పర్యాటక ప్రాంతంగా సుంకేసుల

10 Jun, 2016 04:02 IST|Sakshi
పర్యాటక ప్రాంతంగా సుంకేసుల

►   కేసీ కాలువకు నీరు విడుదల చేసిన డిప్యూటీ సీఎం
►  సుంకేసుల జలాశయం జలకళ సంతరించుకుంది. నంద్యాల ప్రాంత తాగునీటి అవసరాలు తీర్చేందుకు గురువారం కేసీ
►  కెనాల్ రెండు గేట్ల ద్వారా 500 క్యూసెక్కుల నీరు విడుదలయింది. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో పాటు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ బ్యారేజీ వద్ద పూజలు నిర్వహించి నీటిని దిగువకు విడుదల చేశారు.

 
కర్నూలు సిటీ/గూడూరు రూరల్: సుంకేసుల బ్యారేజీని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం కె.ఈ.కృష్ణమూర్తి అన్నారు. గురువారం ఆయన జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్‌తో కలిసి సుంకేసుల బ్యారేజీ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి కర్నూలు-కడప కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీజన్ మొదట్లోనే బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరడం సంతోషకరమన్నారు. బ్యారేజీ పూర్తి స్థాయి సామర్థ్యం 1.2 టీఎంసీలు కాగా, ఇప్పటికే సుమారు ఒక టీఎంసీ నీరు వచ్చిందన్నారు. ఇన్‌ఫ్లో దృష్ట్యా నంద్యాల ప్రాంత తాగునీటి అవసరాలకు కేసీ కెనాల్ ద్వారా నీరు విడుదల చేశామన్నారు.


అనంతరం సుంకేసుల బ్యారేజీ కరకట్ట స్థితిగతులపై చీఫ్ ఇంజనీర్ చిట్టిబాబు, పర్యవేక్షక ఇంజనీర్ చంద్రశేఖర్ రావులు డిప్యూటీ సీఎంకు వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, మణిగాంధీ, గొర్రెల సహకార సంఘం చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్, డీఈఈ జవహర్ రెడ్డి, ఏఈఈ అశ్విని కూమారి, కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, కోడుమూరు సీఐ డేగల ప్రభాకర్, గూడురు ఎస్‌ఐ చంద్రబాబు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు