ్యారు.

నామినేటెడ్‌ నియామకాల్లో అత్యున్నతమైన టీఎ స్‌పీఎస్సీ చైర్మన్‌గా ఘంటా చక్రపాణి బాధ్యతలు స్వీకరిం చిన అనంతరం జరిగిన ఉద్యోగ నియామకాల్లో పారదర్శకతను, సంస్కరణలను పాటించి దేశంలోనే పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఇటీవల గుజరాత్‌లో జరిగిన సమావేశంలో ఆయనను జాతీయ స్థాయి పీఎస్సీ స్టాండింగ్‌ కమిటీల చైర్మన్‌గా ఎంపిక చేయడంతో దేశంలోనే పెద్దపల్లి జిల్లాకు వన్నె తెచ్చినట్లయింది. దీంతో సుల్తానాబాద్‌ కళాశాల పూర్వ విద్యార్థులు తమ తోటి మిత్రుడు ఉన్నత స్థాయికి చేరుకోవడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కళాశాలకు పేరు తెచ్చారు
 తోటి పూర్వ విద్యార్థి చక్రపాణి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. పీఎస్సీ స్టాండింగ్‌ కమిటీల చైర్మన్‌గా అతన్ని నియమించడంతో కళాశాల కీర్తి దేశవ్యాప్తమైంది. పారదర్శకత పాటించడంలో టీఎస్‌పీఎస్సీకి ఎంతో పేరు తెచ్చి పెట్టారు.
– ఎండీ వహిదోద్దీన్‌

చదువుల్లో చతురత చూపించారు  
చదువుల్లో చక్రపాణి ఎంతో చతురతను ప్రదర్శించేవారు. ప్రతి సబ్జెక్టుల్లోనూ ముందుంటూ మార్కులు మెరుగ్గా సాధించేవారు. అప్పుడే ఉపాధ్యాయులు ప్రశంసించేవారు. ఉద్యోగ నియమాల్లో అవినీతికి తావు లేకుండా కొత్త విధానాలను ప్రవేశపెట్టి పీఎస్సీ గుర్తింపును ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిపారు. – డి. ప్రకాశ్‌

కళాశాలకే గర్వకారణం
చక్రపాణి మా కళాశాల పూర్వ విద్యార్థి కావడం మాకెంతో గర్వకారణం. ప్రభుత్వ కళాశాలలో చదువుకుని జాతీయ స్థాయిలో గౌరవం పొందడం  ఆనందంగా ఉంది. ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు గుర్తు చేస్తున్నాం. – డి. కల్పన, ప్రిన్సిపాల్‌

మరిన్ని వార్తలు